ఆఖరి బంతికి గట్టెక్కి..

ABN , First Publish Date - 2022-06-29T09:47:38+05:30 IST

ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల సిరీ్‌సను భారత్‌ క్లీన్‌స్వీ్‌ప చేసింది.

ఆఖరి బంతికి గట్టెక్కి..

నాలుగు పరుగులతో గెలుపు 

భారత్‌దే సిరీస్‌

శతక్కొట్టిన హుడా

వణికించిన ఐర్లాండ్‌ 


మలహిడె (డబ్లిన్‌): ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్్ చేసింది. అయితే 226 పరుగుల ఛేదనలో ఆతిథ్య జట్టు అంత సులువుగా ఏమీ లొంగలేదు. ఆరంభం నుంచే మెరుపు దాడికి దిగిన ఈ పసికూన చివరి బంతి వరకు పోటీలోనే ఉండడం విశేషం. కానీ ఆఖరి ఓవర్‌లో 17 రన్స్‌ కావాల్సిన వేళ ఉమ్రాన్‌ 12 పరుగులే ఇచ్చాడు. దీంతో భారత్‌ నాలుగు పరుగుల తేడాతో గట్టెక్కింది. అంతకుముందు దీపక్‌ హుడా (57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 104) చిరస్మరణీయ శతకంతో ఆకట్టుకున్నాడు. అటు సంజూ శాంసన్‌ (42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 77) సైతం సత్తా చాటుకున్నాడు. దీంతో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20  ఓవర్లలో 7 వికెట్లకు 225 పరుగులు చేసింది.


మార్క్‌ అడెయిర్‌కు మూడు, లిటిల్‌.. యంగ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత భారీ ఛేదనలో ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు చేసి ఓడింది. ఓపెనర్లు బల్బర్నీ (37 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 60), స్టిర్లింగ్‌ (18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 40) మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్‌ను వణికించారు. ఆ తర్వాత హ్యారీ టెక్టర్‌ (39), డాక్రెల్‌ (34 నాటౌట్‌), అడెయిర్‌ (23 నాటౌట్‌) చివర్లో పోరాడినా ఐర్లాండ్‌కు నిరాశే ఎదురైంది.  


రికార్డు భాగస్వామ్యం..: 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ మూడో ఓవర్‌లోనే ఓపెనర్‌ ఇషాన్‌ (3)ను కోల్పోయినా.. అక్కడి నుంచి 17వ ఓవర్‌ వరకు మరో ఓపెనర్‌ శాంసన్‌, దీపక్‌ హుడాలదే ఆధిపత్యం సాగింది. ఐర్లాండ్‌ బౌలర్లను ఓ ఆటాడుకుంటూ ఈ ద్వయం కొడితే ఫోర్‌.. లేదంటే సిక్స్‌ అన్నట్టుగా చెలరేగింది. అయితే చివరి నాలుగు ఓవర్లలో ఆతిథ్య బౌలర్లు ఆరు వికెట్లు పడగొట్టినా.. అప్పటికే భారత్‌ భారీ స్కోరు సాధించింది. ముఖ్యంగా హుడా అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో జట్టు పవర్‌ప్లేలో 56 పరుగులు చేసింది. అలాగే పదో ఓవర్‌లో రెండు సిక్సర్లతో హుడా 27 బంతుల్లోనే తొలి హాఫ్‌ సెంచరీని నమోదుచేశాడు.


ఇక 12వ ఓవర్‌లోనూ 4,6,4తో 19 రన్స్‌ రాబట్టి చకచకా శతకం వైపు దూసుకెళ్లాడు. అటు శాంసన్‌ కూడా బ్యాట్‌ ఝుళిపిస్తూ కెరీర్‌లో తొలి ఫిఫ్టీ సాధించడంతో పాటు.. 15వ ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. అయితే అతడి దూకుడును 17వ ఓవర్‌లో అడెయిర్‌ అడ్డుకున్నాడు. అప్పటికి రెండో వికెట్‌కు 176 పరుగుల భాగస్వామ్యం నెలకొనడం విశేషం. ఇక వచ్చీ రాగానే సూర్యకుమార్‌ (15) 6,4 బాదడంతో స్కోరు 200 దాటింది. 18వ ఓవర్‌లో హుడా తొలి శతకం నమోదు చేసుకున్నాడు. కానీ అదే ఓవర్‌లో జోష్‌ లిటిల్‌.. సూర్య, హుడాల వికెట్లు తీశాడు. తర్వాతి రెండు ఓవర్లలో దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌, హర్షల్‌ డకౌట్లు కాగా హార్దిక్‌ పాండ్యా (13 నాటౌట్‌) చివర్లో కాసిన్ని పరుగులు జత చేశాడు. 


స్కోరుబోర్డు

భారత్‌:

సంజూ శాంసన్‌ (బి)  అడెయిర్‌ 77, ఇషాన్‌ కిషన్‌ (సి) టక్కర్‌ (బి) అడెయిర్‌ 3, దీపక్‌ హుడా (సి) మెక్‌బ్రైన్‌ (బి) లిటిల్‌ 104, సూర్యకుమార్‌ యాదవ్‌ (సి) టక్కర్‌ (బి) లిటిల్‌ 15, హార్దిక్‌ పాండ్యా (నాటౌట్‌) 13, దినేశ్‌ కార్తీక్‌ (సి) టక్కర్‌ (బి) యంగ్‌ 0, అక్షర్‌ పటేల్‌ (సి) డాక్రెల్‌ (బి) యంగ్‌ 0, హర్షల్‌ పటేల్‌ (బి) అడెయిర్‌ 0, భువనేశ్వర్‌ కుమార్‌ (నాటౌట్‌)1. ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 225/7; వికెట్ల పతనం: 1-13, 2-189, 3-206, 4-212, 5-217, 6-217, 7-224; బౌలింగ్‌: మార్క్‌ అడెయిర్‌ 4-0-42-3, జోష్‌ లిటిల్‌ 4-0-38-2, క్రెయిగ్‌ యంగ్‌ 4-0-35-2, గారెత్‌ డెలానీ 4-0-43-0, కానర్‌ ఓల్ఫర్ట్‌ 3-0-47-0, అండీ మెక్‌బ్రైన్‌ 1-0-16-0.


ఐర్లాండ్‌:

స్టిర్లింగ్‌ (బి) బిష్ణోయ్‌ 40, బల్బర్నీ (సి) బిష్ణోయ్‌ (బి) హర్షల్‌ 60, డెలానీ (రనౌట్‌) 0, టెక్టర్‌ (సి) హుడా (బి) భువనేశ్వర్‌ 39, టక్కర్‌ (సి) సబ్‌/చాహల్‌ (బి) ఉమ్రాన్‌ 5, డాక్రెల్‌ (నాటౌట్‌) 34, అడెయిర్‌ (నాటౌట్‌) 23, ఎక్స్‌ట్రాలు: 20; మొత్తం: 20 ఓవర్లలో 221/5; వికెట్ల పతనం: 1-72, 2-73, 3-117, 4-142, 5-189, బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-46-1, హార్దిక్‌ 2-0-18-0, హర్షల్‌ 4-0-54-1, రవి బిష్ణోయ్‌ 4-0-41-1, ఉమ్రాన్‌ మాలిక్‌ 4-0-42-1, అక్షర్‌ పటేల్‌ 2-0-12-0.

Updated Date - 2022-06-29T09:47:38+05:30 IST