IPL.. హైదరాబాద్ సిటీలో బెట్టింగ్‌ ఫుల్‌

ABN , First Publish Date - 2022-04-28T11:50:36+05:30 IST

ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి.

IPL.. హైదరాబాద్ సిటీలో బెట్టింగ్‌ ఫుల్‌

  • ఇద్దరు నిర్వాహకులు.. మరో నలుగురు అరెస్ట్‌
  • రూ. 1.75 లక్షల నగదు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ : ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న రెండు వేర్వేరు ముఠాలకు చెందిన ఆరుగురిని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 1.75 లక్షల నగదు, బెట్టింగ్‌ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి రాజస్థాన్‌ రాయల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుల మధ్య జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా జోరుగా బెట్టింగ్‌ సాగుతోందని సమాచారం అందింది. అప్రమత్తమైన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. చిలకలగూడ పోలీసులతో కలిసి జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద ఓ ఇంట్లో బెట్టింగ్‌ సాగుతోందని గుర్తించి దాడులు నిర్వహించారు. ప్రధాన నిర్వాహకుడు, చిలకలగూడ నివాసి సాంబారి విజయ్‌కుమార్‌(41), అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు పంటర్లు దగ్గుల రమేశ్‌ (44), మహ్మద్‌ అతీఖ్‌ (38), నందమూడి సంతోష్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 1.21 లక్షల నగదు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


తిరుమలగిరిలోని సూర్య ఎన్‌క్లేవ్‌లోనూ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. బెట్టింగ్‌ నిర్వాహకుడు పిల్లి సాయికుమార్‌(39), పంటర్‌, బేగంపేట్‌ నివాసి పవన్‌ కుమార్‌ జేస్వాని (51)ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 54వేల నగదు, మూడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-04-28T11:50:36+05:30 IST