బీసీ గణనపై బాధ్యతారాహిత్యం

ABN , First Publish Date - 2022-05-18T06:06:24+05:30 IST

ఏఐసిసి నేత రాహుల్‌ గాంధీ ఇటీవల తెలంగాణలో రెండు రోజుల పర్యటనకు వచ్చినప్పుడు, జనగణనలో బీసీ కుల గణన గురించి కాంగ్రెస్‌ పార్టీ తన రాజకీయ విధానాన్ని ప్రకటించాలని బీసీ సంఘాలు డిమాండ్‌ చేశాయి...

బీసీ గణనపై బాధ్యతారాహిత్యం

ఏఐసిసి నేత రాహుల్‌ గాంధీ ఇటీవల తెలంగాణలో రెండు రోజుల పర్యటనకు వచ్చినప్పుడు, జనగణనలో బీసీ కుల గణన గురించి కాంగ్రెస్‌ పార్టీ తన రాజకీయ విధానాన్ని ప్రకటించాలని బీసీ సంఘాలు డిమాండ్‌ చేశాయి. అయితే ఆయన తన రెండు రోజుల కార్యక్రమాలలో, ఏ వేదిక మీద జనాభాలో సగ భాగానికి పైగా ఉన్న బీసీల డిమాండ్లపైన మాట్లాడలేదు. బీసీ కులాల లెక్కింపుపై నోరు విప్పలేదు. రెండు రోజుల తెలంగాణ పర్యటనలోనే గాదు గత రెండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణన చేపడుతామని ప్రకటించినప్పటి నుంచీ నేటి వరకు ఒక్కసారి కూడ పార్లమెంటులో గాని, పార్టీ మీటింగులలో గాని బీసీ గణన గురించి రాహుల్‌ నోరు విప్పలేదు. ఒక జాతీయ పార్టీగా దేశంలోని అరవై కోట్లమంది ప్రగాఢ ఆకాంక్ష గురించి మాట్లాడకుండా, విధానం ప్రకటించకుండా మౌనం దాల్చడంలో ఆంతర్యమేమిటి?


కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్పమొయిలీ కన్వీనర్‌గా సెప్టెంబర్‌ 3, 2021 నాడు బీసీ గణన అంశంపై ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నియమించారు. ఎనిమిది నెలలు పూర్తయినప్పటికి ఇంతవరకు ఆ కమిటీ తన నివేదిక ఇవ్వలేదు. నిజంగా కాంగ్రెస్‌ పార్టీకి గాని, రాహుల్‌గాంధీకి కాని బీసీ గణన కావాలని ఉంటే నెలరోజుల్లో వీరప్పమొయిలీ కమిటీ నివేదిక తెప్పించుకోలేరా? బీసీ గణన విషయంలో కాంగ్రెస్‌ ద్వంద్వ విధానం అవలంబిస్తున్నదని చెప్పడానికి రెండు ఉదాహరణలు గమనించవచ్చు. కాంగ్రెస్‌ నేతృత్వంలో 2011లో అప్పటి యుపిఎ ప్రభుత్వం జనగణనలో కులగణన కూడ చేపట్టాలని నిర్ణయించి, అమలు చేసింది. కాని తాను అధికారంలో ఉన్న మిగతా మూడు సంవత్సరాల కాలంలో వివరాలు వెల్లడించలేదు. బీసీ గణన జరపాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్‌, ఒడిస్సా తదితర ఏడు రాష్ట్రాల్లో మొన్నటికి మొన్న తీర్మానాలు జరిగితే కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలయిన పంజాబ్‌, ఛత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్‌, పుదుచ్చేరి తదితర రాష్ట్రాల్లో బీసీ గణన తీర్మానం జరగలేదు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో మీటింగ్‌ పెట్టి బీసీ జనగణన జరపాలని తీర్మానించారు. అంతే గాకుండా ఢిల్లీలో బీసీ గణన చేపట్టాలనే డిమాండ్‌తో బీసీ సంఘాలు నిర్వహించిన ఆందోళనలో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, మధుయాష్కి పాల్గొని మద్దతు పలికారు. జాతీయ స్థాయిలో ఒక విధంగా, రాష్ట్రాలలో ఒక విధంగా కులగణనలో కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తున్నది. సమస్య ఏమిటంటే బీసీ గణన చేపట్టాలని అడగాల్సిన బాధ్యత గల కాంగ్రెస్‌ పార్టీ ఆ మాట అడగడం లేదు. చేయాల్సిన బాధ్యత కలిగిన భారతీయ జనతాపార్టీ చేయడం లేదు. కాని కాంగ్రెస్‌ పార్టీ సారథి రాహుల్‌ గాంధీ, బిజెపి సారథులు అమిత్‌షా, జె.పి.నడ్డాలు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో తెగ పర్యటనలు చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2010లో పార్లమెంటులో అప్పటి బిజెపి పార్లమెంటరీ పార్టీ నాయకురాలు స్వర్గీయ సుష్మాస్వరాజ్‌ బీసీ జనగణన చేపట్టాలని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన 2014 తరువాత ప్రస్తుత రక్షణమంత్రి, అప్పటి హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పార్లమెంటు సాక్షిగా బీసీ కులాల లెక్కలు సేకరిస్తామని చెప్పారు. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ఇప్పుడు బీసీ గణన చేయడం సాధ్యం కాదని చెపుతున్నది. ఒకే దేశం, ఒకే విధానం అంటున్న బిజెపి కూడ బీసీ గణన విషయంలో ఒకే పార్టీ రెండు విధానాలు అని తమ డొల్లతనాన్ని బయటపెట్టుకుంటున్నది. ఇలా బీసీలను మోసం చేస్తూ, బీసీల గురించి మాట్లాడకుండా రెండు జాతీయ పార్టీల నాయకులు పర్యటనలకు వస్తే వారికి స్వాగతం పలికి, వారి బహిరంగ సభలను, రోడ్‌షోలను విజయవంతం చేస్తున్నది బీసీలే. ఈ నాయకుల పర్యటనల వల్ల నిజానికి బీసీలకు ఒరిగేదేమీలేదు. బీసీ గణన చేపట్టాలని బిజెపి, కాంగ్రెస్‌ పార్టీల నాయకుల్ని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. వారి వైఖరిని ఎండగట్టవల్సిన అవసరం ఏర్పడింది. 2023 ఎన్నికల్లో బీసీలు సంఘటితమై ఓటు చైతన్యంతో ఈ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాల్సి ఉన్నది.

జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌

రాష్ట్ర అధ్యక్షులు, బీసీ సంక్షేమ సంఘం–తెలంగాణ

Updated Date - 2022-05-18T06:06:24+05:30 IST