కొత్త జోరా.. పాత హుషారా?

ABN , First Publish Date - 2022-05-23T10:11:44+05:30 IST

సుమారు రెండు నెలలపాటుగా ఉర్రూతలూగిస్తోన్న ఐపీఎల్‌ తుది అంకానికి చేరుకొంది. 4 ప్లేఆఫ్స్‌ బెర్త్‌లు ఖరారు కావడంతో.. ఇందులో విజేత ఎవరనే దానిపై విశ్లేషణలు సాగుతు న్నాయి.

కొత్త జోరా.. పాత హుషారా?

ప్లేఆఫ్స్‌ పోరుపై ఉత్కంఠ

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం): సుమారు రెండు నెలలపాటుగా ఉర్రూతలూగిస్తోన్న ఐపీఎల్‌ తుది అంకానికి చేరుకొంది. 4 ప్లేఆఫ్స్‌ బెర్త్‌లు ఖరారు కావడంతో.. ఇందులో విజేత ఎవరనే దానిపై విశ్లేషణలు సాగుతు న్నాయి. కొత్త జట్టు గుజరాత్‌ టాప్‌లో నిలువగా రాజస్థాన్‌, లఖ్‌నవూ, బెంగళూరు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మంగళవారం జరిగే క్వాలిఫయర్‌-1లో రాజస్థాన్‌తో గుజరాత్‌.. బుధవారం జరిగే ఎలిమినేటర్‌లో బెంగళూరుతో లఖ్‌నవూ తలపడ నున్నాయి. అయితే వీటిలో రాజస్థాన్‌ మాత్రమే టైటిల్‌ నెగ్గింది. 


జోరు కొనసాగించేనా..:

లీగ్‌లో కొత్త జట్టయిన గుజరాత్‌ అంచనాలకు మించి రాణించింది. పెద్దగా కెప్టెన్సీ అనుభవం లేని హార్దిక్‌ పాండ్యా తమ జట్టును అందరి కంటే ముందే నాకౌట్‌కు చేర్చాడు. లీగ్‌ దశలో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 10 నెగ్గిన టైటాన్స్‌.. మొత్తం 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. కెప్టెన్‌ పాండ్యాతోపాటు సాహా, శుభ్‌మన్‌ గిల్‌, మిల్లర్‌, తెవాటియా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. ఇక బౌలింగ్‌లో షమి, స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ కీలకం. లక్ష్యాన్ని కాపాడుకోవడం మాత్రం టైటాన్స్‌కు కొంత కష్టంగానే ఉంది. 


మరో టైటిల్‌ వేటలో..:

ఐపీఎల్‌ తొలి టైటిల్‌ విజేతగా నిలిచిన రాజస్థాన్‌.. ఆ తర్వాత అలాంటి ప్రదర్శన చేయలేదు. ఇన్నేళ్లలో మూడుసార్లు ప్లేఆఫ్స్‌ చేరినా.. తుదిపోరులో అడుగుపెట్టలేదు. కానీ ఈసారి చక్కటి ప్రదర్శనతో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 8 నెగ్గింది. 18 పాయింట్లతో టాప్‌-2లో నిలిచింది. ఆరెంజ్‌ క్యాప్‌ ప్లేయర్‌ బట్లర్‌ ప్రధాన బలం. అయితే, అతడు ఇటీవలి మ్యాచ్‌ల్లో విఫలమవుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇక, జైస్వాల్‌, పరాగ్‌, హెట్‌మయెర్‌ జట్టును ఆదుకొంటున్నారు. స్పిన్నర్‌ చాహల్‌ ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్నాడు. 


అదృష్టం కలిసొచ్చేనా..:

కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని లఖ్‌నవూ ఆడిన 14 మ్యాచ్‌ల్లో 9 నెగ్గి 18 పాయింట్లతో.. మూడో ప్లేఆఫ్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. రాహుల్‌, డికాక్‌ జట్టు ప్రధాన ఆయుధాలు. మిడిలార్డర్‌లో దీపక్‌ హుడా, క్రునాల్‌ ఆల్‌రౌండ్‌ నైపుణ్యం జట్టుకు అదనపు బలం కానుంది. పేసర్లు అవేశ్‌, మొహిసిన్‌ ఖాన్‌ అంచనాలకు మించి రాణిస్తున్నారు. లెగ్‌ స్పిన్నర్‌ బిష్ణోయ్‌ జట్టుకు అవసరమైన సమయంలో బ్రేక్‌ అందిస్తున్నాడు. కాగా, ఓపెనర్లు రాహుల్‌, డికాక్‌ విఫలమైతే జట్టు పరిస్థితి తారుమారవుతోంది. ఫినిషర్‌గా స్టొయినిస్‌ మరింతగా మెరవాల్సి ఉంది. 

 

దాహం తీరేనా..:

కోహ్లీ, డుప్లెసి లాంటి స్టార్స్‌ ఆటగాళ్లతో బలంగా కనిపించే బెంగళూరు ఇప్పటి వరకూ టైటిల్‌ నెగ్గలేదు. 7సార్లు ప్లేఆఫ్స్‌ చేరితే.. 3సార్లు రన్నర్‌పగా నిలిచింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో 8 నెగ్గిన బెంగళూరు.. 16 పాయింట్లతో కష్టంగా ప్లేఆ్‌ఫ్సకు చేరుకొంది. లీగ్‌ ఆరంభంలో జోరు చూపినా.. మధ్యలో డీలా పడింది. అయితే, ఆఖర్లో మళ్లీపుంజుకోవడం విశేషం.


కోహ్లీ దారుణంగా విఫలమైనా.. నాకౌట్‌ మ్యాచ్‌లకు ముందు ఫామ్‌లోకి రావడం జట్టుకు సంతోసాన్నిచ్చేదే. కెప్టెన్‌ డుప్లెసి నిలకడగా రాణిస్తున్నా.. మిగతా వారినుంచి సహకారం అంతగా అందడం లేదు. మ్యాక్స్‌వెల్‌ తనశైలిలో పేలిన సందర్భాలు తక్కువే. కాగా, ఫినిషర్‌గా దినేష్‌ కార్తీక్‌ తనను తాను గొప్పగా ఆవిష్కరించుకోవడం సానుకూల పరిణామం. ఇక బౌలింగ్‌లో లంక స్పిన్నర్‌ హసరంగ జట్టుకు ప్రధాన బలంగా మారాడు. హర్షల్‌, సిరాజ్‌ అంతగా ఆకట్టుకోలే కపోయారు. 

Updated Date - 2022-05-23T10:11:44+05:30 IST