ఒంటరి మహిళా ప్రయాణికులకు.. ఐఆర్సీటీసీ సీట్లు ఎలా కేటాయిస్తుందంటే..

ABN , First Publish Date - 2022-01-20T18:00:48+05:30 IST

భారతీయ రైల్వేలు దేశానికి జీవనాడి.

ఒంటరి మహిళా ప్రయాణికులకు.. ఐఆర్సీటీసీ సీట్లు ఎలా కేటాయిస్తుందంటే..

భారతీయ రైల్వేలు దేశానికి జీవనాడి. రైల్వేలు లేకుండా దేశాభివృద్ధిని మనం ఊహించలేం. రైల్వేలు లేకపోతే మన దేశం పూర్తిగా స్తంభించిపోతుంది. ఈ కారణంగానే భారతీయ రైల్వేలను భారతదేశ జీవనరేఖ అని పిలుస్తారు. భారతీయులంతా రైల్వేశాఖ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు.  రైల్వే విభాగంలో సాంకేతికత ప్రవేశంతో ప్రయాణికులకు ఎంతో ఉపశమనం లభిస్తోంది. మనం టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి రిజర్వేషన్ కౌంటర్ వద్ద గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేదు. మన మొబైల్ ఫోన్‌ నుంచే ఎక్కడైనా, ఎప్పుడైనా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం ఐఆర్సీటీసీ సహాయం తీసుకోవాల్సివుంటుంది. ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే వెబ్‌సైట్‌లలో ఒకటి. 


ఐఆర్సీటీసీ అందించే ఇ-టికెటింగ్ సిస్టమ్ ద్వారా ఒక నిమిషంలో 7,200 టిక్కెట్లు బుక్ అవుతాయి. కాగా ఐఆర్సీటీసీ మహిళల భద్రతకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఐఆర్సీటీసీలో మొదట్లో రోజుకు 27 టిక్కెట్లు మాత్రమే బుక్ అయ్యేవి. ప్రస్తుతం ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌లో రోజుకు 5 లక్షలకు పైగా టిక్కెట్లు బుక్ అవుతుంటాయని తెలిస్తే  ఆశ్చర్యం కలుగుతుంది. railrestro.com తెలిపిన వివరాల ప్రకారం టిక్కెట్ల బుకింగ్ సమయంలో ఐఆర్సీటీసీ మహిళలకు చాలా ప్రత్యేక సౌకర్యాన్ని అందిస్తుంది. ఒంటరి మహిళ ఐఆర్సీటీసీ ద్వారా రైలులో టికెట్ బుక్ చేసుకుంటే, అప్పటికే ఒక మహిళ పేరు మీద బుక్ అయిన సీటు పక్కన ఈ మహిళకు సీటు కేటాయింపు జరుగుతుంది. పురుషుల మధ్యలో కూర్చోవడం ఒంటరి స్త్రీకి అభ్యంతరకరం అని భావించి, వారికి భద్రత అందించేందుకు ఐఆర్సీటీసీ ఈ సౌకర్యాన్ని కల్పిస్తుంది.

Updated Date - 2022-01-20T18:00:48+05:30 IST