సమవుజ్జీల సై

ABN , First Publish Date - 2022-05-29T09:30:25+05:30 IST

ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభమైనప్పుడు ఎవరైనా ఊహించారా? గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుందని.. ఈ రెండు జట్లు కనీసం ప్లేఆఫ్స్‌ చేరితే గొప్ప..

సమవుజ్జీల సై

ఐపీఎల్‌ ఫైనల్‌ ఫైట్‌

రాత్రి 8 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

గుజరాత్‌ గీ  రాజస్థాన్‌ అమీతుమీ నేడే

జోరు మీదున్న ఇరు జట్లు



ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభమైనప్పుడు ఎవరైనా ఊహించారా?   గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుందని.. ఈ రెండు జట్లు కనీసం  ప్లేఆఫ్స్‌  చేరితే గొప్ప అనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. లీగ్‌ ఆరంభం నుంచే హార్దిక్‌  నేతృత్వంలోని అరంగేట్ర టైటాన్స్‌ జట్టు పగ్గాల్లేకుండా చెలరేగింది. ప్లేఆఫ్స్‌తో పాటు ఫైనల్‌ బెర్త్‌ను అందరికంటే ముందే ఖరారు చేసుకుంది. ఇక కీలక మ్యాచుల్లో పైచేయి సాధిస్తూ వచ్చిన రాజస్థాన్‌ 2008 తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు తుది పోరుకు అర్హత సాధించింది. మరింకేం.. పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఈ సమవుజ్జీల మధ్య జరిగే అంతిమ సమరంలో కప్పు పట్టుకెళ్లేది ఎవరో నేడు తేలనుంది.


అహ్మదాబాద్‌: డెభ్బై లీగ్‌ మ్యాచ్‌లు.. మూడు ప్లేఆఫ్స్‌ పోటీల తర్వాత ఐపీఎల్‌-15వ సీజన్‌ ఆఖరి సమరానికి సిద్ధమైంది. ఈక్రమంలో అభిమానుల మద్దతు దండిగా ఉన్న జట్లతో పాటు స్టార్లతో కూడిన ఫేవరెట్లు ముందుగానే మట్టికరిచిన వేళ.. తాజా సీజన్‌ అద్భుతంగా రక్తికట్టించింది. ఈనేపథ్యంలో ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య టైటిల్‌ పోరు జరుగనుంది. ఈ రెండు జట్ల మధ్యే జరిగిన తొలి క్వాలిఫయర్‌లో టైటాన్స్‌ గెలిచిన విషయం తెలిసిందే. కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న మొదటిసారే హార్దిక్‌ పాండ్యా అదరగొట్టాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విశేషంగా రాణిస్తున్న ఈ జట్టు తొలి టైటిల్‌తో చరిత్ర సృష్టించాలనుకుంటోంది. అటు తొలి క్వాలిఫయర్‌లో ఓటమి పాలైన రాజస్థాన్‌ ఇప్పుడు మరింత బలం పుంజుకుంది. తమ ప్రధాన ఆయుధం జోస్‌ బట్లర్‌ అండతో సుదీర్ఘ విరామం తర్వాత రెండో టైటిల్‌ పట్టేసి దిగ్గజ వార్న్‌కు ఘనంగా నివాళి అర్పించాలనుకుంటోంది. ఇక ఈ సీజన్‌లో ఆర్‌ఆర్‌తో తలపడిన రెండు సార్లూ టైటాన్స్‌ విజయం సాధించింది. 


జట్లు (అంచనా)

గుజరాత్‌: సాహా, గిల్‌, వేడ్‌, హార్దిక్‌ (కెప్టెన్‌), మిల్లర్‌, తెవాటియా, రషీద్‌ ఖాన్‌, సాయికిశోర్‌, దయాల్‌, జోసెఫ్‌, షమి.

రాజస్థాన్‌: జైశ్వాల్‌, బట్లర్‌, శాంసన్‌ (కెప్టెన్‌), పడిక్కళ్‌, హెట్‌మయెర్‌, పరాగ్‌, అశ్విన్‌, బౌల్ట్‌, ప్రసిద్ధ్‌, మెకాయ్‌, చాహల్‌.


ముగింపు ఉత్సవాలున్నాయ్‌

2019 సీజన్‌ తర్వాత ఈసారి ఐపీఎల్‌లో ముగింపు ఉత్సవాలు జరుగబోతున్నాయి. లక్షా 32 వేల సీటింగ్‌ సామర్థ్యం ఉన్న నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 6.30 నుంచి గంట పాటు ఈ వేడుకలు నిర్వహించనున్నారు.  సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ కచేరితో పాటు రణ్‌వీర్‌ సింగ్‌ డ్యాన్స్‌ ప్రత్యేక ఆకర్షణ కానుంది. అంతేకాకుండా  75 ఏళ్ల భారత స్వాతంత్య్ర ప్రస్థానంతో పాటు ఈ కాలంలో జాతీయ క్రికెట్‌ జట్టు ప్రయా ణంపై ప్రత్యేక షోను ప్రదర్శించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీసీసీఐ చీఫ్‌ గంగూలీ, కార్యదర్శి జైషా అతిథులుగా రానున్నారు. 


ఫేవరెట్‌ హోదాలో..

లీగ్‌లో మొదటిసారి ఆడుతున్న గుజరాత్‌ జట్టు బ్యాటింగ్‌.. బౌలింగ్‌లో సమతూకం పాటిస్తూ చక్కటి వ్యూహాలతో ప్రత్యర్థి జట్లను ఓడిస్తూ ముందుకు సాగింది. వేలంలో పేరున్న ఆటగాళ్లంతా ఇతర జట్లకు వెళ్లిపోయినా టైటాన్స్‌ ఏమాత్రం బెదరలేదు. ఎవరూ పట్టించుకోని డేవిడ్‌ మిల్లర్‌, తెవాటియా, సాహాలతో కూడిన ఈ జట్టును మొదట్లో అభిమానులు సీరియ్‌సగా తీసుకోలేదు. కానీ ఆ ఆటగాళ్లే టైటాన్స్‌కు అండగా నిలిచి ఇప్పుడు టైటిల్‌ పోరు దాకా తీసుకొచ్చారు. వేలానికి ముందు కొనుగోలు చేసిన హార్దిక్‌, శుభ్‌మన్‌ గిల్‌, రషీద్‌ ఖాన్‌ కూడా నిరాశపర్చడం లేదు. తొలి క్వాలిఫయర్‌లో ఇదే జట్టుపై గెలిచిన గుజరాత్‌ అదే ఆటను పునరావృతం చేస్తే విజేతగా నిలవడం ఖాయం. రాజస్థాన్‌ పేసర్‌ ప్రసిద్ధ్‌ ఓవర్‌లో మిల్లర్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లతో క్వాలిఫయర్‌ను ముగించిన తీరు అభిమానులు ఇంకా మర్చిపోలేదు. అటు బట్లర్‌ను కట్టడి చేసేందుకు స్పిన్నర్‌ రషీద్‌ ఎదురుచూస్తున్నాడు.


బదులు తీర్చుకోవాలని..

రాజస్థాన్‌ను బట్లర్‌ వన్‌మ్యాన్‌ ఆర్మీలా ముందుకు నడిపిస్తున్నాడు. ఫైనల్లో అడుగుపెట్టే క్రమంలో అతడి బ్యాట్‌ నుంచి నాలుగు శతకాలు వచ్చాయి. ఎలిమినేటర్‌లో ఒంటిచేత్తో జట్టును గెలిపించి తుదిపోరుకు తీసుకొచ్చాడు. 824 పరుగులతో ఈ సీజన్‌లో బట్లరే టాపర్‌. అతడిని పవర్‌ప్లేలోపే అవుట్‌ చేస్తేనే తమకు అవకాశాలుంటాయనే విషయం టైటాన్స్‌కు కూడా తెలుసు. అందుకే అతడిని కట్టడి చేసే విషయంలో వ్యూహాలు రచిస్తోంది. మరీ బట్లర్‌పైనే భారం వేయకుండా యశస్వీ జైశ్వాల్‌, కెప్టెన్‌ శాంసన్‌, పడిక్కళ్‌, హెట్‌మయెర్‌ బ్యాట్లు ఝుళిపిస్తే జట్టుకు ఎదురుండదు. పేసర్‌ ప్రసిద్ధ్‌తో పాటు బౌల్ట్‌, మెకాయ్‌ గత మ్యాచ్‌లో అద్భుతంగా రాణించారు. చాహల్‌, అశ్విన్‌ పరుగులను కట్టడి చేయాల్సి ఉంది. ఏదేమైనా సమష్టిగా రాణిస్తేనే టైటాన్స్‌తో ఎదురైన పరాజయాలకు బదులు తీర్చుకోవడమే కాకుండా చిరస్మరణీయ విజయం రాజస్థాన్‌ అందుకోగలుగుతుంది.


బట్లర్‌ మరో 25 పరుగులు చేస్తే ఓ ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా వార్నర్‌ (848)ను దాటేస్తాడు. కోహ్లీ (2016లో 973) టాప్‌లో ఉన్నాడు.


ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లలో హసరంగ (26)తో సమానంగా ఉన్న చాహల్‌.. మరో వికెట్‌ తీస్తే సింగిల్‌గా పర్పుల్‌ క్యాప్‌ అందుకుంటాడు.

Updated Date - 2022-05-29T09:30:25+05:30 IST