జలసేద్యమే సిరులకు సరైన మార్గం!

ABN , First Publish Date - 2022-05-05T09:59:14+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన సాగునీటి సౌలభ్యం ఫలితంగా సాగు విస్తీర్ణం ఊహించని స్థాయిలో పెరిగింది. దాంతో వరిసాగు ద్వారా ధాన్యం దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది...

జలసేద్యమే సిరులకు సరైన మార్గం!

తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన సాగునీటి సౌలభ్యం ఫలితంగా సాగు విస్తీర్ణం ఊహించని స్థాయిలో పెరిగింది. దాంతో వరిసాగు ద్వారా ధాన్యం దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. ఈ కారణంగా వర్తమాన యాసంగి సీజన్‌లో తెలంగాణ రైతాంగానికి గందరగోళ పరిస్థితి ఎదురయ్యింది. ఈ పరిస్థితుల నుంచి తెలంగాణ రైతాంగానికి తాత్కాలిక ఉపశమనం అందిస్తూనే, భవిష్యత్తులో ఈ సమస్య పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన దీర్ఘకాలిక చర్యల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆచరణాత్మక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు పరిచే పనిలో నిమగ్నమయ్యింది. ఈ రెండంచెల పాలసీలో భాగంగా ఒకటి– వరికి బదులుగా పంటల మార్పిడికోసం ఇతర పంటలవైపుకు రైతులను ప్రోత్సహించటం, రెండు– పూర్తి స్థాయిలో సాగుపద్ధతులనే మార్చుకునేందుకు ప్రత్యామ్నాయ విధానాలను అందుబాటులోకి తీసుకురావడం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది.


ఈ రెండంచెల విధానంలో పంటల మార్పిడికి సంబంధించినంతవరకు పత్యేకించి ఆయిల్‌ పామ్ సాగును పెద్దయెత్తున ప్రోత్సహించాలని, సాగు పద్ధతిని మార్చుకునే విభాగానికి సంబంధించి ఆధునిక జలసేద్యంలో భాగమైన ‘అక్వాకల్చర్‌’ను ప్రమోట్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ రెండంచెల సాగు విధానాల అమలు ద్వారా తెలంగాణలో ప్రస్తుతం వరిపంట సాగుచేస్తున్న మొత్తం విస్తీర్ణంలో కనీసం 25లక్షల ఎకరాలను రానున్న మూడేళ్ల కాలపరిమితిలో వాణిజ్య పంటలవైపు మళ్ళించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెబుతున్నారు. ఆయిల్‌ పామ్ సాగుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ఒక పూర్తిస్థాయిలో కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని అమలు జరుపుతున్నది. రాష్ట్రంలో ఇప్పటికే 53,455 ఎకరాల విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్న ఆయిల్‌ పామ్ సాగు మంచి ఫలితాలను సాధించినట్లు ఉద్యానవనశాఖ అధికారులు చెబుతున్నారు. ఆశాజనకంగా నిరూపితమైన ఈ ఫలితాల నేపథ్యంలో రైతులు ఆయిల్‌పామ్ సాగుపట్ల ఇప్పుడిప్పుడే ఆసక్తిని కనబరుస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆయిల్‌ పామ్ సాగును ప్రోత్సహించేందుకు వర్తమాన బడ్జెట్‌లో వెయ్యికోట్ల భారీ నిధులను కేటాయిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్ర ఉద్యానవనశాఖ పర్యవేక్షణలో అమలుపరుస్తున్న ఆయిల్‌పామ్ సాగు ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని 18 జిల్లాలనుంచి ఎంపిక చేసిన దాదాపు 206 రెవెన్యూ మండలాల పరిధిలో సుమారు రెండున్నర లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరిపంటకు బదులుగా ఈ సంవత్సరం (2022–23) ఆయిల్‌పామ్‌ను సాగులోకి తీసుకురావడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే పద్ధతిలో వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24)లో ఏడు లక్షల ఎకరాలు, తదుపరి ఆర్థిక సంవత్సరంలో (2024–25)లో మరో పదిలక్షల ఎకరాలను పంటమార్పిడికి ప్రోత్సహించడం ద్వారా రానున్న మూడేళ్ల కాలపరిమితిలో రాష్ట్రంలో మొత్తం 20లక్షల ఎకరాల భారీమొత్తంలో వరి పంట పొలాలను ఆయిల్‌పామ్ తోటలుగా మార్చివేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల కాలపరిమితిలో ప్రతి ఎకరా ఒక్కింటికి పదివేల రూపాయల రైతుబంధు పెట్టుబడి సహాయానికి అదనంగా మరో 36వేల రూపాయల పెట్టుబడి ప్రోత్సాహకాన్ని ప్రతిరైతుకు అందిస్తున్నది. ఆయిల్‌పామ్ సాగులో ప్రతిబంధకాల్లో ప్రధానమైన రెండింటి విషయంలో రైతులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఒకటి– వరిపంటకంటే ఆయిల్‌పామ్ సాగులో ఆదాయం పెద్దగా మించకపోవడం, రెండోది– ఆయిల్‌పామ్ సాగులో పంటదిగుబడి ప్రారంభం కావడానికి కనీసం నాలుగైదేళ్ల కాలవ్యవధి పడుతుండటం. ఈ కారణాల వల్ల ఈ పంటమార్పిడి కాలానికి తమ ఆదాయాలను నష్టపోతామని రైతులు సంశయిస్తున్నారు.


వరిపంట నుంచి సాగుపద్ధతిని మార్చుకునేందుకు సిద్ధపడుతున్న రైతులను ఆకర్షించే ప్రధాన అంశాల్లో వరిపొలాలను సులభంగా కొత్తవిధానానికి తయారుచేసుకునే వెసులుబాటు, సాగుచేయడంలో శారీరక శ్రమ తక్కువగా ఉండటం, తమ ఉత్పత్తులకు దేశీయంగానూ విదేశాలలోనూ మార్కెటింగుకు డిమాండు ఉండటం... వీటితోపాటుగా వరిపంటల ద్వారా సమకూరే ఆదాయాలతో పోల్చుకున్నప్పుడు అధికమొత్తాలను ఆర్జించుకోగలిగే అవకాశాలుండటం లాంటివి ముఖ్యమైనవి. రైతులు ఈ అంశాలను కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారని పంటలమార్పిడిపై పరిశోధనల ఆధారంగా వెలువరించిన పలు అధ్యయన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.


ఈ పరిస్థితుల నేపథ్యంలో వరిపంటకు బదులుగా ఆ పొలాలను స్వల్పంగా మార్పులు చేర్పులు చేసుకోవడం ద్వారా, వరిపంటకంటే అనేకరెట్లు అధికమైన ఆదాయాలను సమకూర్చగలిగే ‘ఆక్వా కల్చర్‌’ను అందుబాటులోకి తీసుకురావడం, ఆ దిశలో రైతాంగాన్ని ప్రోత్సహించడమే ఉత్తమమైన ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదే అంశంపై ముఖ్యమంత్రి సూచనమేరకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్‌ కుమార్‌ అధ్యక్షత అత్యున్నతస్థాయి అధికారుల సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో వరిపంటను అధికంగా ఆశ్రయిస్తున్న ఏడు జిల్లాలలో (నిజామాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, గద్వాల) కనీసం ఐదు లక్షల ఎకరాల విస్తీర్ణంలోని వరిపొలాలను ‘ఆక్వాకల్చర్‌’ సాగుపద్ధతికి మార్చాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు, విధివిధానాలు రూపొందించాల్సి ఉంది.


సాంప్రదాయ సాగువిధానాలకు భిన్నమైన పద్ధతులు ఏవైనా అవి ప్రయోగాత్మకంగా నిరూపితమయ్యేవరకూ తెలంగాణ రైతాంగం అంత సులభంగా వాటిపట్ల ఆకర్షితం కాదని గతంలో అనేక సందర్భాల్లో స్పష్టమయ్యింది. అందువల్ల వరిపొలాలను ‘ఆక్వాకల్చర్‌’ పద్ధతిలో– చేపల లేదా రొయ్యల చెరువులుగా మార్పులు చేసే ప్రతిపాదనల విషయంలో తెలంగాణ రైతుల్లో విశ్వాసం నింపడం కత్తి మీద సాములాంటిదే! తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని ఉన్న సాగునీటి సౌకర్యాలు, వ్యవసాయరంగంపై ఇటీవలికాలంలో పెరుగుతున్న ఒత్తిడి, వరిధాన్యం సేకరణ విషయంలో జాతీయస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు, రైతుల ఆదాయాలను గరిష్ఠస్థాయికి పెంచాలని ప్రభుత్వాలు నిర్దేశించుకున్న లక్ష్యాలు, తదితర పరిస్థితుల నేపథ్యంలో పరిశీలించినప్పుడు, తెలంగాణలో పంటల విధానాల్లో మార్పులను ఆశ్రయించడం ఆచరణలో అసాధ్యమేమీకాకపోవచ్చు. అందువల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి రైతుల్లో ఆర్థిక పరిపుష్టిని నింపడంతోపాటుగా, రాష్ట్రంలో వరిసాగును నియంత్రించేందుకు ప్రత్యామ్నాయంగా ‘ఆక్వాకల్చర్‌’ను ప్రోత్సహించాలని సంకల్పించడం ఆహ్వానించదగిన పరిణామమే! తెలంగాణలో వరిసాగును సంవత్సరంలో రెండుపంటలుగా పండిస్తున్న రైతులు అనుకూలమైన పరిస్థితుల్లో ఒక ఎకరానికి సగటున లక్షరూపాయల నికర ఆదాయాన్ని సంపాదిస్తున్నట్లు అనధికారిక అంచనాలున్నాయి. ఇదే ఒక ఎకరంలో ‘ఆక్వాకల్చర్‌’ విధానంలో రొయ్యలను సాగుచేస్తున్న ఆంధ్రా రైతులు అన్ని ఖర్చులు పోను సగటున ఐదు నుంచి ఆరులక్షల నికరలాభాన్ని ఆర్జిస్తున్నారు. అయితే వరిసాగు, ఆక్వాసాగులకు సంబంధించి ప్రారంభ పెట్టుబడి విషయంలో చాలా తేడాలు ఉంటాయి. ఒక ఎకరం విస్తీర్ణంలో ‘ఆక్వాకల్చర్‌’ పద్ధతిలో రొయ్యలను పెంచడానికి ప్రతి పంటకు కనీసం నాలుగు నుంచి ఐదులక్షల పెట్టుబడి అవసరం ఉంటుంది. అయితే వరిపంటల సాగులాగానే రొయ్యల సాగులోనూ ప్రతిపంటకు సంబంధించిన కాలపరిమితి మూడు నుండి నాలుగు నెలలు పడుతుంది. ఈ లెక్కన సంవత్సరంలో గరిష్ఠంగా అక్వాకల్చర్‌ పద్ధతిలో మూడుపంటలను పండించే అవకాశాలున్నాయి. అందువల్ల మారిన పరిస్థితుల నేపథ్యంలో భూమిని సాగుచేయడం కంటే రైతాంగానికి జలసేద్యమే అనేక రెట్లు లాభసాటిగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహాలకు తావులేదు. అయితే సాంప్రదాయ వ్యవసాయ విధానాలకు అలవాటుపడిన తెలంగాణ రైతాంగాన్ని సేద్యపు పద్ధతుల మార్పుదిశలో ఆకర్షించేందుకు, ముఖ్యంగా ‘ఆక్వాకల్చర్‌’ వైపు మళ్లించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించగలిగే ప్రోత్సాహకాలే ప్రధాన భూమికను పోషించనున్నాయి.

పిట్టల రవీందర్‌

తెలంగాణ ఫిషరీస్‌ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు

Read more