ఆయనంతే రారంతే!

ABN , First Publish Date - 2020-11-30T05:11:38+05:30 IST

ఆయనో డివిజన్‌ స్థాయి అధికారి! విధులు నిర్వహించే విభాగం నీటిపారుదల శాఖ. చేయాల్సిన విధులు అభివృద్ధి పనులను పర్యవేక్షించడం, నాణ్యతాప్రమాణాలు సక్రమంగా ఉండేలా తనిఖీలు నిర్వహించడం. కానీ ఆయన విధి నిర్వహణను పక్కనపెట్టారు. అసలు కార్యాలయానికే రావడం లేదు. అది కూడా నెలల తరబడి. పోనీ కిందిస్థాయి సిబ్బందితో ఏమన్నా సఖ్యతగా ఉంటారంటే అదీ లేదు. ఎప్పుడో ఒకసారి కార్యాలయానికి చుట్టపుచూపుగా వస్తారు. ఫలితంగా అభివృద్ధి పనుల్లో జాప్యం ఏర్పడుతోంది.

ఆయనంతే రారంతే!
మణుగూరులోని ఇరిగేషన్‌ కార్యాలయం

డివిజన్‌ నీటిపారుదలశాఖలో ఇష్టారాజ్యం

అందుబాటులోని ఉండని అధికారి

మిషన్‌ కాకతీయ పనుల్లో కొరవడుతున్న పర్యవేక్షణ

బిల్లులు రాక కాంట్రాక్టర్ల లబోదిబో

విచారణ నిర్వహిస్తాం: ఆంధ్రజ్యోతితో ఈఈ

మణుగూరు రూరల్‌, నవంబరు 29: ఆయనో డివిజన్‌ స్థాయి అధికారి! విధులు నిర్వహించే విభాగం నీటిపారుదల శాఖ. చేయాల్సిన విధులు అభివృద్ధి పనులను పర్యవేక్షించడం, నాణ్యతాప్రమాణాలు సక్రమంగా ఉండేలా తనిఖీలు నిర్వహించడం. కానీ ఆయన విధి నిర్వహణను పక్కనపెట్టారు. అసలు కార్యాలయానికే రావడం లేదు. అది కూడా నెలల తరబడి. పోనీ కిందిస్థాయి సిబ్బందితో ఏమన్నా సఖ్యతగా ఉంటారంటే అదీ లేదు. ఎప్పుడో ఒకసారి కార్యాలయానికి చుట్టపుచూపుగా వస్తారు. ఫలితంగా అభివృద్ధి పనుల్లో జాప్యం ఏర్పడుతోంది. చేస్తున్న పనులకు బిల్లులు చెల్లించకపో వడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులకు సంబంధిం చి తమ వద్ద నుంచి పర్సంటేజీలు తీసుకుంటన్నా ఆయన తీరు మార్చుకోవడంలేదని వారు చెబుతున్నారు.

కొరవడుతున్న పర్యవేక్షణ

మణుగూరు డివిజన్‌ నీటిపారుదల శాఖ అధికారులు అందుబాటులో ఉండక పోవటంతో అభివృద్ధి పనుల్లో పర్యవేక్షణ కొరవడుతుందనే విమర్శలు వినవస్తున్నాయి. ముఖ్యంగా డివిజన్‌ స్థాయి అధికారి నెలల తరబడి కార్యాలయానికి రావటం లేదనే ఆరోపణలున్నాయి. గతంలో బూర్గంపాడు డివిజన్‌ పరిధిలో ఇరిగేషన్‌ కార్యాలయం ఉంది. అయితే పరిపాలనా సౌలభ్యం కోసం రెండేళ్ల క్రితం మణుగూరు డివిజన్‌ను ఏర్పాటు చేశారు. ఈ డివిజన్‌ పరిధిలో లక్షలాది రూపాయల మిషన్‌ కాకతీయ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి పర్యవేక్షణాధికారి విధులకు డుమ్మా కొడుతుండటంతో పనులు సక్రమంగా జరుగటం లేదన్న విమర్శలున్నాయి. కింది స్థాయి అధికారులను సమన్వయ పర్చుకుంటూ ఇరిగేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టే చెరువులు, చెక్‌డ్యాం నిర్మాణాలు, తదితర పనులను పర్యవేక్షించాల్సిన సదరు అధికారి స్థానికంగా ఉండకుండా ఖమ్మం నుంచి రాకపోకలు సాగిస్తూ నెలలో ఒకటి, రెండు సార్లు మాత్రమే కార్యాలయంలో దర్శనమిస్తుండటంతో పనుల్లో కూడా పురోగతి కన్పించడం లేదని రైతులు వాపోతున్నారు. పర్సంటేజీలు షరామామూలే. అయినా మరోవైపు తమకు బిల్లులు చెల్లించటంలో కూడా నిర్లక్ష్యం వహిస్తుండటంతో కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు.కాగా కింది స్థాయి సిబ్బందితో కూడా సదరు అధికారి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తారనే ఆరోపణలున్నాయి. రెండేళ్లుగా మణుగూరు డివిజన్‌ ఇరిగేషన్‌ పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారటంతో ఇక్కడ ఇరిగేషన్‌ కార్యాలయం ఉందన్న సంగతి స్థానికులు మరిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి స్థానికంగా ఉండని అధికారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

నా దృష్టికి రాలేదు: వెంకటేశ్వరరెడ్డి ఇరిగేషన్‌ ఈఈ

మణుగూరు ఇరిగేషన్‌ డిఇ అందుబాటులో ఉండటం లేదన్న విషయం ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదు. తగు విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.


Updated Date - 2020-11-30T05:11:38+05:30 IST