Prophet Mohammad remark row: ఇరాన్ మంత్రి ఆ అంశాన్ని లేవనెత్తలేదు : భారత్

ABN , First Publish Date - 2022-06-10T01:44:24+05:30 IST

మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల గురించి

Prophet Mohammad remark row: ఇరాన్ మంత్రి ఆ అంశాన్ని లేవనెత్తలేదు : భారత్

న్యూఢిల్లీ : మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల గురించి ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్డొల్లాహియాన్ ప్రస్తావించలేదని భారత్ స్పష్టం చేసింది. భారత్ పర్యటనలో ఉన్న అబ్డొల్లాహియాన్ మన దేశ విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారులతో చర్చల సందర్భంగా ఈ విషయం ప్రస్తావించారని, భారత్ వైఖరి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని ఓ వార్తా సంస్థ అంతకుముందు వెల్లడించిన సంగతి తెలిసిందే. 


బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ ఓ టీవీ చర్చలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు దేశ, విదేశాల్లో ముస్లింలకు ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హొస్సేన్ అమీర్ అబ్డోల్లహియాన్‌ (Hossein Amir Abdollahian)ను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ గురువారం తెలిపిన వివరాల ప్రకారం, బీజేపీ మాజీ అధికార ప్రతినిధులు నూపుర్ శర్మ (Nupur Sharma), నవీన్ జిందాల్ (Navin Jindal) చేసిన వ్యాఖ్యలను హొస్సేన్ బుధవారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వద్ద ప్రస్తావించారు. దీనికి దోవల్ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందారు. ఈ విషయాన్ని ఇరానియన్ ఫారిన్ మినిస్ట్రీ కూడా ఓ ప్రకటనలో ధ్రువీకరించింది. హొస్సేన్ ఈ అంశాన్ని దోవల్ వద్ద లేవనెత్తారని, దోవల్ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా ఉందని తెలిపింది. 


విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో విలేకర్లు ఈ వార్తా కథనాలపై ప్రశ్నించారు. ఈ ప్రశ్నలపై అరిందమ్ బాగ్చి స్పందిస్తూ, ప్రవక్త మహమ్మద్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు భారత ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిబింబించబోవని తెలిపారు. ట్వీట్లు, వ్యాఖ్యలు భారత ప్రభుత్వ అభిప్రాయాలకు ప్రతిబింబం కాదని స్పష్టంగా చెప్తున్నామన్నారు. తమ ప్రతినిధులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశామన్నారు. కామెంట్లు, ట్వీట్లు చేసినవారిపై సంబంధిత వ్యవస్థలు చర్యలు తీసుకున్నాయన్నారు. ఈ విషయంలో అదనంగా చెప్పవలసినదేమీ లేదన్నారు. తనకు తెలిసినంత వరకు విలేకర్లు ప్రస్తావించిన ఇరానియన్ ప్రకటనను తొలగించారని చెప్పారు. తనకు తెలిసినంత వరకు ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్డొల్లాహియాన్ మన దేశ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ వద్ద ప్రస్తావించలేదని తెలిపారు. 


Updated Date - 2022-06-10T01:44:24+05:30 IST