
ఆంధ్రజ్యోతి(10-11-2021)
శరీరంలో అవయవాలన్నీ సక్రమంగా పనిచేయడంలో పోషకాలు, లవణాల పాత్ర కీలకం. ముఖ్యంగా ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను కణాలకు సరఫరా చేయడంలో ఐరన్ కీలకమైనది. సరైన స్థాయిలో ఐరన్ ఉంటే రోగనిరోధక వ్యవస్థ బాగుంటుంది.
ఐరన్ లోపిస్తే కణాలకు, కండరాలకు అందే ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. ఫలితంగా త్వరగా అలసిపోతారు.
హీమోగ్లోబిన్ తయారీలో ఐరన్ ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ రవాణాకు ఇది అవసరం. ఐరన్ లోపిస్తే ఈ రెండు తగ్గిపోతాయి. ఫలితంగా బ్రీతింగ్ రేటు పెరిగిపోతుంది. మెట్లు ఎక్కినప్పుడు, వ్యాయామం చేసినప్పుడు త్వరగా అలసిపోతారు.
శరీరానికి సరిపడా ఆక్సిజన్‌ను పంప్ చేయడానికి గుండె ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. ఇది హృదయ స్పందనల్లో తేడాకు దారి తీస్తుంది.
మెదడుకు అందే ఆక్సిజన్ శాతం తగ్గడం వల్ల తలనొప్పి, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నోరు పొడిబారిపోవడం, మంటలు, నోట్లో ఎర్రటి పగుళ్లు, అల్సర్లు వంటి లక్షణాలు కూడా ఐరన్ లోపాన్ని సూచిస్తాయి.