ఇరాన్‌–చైనా బంధం‍

ABN , First Publish Date - 2020-07-16T06:13:21+05:30 IST

ఇరాన్‌ చైనాల మధ్య నాలుగువందల బిలియన్‌ డాలర్ల ఒప్పందం గుట్టుచప్పుడు కాకుండా కుదిరిన తరువాత, చాబహార్‌ రైలు ప్రాజెక్టునుంచి భారత్‌ను ఇరాన్‌ పక్కకు తప్పించింది...

ఇరాన్‌–చైనా బంధం‍

ఇరాన్‌ చైనాల మధ్య నాలుగువందల బిలియన్‌ డాలర్ల ఒప్పందం గుట్టుచప్పుడు కాకుండా కుదిరిన తరువాత, చాబహార్‌ రైలు ప్రాజెక్టునుంచి భారత్‌ను ఇరాన్‌ పక్కకు తప్పించింది. నాలుగేళ్ళయినా అడుగు ముందుకు వేయని ఈ ప్రాజెక్టును ఇక మేమే నిర్మించుకుంటామని ఇరాన్‌ ప్రకటించింది. అమెరికా ఆంక్షలు, హెచ్చరికలను కాలదన్ని కుదర్చుకున్న ఈ ఒప్పందం మేరకు సర్వవ్యవస్థల్లోనూ, సకలవిధాలుగానూ ఇరాన్‌కు చైనా సహకరించబోతున్నది. ఇరాన్‌ చమురు పాతికేళ్ళపాటు కారుచవుకగా పొందబోతున్న చైనా, అందుకు ప్రతిఫలంగా దాని చమురు, సహజవాయువు క్షేత్రాల్లోనూ, రవాణా వ్యవస్థల నిర్మాణంలోనూ భారీ పెట్టుబడులు పెడుతుంది. బ్యాంకింగ్‌, టెలీకమ్యూనికేషన్స్‌, పోర్టులు, రైల్వేలతో పాటు ఇరాన్‌ చేపట్టబోయే ప్రతీ భారీ ప్రాజెక్టులోనూ చైనా చేయూత ఉంటుంది. రెండు దేశాలూ సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తాయి, ఆయుధాలు తయారుచేస్తాయి, నిఘాసమాచారాన్ని పంచుకుంటాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే ఈ ఒప్పందంతో ఇకపై నీకు నేను, నాకు నువ్వు అన్న స్థాయిలో రెండు దేశాల మధ్యా దీర్ఘకాలిక, వ్యూహాత్మక బంధం ఏర్పడింది. అమెరికా తన ఆప్త దేశాలకు కట్టబెట్టే గౌరవాలు, హోదాలతో పోల్చితే ఇది ఓ మెట్టుపైనే ఉందని నిపుణుల మాట. చైనాకు ఇంత సన్నిహితంగా జరిగిన తరువాత భారత్‌ విషయంలో ఇరాన్‌ ఈ నిర్ణయం తీసుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.


ఫర్జా‌ద్ చమురు క్షేత్రం అభివృద్ధి పనులనుంచి ఓఎన్‌జీసీ విదేశ్‌ (ఓవీఎల్‌)ను కూడా ఇరాన్‌ తప్పించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పాకిస్థాన్‌లో చైనా నిర్మిస్తున్న గ్వదార్‌ పోర్టుకు పోటీగా ఇరాన్‌లో భారత్‌ ప్రతిపాదించిన చాబహార్‌ వ్యూహాత్మకంగా, వాణిజ్యపరంగా కీలకమైంది. చీటికీ మాటికీ మోకాలడ్డే పాకిస్థాన్‌ను పక్కనబెట్టి, మధ్య ఆసియా, పశ్చిమాసియా, యూరప్‌ వరకూ వాణిజ్యాన్ని విస్తరించగలిగే తోవ ఇది. ఇరాన్‌తో ఒబామా కుదర్చుకున్న అణు ఒప్పందంతో పోర్టు పనులు వేగవంతమై ఒక కొలిక్కివస్తున్న స్థితిలో, ఒప్పందంనుంచి ట్రంప్‌ ఏకపక్ష నిష్క్రమణతో, ఆంక్షలతో పలు అవాంతరాలు ఎదుర్కొంది. ట్రంప్‌కు నచ్చచెప్పుకొని, ఆంక్షలనుంచి చాబహార్‌కు మినహాయింపు సాధించి, విశాలమైన పోర్టులో ఒక టెర్మినల్‌ను దారికితెచ్చుకోవడంతో సరిపోయింది. పదేళ్ళలీజులో ఇంతకు రెట్టింపు సదుపాయాలు సమకూర్చుకొని, రైల్వేలైను నిర్మాణంతో స్వేచ్ఛావాణిజ్య ప్రాంతాన్ని కూడా సమర్థంగా వినియోగించుకోగలిగే అవకాశం ఉండగా, ట్రంప్‌ వీరంగం, మన నిస్తేజం కలగలసి అడుగు కదలకుండా చేశాయి. రైల్వేలైన్‌ నిర్మాణంతోనే పోర్టు గరిష్ట వినియోగం సాధ్యం. ఓ నాలుగువేల కోట్లతో దానిని పూర్తిచేయగలిగే అవకాశాన్ని భారత్‌ చేజేతులా కోల్పోయింది. అమెరికా మిత్రదేశంగా అవతరించి, పలు వ్యూహాత్మక ఒప్పందాలు కుదర్చుకున్న భారత్‌మీద, ఇరాన్‌ చవుక చమురుతో పాటు, ఈ ప్రాజెక్టు విషయంలోనూ ఒత్తిళ్ళు పనిచేసి ఉండవచ్చు. ఏమైతేనేమి, మనకు ఎంతో సన్నిహితంగా ఉన్న ఇరాన్‌కు అమెరికా కారణంగా దూరం జరుగుతున్న స్థితిలో చైనా ప్రవేశించింది. 


రైల్వేలైను తానే నిర్మించుకుంటానన్న ఇరాన్‌ ప్రకటన వెనుక, భారత్‌ సాగదీతతో పాటు చైనా కొత్తగా ఇచ్చిన ధైర్యం బాగా పనిచేసింది. అమెరికా ఆంక్షల వల్ల విదేశీపెట్టుబడులు నిలిచిపోయి, తీవ్రంగా నష్టపోయిన ఇరాన్‌కు చైనా చేయూత లాభిస్తుంది. చైనా పెట్టుబడులు, సాంకేతికత సాయంతో అది నిలదొక్కుకోగలుగుతుంది. ఇరాన్‌ రక్షణ రంగం బలోపేతమై అమెరికాతో వచ్చే ప్రమాదం నుంచి కాపాడగలదు. చైనా అండతో అమెరికా, ఇజ్రాయెల్‌, సౌదీ అరేబియావంటి దేశాలను ఢీ కొట్టగలస్థాయికి ఇరాన్‌ చేరుకుంది. ఇరాన్‌ భాషలో చెప్పాలంటే, ఈ ఒప్పందంతో ఉభయదేశాలూ కలసికట్టుగా అణచివేతకు పాల్పడుతున్న శక్తులను ఓడించగలవు. ఒకపక్క చైనాతోనూ, మరోవైపు ఇరాన్‌తో అమెరికా అనుసరించిన వైరం సహజంగానే ఆ రెండు దేశాలనూ మరింత దగ్గర చేసింది. పశ్చిమాసియాలో చక్రం తిప్పుతున్న అమెరికాకు ఇక చైనా సాయంతో ఇరాన్ సవాలు విసరగలదు. ఈ ఒప్పందంతో ఇరాన్‌ పూర్తిగా చైనా చేతుల్లోకి పోయినట్టే.చైనా ప్రవేశంతో ఇక ఉపసంహరణలు, నిష్క్రమణలే తప్ప భారత్‌ పెట్టుబడులకు భవిష్యత్తులో అవకాశం ఉండదు. భారత్‌ అమెరికా బంధం స్వల్పకాలంలోనే ద్విగుళం బహుళం అయిన తరువాత ఇటువంటి పరిణామాలు ఎదురుకాక తప్పదు. ఇప్పటికీ భారత్‌ తనకు మిత్రదేశమేనంటున్న ఇరాన్‌తో ఇకపై ఎలా వ్యవహరించాలో నిర్ణయించుకోవాలి.

Updated Date - 2020-07-16T06:13:21+05:30 IST