తెరవెనుక నా సామీ!

ABN , First Publish Date - 2022-07-03T06:05:58+05:30 IST

నీటిపారుదలశాఖలో టెక్నికల్‌ అధికారులు ఆడిందే ఆటగా సాగుతోంది.

తెరవెనుక నా సామీ!

 నీటిపారుదల శాఖలో టెక్నికల్‌ అధికారుల ఇష్టారాజ్యం

 బినామీ కాంట్రాక్టర్లకు పనులు దక్కేలా మంత్రాంగం

 పనుల నిర్వహణలో కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతరు

 ఇంకా ఖరారుకాని ఓఅండ్‌ఎం పనులు టెండర్లు

 జాప్యంతో కృష్ణాడెల్టాలో పంటలసాగు ప్రశ్నార్థకం

  నీటిపారుదలశాఖలో టెక్నికల్‌ అధికారులు ఆడిందే ఆటగా సాగుతోంది. ఈ విభాగంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులదే హవా అవుతోంది. వారి బినామీ కాంట్రాక్టర్లకు కాలువల నిర్వహణ పనులు దక్కేలా తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారు. పనుల నిర్వహణలో కలెక్టర్‌ ఆదేశాలను సైతం తుంగలోతొక్కారు. పనులకు టెండర్లు పిలవడంలో కావాలని జాప్యం చేయడంతో ఈ సీజన్‌లో కాలవల ద్వారా సాగునీరు సక్రమంగా అందుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

  కృష్ణాడెల్టాకు బందరుకాలువ ఆయకట్టులో 1.39 లక్షల ఎకరాలు, కేఈబీ కాలువ ఆయకట్టులో 1.27 లక్షల ఎకరాలు, ఏలూరు కాలువ ఆయకట్టు కింద 59వేల ఎకరాలు, రైవస్‌ కాలువ ఆయకట్టులో 2 లక్షల ఎకరాలకు మొత్తంగా 5.25 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీటి నిమిత్తం 150 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. నీటి విడుదల జరుగుతున్న సమయంలో ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఈ ఏడాది కృష్ణా డెల్టాలోని ప్రధాన కాలువల్లో ఓఅండ్‌ఎం పనులు చేసేందుకు రూ.50.12 కోట్లతో అంచనాలు తయారు చేశారు. ఇందులో రూ.15 కోట్లమేర సిమెంటు కాంక్రీట్‌ పనులు కాగా, మిగిలిన రూ.35 కోట్లు కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, నాచు తొలగింపు, రసాయనాలు పిచికారీ చేయడం వంటి పనుల కోసం అంచనాలు రూపొందించారు. ఈ రెండు పనులూ వేర్వేరుగా కాకుండా అనుసంధానం చేసి టెండర్లు పిలవాలని కలెక్టరు ఇటీవల సూచన చేశారని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. కలెక్టర్‌ ఆదేశాలను పట్టించుకోలేదు. 

  టెండర్లలో జాప్యం 

 నీటిపారుదల శాఖలో పనులకు అంచనాలు తయారు చేయడం, టెండర్లు పిలవడం వంటి పనులు చేసే విభాగంలో  అధికారులు 45 రోజులపాటు టెండర్లు పిలవకుండా జాప్యం చేశారని నీటిపారుదల శాఖ అధికారులే చెబుతున్నారు. కాంక్రీట్‌ పనులు చేస్తే కాస్త అటుఇటుగానైనా పనులు కచ్చితంగా చేసి చూపాల్సి ఉంది. తూడు, గుర్రపుడెక్క, నాచులను తొలగించే పనులు సక్రమంగా చేయకుండా మసిపూసి మారేడుకాయ చేసినా బిల్లులు చేసుకోవడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు. కాంక్రీట్‌ పనులు, తూడు ఇతరత్రాలను తొలగించే పనులను కలిపి టెండర్లు పిలవడం కుదరదనే కారణం చూపి టెండర్లు పిలవడంలో జాప్యం చేశారని ఆ శాఖ అధికారులు చెప్పడం గమనించదగ్గ అంశం. 

  బినామీ కాంట్రాక్లర్ల అవతారమెత్తి 

 నీటిపారుదల శాఖ టెక్నికల్‌ విభాగంలో పనిచేసే అధికారులు కాంట్రాక్టర్లను తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. బినామీ కాంట్రాక్టర్లును రంగంలోకి దించారు. వారితో టెండర్లు వేయిస్తుంటారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బినామీ కాంట్రాక్టర్లకు వీరే పెట్టుబడులు పెడతారని ప్రచారం జరుగుతోంది. నీటిపారుదల శాఖ ఉద్యోగులు, అధికారుల్లోనే ఈ వ్యవహారంపై పెద్ద చర్చ నడుస్తోంది. ఏదైనా ప్రాంతంలో అవసరమైన సమయంలో సక్రమంగా, సకాలంలో కాలువల్లో పనులు కాంట్రాక్టర్లు చేయకుంటే, ఆ ప్రాంత అధికారులు ఈ విషయంపై నిలదీస్తే వారిపైనే పైఅధికారులకు ఫిర్యాదులు చేయించి ఒత్తిడి తీసుకురావడం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని నీటిపారుదలశాఖ అధికారులు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. టెక్నికల్‌ ఉద్యోగుల తీరు కారణంగా ఆ శాఖలోని ఉన్నతస్థాయి తోపాటు దిగువస్థాయి అధికారులు ఇబ్బందులు పడుతున్నారనీ, రైతులకు సమాధానం చెప్పలేకపోతున్నారని చర్చ నడుస్తోంది.

  పనులు చేసేందుకు 45 రోజులు ఆలస్యం 

 నీటిపారుదల శాఖలోని టెక్నికల్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓఆండ్‌ఎం పనులు చేసేందుకు ఈ ఏడాది  45రోజులపాటు ఆలస్యం జరిగింది. కృష్ణాడెల్టాలో ఈ ఏడాది చేయాల్సిన ఓఅండ్‌ఎం పనులు ఇంకా ఆమోదం పొందలేదని అధికారులు చెబుతున్నారు. గత నెల 10వ తేదీనే కాలువలకు అధికారికంగా సాగునీటిని విడుదల చేశారు. వివిధ కారణాలతో  జూన్‌ 25వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో కాలువలకు నీటి విడుదల చేస్తున్నారు. ఈలోగా టెండర్లు ఖరారై ఆమోదం పొందితే కాలువల్లో ఉన్న తూడు, గుర్రపుడెక్క, నాచులను కాంట్రాక్టర్లతో చేయించేవారమని క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు అంటున్నారు. టెండర్లు ఖరారు కాకపోడంతో ఎవరితో తాము పనులు చేయించాలని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నపుడు కాలువలు, డ్రెయినేజీలలోని తూడు, నాచు, గుర్రపుడెక్కలపై రసాయనాలు పిచికారీ చేయిస్తే అవి నిర్మూలన అయ్యేవని, కాలువల్లో కొంతమేర నీటి ప్రవా హానికి అడ్డంకులు తొలగేవని అధికారులు చెబుతున్నారు. టెక్నికల్‌ అధికారులు చేసిన నిర్వాకం కారణంగా ఈ ఏడాది  కాలువలను ఎలా నిర్వహించాలో అర్థం కావడంలేదని నీటిపారుదల శాఖ అధికారులు చెప్పుకుంటున్నారు.  

Updated Date - 2022-07-03T06:05:58+05:30 IST