ఇది సినిమాలో సీన్ కాదు: వీడియో షేర్ చేసిన చెన్నై కమిషనర్

ABN , First Publish Date - 2020-11-30T02:11:26+05:30 IST

శాంతిభద్రతల పరిరక్షణకై పాటుపడే పోలీసు వ్యవస్థలో అంకిత భావంతో పనిచేసే రక్షక భటులు ఎంతోమంది ఉన్నారు. ప్రతీ వ్యవస్థలో ఉన్నట్టే...

ఇది సినిమాలో సీన్ కాదు: వీడియో షేర్ చేసిన చెన్నై కమిషనర్

చెన్నై: శాంతిభద్రతల పరిరక్షణకై పాటుపడే పోలీసు వ్యవస్థలో అంకిత భావంతో పనిచేసే రక్షక భటులు ఎంతోమంది ఉన్నారు. ప్రతీ వ్యవస్థలో ఉన్నట్టే ఈ వ్యవస్థలో కూడా మంచిచెడు రెండూ ఉన్నాయనడంలో సందేహం లేదు. అయితే.. దురదృష్టవశాత్తూ పోలీసు వ్యవస్థలో ఉన్న మంచి కంటే చెడు మాత్రమే ఎక్కువగా నలుగురి నోళ్లలో నానుతుంటుంది. వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేసే ఖాకీల గురించి సమాజం చర్చించుకునే సందర్భాలు చాలా తక్కువ. అలాంటి వారికి అంత గుర్తింపు కూడా దక్కదు. కానీ.. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేసే ఎంతోమంది పోలీసులు హీరోలవుతున్నారు. అలాంటి ఓ సూపర్ పోలీస్‌కు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌నే గ్రేటర్ చెన్నై అడిషనల్ పోలీస్ కమిషనర్ మహేష్ అగర్వాల్ ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.


రమేష్ అనే ఒక ఎస్‌ఐ.. మొబైల్స్ దొంగతనం చేసి పారిపోతున్న వారిని వెంటాడి వేటాడి పట్టుకున్న ఆ విజువల్ చూస్తే.. సింగం సినిమాలో సీన్లే గుర్తొస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఈ వీడియో సినిమాలోని సన్నివేశం కాదని, రియల్ లైఫ్ హీరో అంట్లిన్ రమేష్ ఒంటి చేత్తో మొబైల్ స్నాచర్స్‌ను వెంటాడి పట్టుకున్న ఘటనకు సంబంధించినదని మహేష్ అగర్వాల్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ మొబైల్ స్నాచర్‌ను పట్టుకోవడంతో మరో ముగ్గురిని అరెస్ట్ చేసి.. 11 దొంగిలించిన మొబైల్స్‌ను రికవరీ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఎస్‌ఐ రమేష్‌ను మహేష్ అగర్వాల్ పిలిచి మరీ అభినందించారు. మహేష్ అగర్వాల్ పోస్ట్ చేసిన ఈ వీడియో చూసిన నెటిజన్లు రమేష్ వృత్తి పట్ల చూపిన అంకిత భావంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.





Updated Date - 2020-11-30T02:11:26+05:30 IST