IPL Media Rights Auction: అమ్మ బాబోయ్.. ఐపీఎల్ టీవీ, డిజిటల్ హక్కులు ఎన్ని వేల కోట్లు పలికాయో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-06-13T21:19:13+05:30 IST

2023-2027 కాలానికి గాను ఐపీఎల్‌ మీడియా హక్కుల కోసం మొత్తం నాలుగు ప్యాకేజీలుగా విభజించి నిర్వహిస్తున్న ఈ-వేలంలో..

IPL Media Rights Auction: అమ్మ బాబోయ్.. ఐపీఎల్ టీవీ, డిజిటల్ హక్కులు ఎన్ని వేల కోట్లు పలికాయో తెలిస్తే..

2023-2027 కాలానికి గాను ఐపీఎల్‌ మీడియా హక్కుల కోసం మొత్తం నాలుగు ప్యాకేజీలుగా విభజించి నిర్వహిస్తున్న ఈ-వేలంలో టీవీ మరియు డిజిటల్ హక్కులను 44,075 కోట్ల రూపాయలకు రెండు బ్రాడ్‌‌కాస్టింగ్ సంస్థలు దక్కించుకున్నాయి. టీవీ ప్రసార హక్కులను సోనీ దక్కించుకుంది. 410 మ్యాచ్‌లకు ఈ మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు తెలిసింది. టీవీ హక్కుల విలువ కంటే డిజిటల్ హక్కుల విలువ 10 శాతం తక్కువగా ఉందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే.. డిజిటల్ రైట్స్ విలువ మాత్రం డే-1తో పోల్చుకుంటే పెరిగింది. తొలి రోజు ఈ-వేలంలో రూ.19,680 కోట్లు పలికితే రెండో రోజైన ఇవాళ రూ.20,500 కోట్లు పలికినట్లు తెలిసింది. టీవీ హక్కులు రూ.23,575 కోట్లు పలకగా, డిజిటల్ హక్కులు రూ.20,500 కోట్లు పలికినట్లు సమాచారం.



మొత్తంగా 410 మ్యాచులకు గానూ డిజిటల్, టీవీ హక్కుల కోసం రూ.44,075 కోట్లు చెల్లించేందుకు బిడ్డర్లు ముందుకొచ్చినట్లు తెలిసింది. ‘బి’ ప్యాకేజీ కింద భారత ఉపఖండంలో డిజిటల్‌ రైట్స్‌‌ను Viacom 18 దక్కించుకున్నట్లు సమాచారం. స్టార్ ఇండియా 2017 నుంచి 22 వరకూ ఐపీఎల్ డిజిటల్, టీవీ ప్రసార హక్కులను 16,347.50 కోట్లకు సెప్టెంబర్ 2017లో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు.. సోనీ పిక్చర్ నెట్‌వర్క్ ఐపీఎల్ టీవీ మీడియా హక్కులను పదేళ్లకు గానూ రూ.8,200 కోట్లు చెల్లించి దక్కించుకుంది. అలా మొదలైన ఈ ఐపీఎల్ టీవీ, డిజిటల్ హక్కుల వేలం ఇప్పుడు వేల కోట్లు పలుకుతూ బీసీసీఐకి కాసుల వర్షం కురిపిస్తోంది.


ఐపీఎల్‌ ఈ-వేలం విశేషాలివి..

బిడ్డింగ్‌ ప్రక్రియను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. ‘ఎ’ ప్యాకేజీ ప్రకారం భారత ఉపఖండంలో టీవీ హక్కులు, ‘బి’ ప్యాకేజీ కింద భారత ఉపఖండంలో డిజిటల్‌ రైట్స్‌, ‘సి’లో ప్లేఆఫ్స్‌ సహా 18 మ్యాచ్‌లకు డిజిటల్‌ హక్కులు, ‘డి’ ప్యాకేజీని భారత ఉపఖండం మినహా మిగతా దేశాల్లో టీవీ, డిజిటల్‌ హక్కుల కోసం నిర్ణయించారు.


‘ఎ’ ప్యాకేజీలో కనీస ధరగా ఒక్కో మ్యాచ్‌కు రూ. 49 కోట్లు.. ‘బి’లో ఒక్కో మ్యాచ్‌కు రూ. 33 కోట్లు.. ‘సి’లో ధర రూ. 11 కోట్లు.. ‘డి’ కింద రూ. 3 కోట్లు ప్రాథమిక ధరగా బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం ఐపీఎల్‌ మీడియా హక్కుల వేలంలో డిస్నీ స్టార్‌, సోనీ నెట్‌వర్క్‌, వయాకామ్‌ రిలయన్స్‌ 18, జీ నెట్‌వర్క్‌ ఉన్నాయి. ఇప్పటికే గూగుల్‌, అమెజాన్‌, యాపిల్‌ సంస్థలు వేలం నుంచి వైదొలిగాయి. ముందుగా భారత ఉపఖండంలో టీవీ (‘ఎ’ ప్యాకేజీ), డిజిటల్‌ (బి) హక్కుల కోసం వేర్వేరుగా వేలం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వయాకామ్‌ రిలయన్స్‌ 18, డిస్నీ స్టార్‌ సంస్థల మధ్య పోటీ నెలకొన్నట్లు సమాచారం. 2017లో స్టార్‌ ఇండియా సంస్థ ఐదేళ్ల కాలానికిగాను రూ. 16,347 కోట్లతో ఐపీఎల్‌ టీవీ, డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకుంది.

Updated Date - 2022-06-13T21:19:13+05:30 IST