కాంగ్రెస్‌ హయాంలోనే అక్రమాలు

ABN , First Publish Date - 2022-10-01T05:36:12+05:30 IST

లేఅవుట్లలోని మునిసిపల్‌ స్థలాల విషయంలో కాంగ్రెస్‌ హయాంలోనే అవినీతి, అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్‌ హయాంలోనే అక్రమాలు

 మునిసిపల్‌ స్థలాలపై బహిరంగ చర్చకు సిద్ధం

 టీఆర్‌ఎస్‌ హయాంలో అవినీతి నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా  : ఎమ్మెల్యే సైదిరెడ్డి

హుజూర్‌నగర్‌, సెప్టెంబరు 30: లేఅవుట్లలోని మునిసిపల్‌ స్థలాల విషయంలో కాంగ్రెస్‌ హయాంలోనే అవినీతి, అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆరోపించారు. అవినీతి, అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని ఎంపీ ఉత్తమ్‌కు సవాల్‌ విసిరారు. శుక్రవారం ఆయన హుజూర్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ 2019కి ముందే లేఅవుట్లలోని మునిసిపల్‌ స్థలాలకు సంబంధించి డాక్యుమెంట్లు మాయం చేశారని ఆరోపించారు. 

ఎవరిహయాంలో మునిసిపాలిటీలో అవినీతి, అక్రమాలు జరిగాయో బహిరంగ చర్చకు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు సిద్ధంగా ఉన్నారన్నారు. అవసరమైతే తాను కూడా బహిరంగ చర్చలో పాల్గొంటానన్నారు. పట్టణంలోని ఇందిరా సెంటరైనా, మీకు నచ్చిన ప్రాంతంలో ఎక్కడైనా సరే బహిరంగ చర్చ పెట్టాలని, ఉత్తమ్‌ ఆధారాలతో నిరూపించాలన్నారు. లేకుంటే ఉత్తమ్‌ ఎంపీ పదవికి రాజీనామా చేసి క్షమాపణ చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి మునిసిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతిలేదన్నారు. ఇందిరాభవన్‌ నుంచి నెలకు రూ.80 వేల కిరాయిలు పొందుతున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జున్‌ దుకాణానికి కూడా అనుమతులు లేవన్నారు. ప్రస్తుత పాలకవర్గం అవినీతికి పాల్పడిందని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకుంటానన్నారు. దమ్ము ధైర్యం ఉంటే హుజూర్‌నగర్‌ సెంటర్‌లో తేల్చుకుందాం రా అంటూ ఉత్తమ్‌కు ఎమ్మెల్యే సవాల్‌ విసిరారు. సమావేశంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గెల్లి అర్చనరవి, వైస్‌చైర్మన్‌ జక్కుల నాగేశ్వరరావు, అమర్‌నాధ్‌రెడ్డి, అమర్‌గౌడ్‌, ఫణికుమారి, శంభయ్య, ఓరుగంటి నాగేశ్వరరావు, సతీ్‌షకుమార్‌, వీర్లపాటి గాయత్రి భాస్కర్‌, కెఎల్‌ఎన్‌ రావు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-01T05:36:12+05:30 IST