ఐపీఎల్‌ ఫ్రాంచైజీల దూకుడు

ABN , First Publish Date - 2022-08-13T09:37:02+05:30 IST

ఐపీఎల్‌ ద్వారా వచ్చిన పాపులారిటీతో ఆయా ఫ్రాంచైజీలు ఇప్పుడు విదేశీ లీగ్‌లపైనా దృష్టి సారిస్తున్నాయి.

ఐపీఎల్‌ ఫ్రాంచైజీల దూకుడు

విదేశీ లీగ్‌ల్లో జోరు ఆందోళనలో బీసీసీఐ

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ ద్వారా వచ్చిన పాపులారిటీతో ఆయా ఫ్రాంచైజీలు ఇప్పుడు విదేశీ లీగ్‌లపైనా దృష్టి సారిస్తున్నాయి. ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఈ విషయంలో అందరికంటే ముందుంటున్నాయి. ఇప్పటికే వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా, యూఏఈలో జరిగే లీగ్‌ల జట్లను కొనుగోలు చేశాయి. అయితే విదేశీ లీగ్‌ల్లోనూ ఐపీఎల్‌ జట్లు పాతుకుపోతున్నాయి కాబట్టి తమ ఆటగాళ్లను అక్కడా ఆడించాలనుకుంటే కుదరదు. భారత క్రికెటర్లను ఇతర దేశాల్లో జరిగే టీ20 లీగ్‌ల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతించదు. మున్ముందు కూడా బోర్డు ఇదే నిబంధనకు కట్టుబడి ఉండాలనుకుంటోంది. ఏదిఏమైనా ఈ ధోరణిపై బీసీసీఐలో ఆందోళన నెలకొంటోంది.


‘ప్రపంచ క్రికెట్‌ అబ్బురపడే రీతిలో బీసీసీఐ ఐపీఎల్‌ బ్రాండ్‌ను సృష్టించగలిగింది. ఇప్పుడు ఆ పాపులారిటీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దాదాపు ప్రతీ విదేశీ లీగ్‌లతో ఐపీఎల్‌ ఫ్రాంచైజీ యజమానులకు భాగస్వామ్యం ఉండడం కూడా బీసీసీఐని ఆందోళనపరచే అంశమే. ఎక్కడైనా పెట్టుబడి పెట్టే స్వేచ్ఛ వారికుంది. కానీ ఐపీఎల్‌ పేరును ఉపయోగించుకునేందుకు మాత్రం అనుమతించం’ అని బోర్డు అధికారి తెలిపాడు. మరోవైపు కాంట్రాక్ట్‌లో లేని భారత ఆటగాళ్లను తమ లీగ్‌ల్లో ఆడించేందుకు ఇతర దేశాల బోర్డులు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాయి. ఈమేరకు బీసీసీఐకి కూడా విజ్ఞప్తులు చేస్తున్నాయి. కానీ బోర్డు మాత్రం ఎన్‌వోసీ ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. ఇక యూఏఈలో జరిగే ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 (ఐఎల్‌టీ20)లో ఆడించేందుకు ఆసీస్‌ క్రికెటర్లకు ఇప్పటికే భారీ ఆఫర్‌ను ప్రకటించారు. విదేశీ లీగ్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్న ఐపీఎల్‌ ఫ్రాంచైజీల వివరాలను పరిశీలిస్తే.. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మూడు (కోల్‌కతా, పంజాబ్‌, రాజస్థాన్‌), ఐఎల్‌టీ20లో మూడు (కేకేఆర్‌, ముంబై, ఢిల్లీ), క్రికెట్‌ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మొత్తం ఆరు జట్లను (ముంబై, చెన్నై, లఖ్‌నవూ, సన్‌రైజర్స్‌, రాజస్థాన్‌, ఢిల్లీ) కొనుగోలు చేయడం విశేషం.

Updated Date - 2022-08-13T09:37:02+05:30 IST