ఐఆర్‌ఎస్‌ ‘ఐరన్‌మ్యాన్‌’

ABN , First Publish Date - 2022-08-12T08:55:19+05:30 IST

ఐఆర్‌ఎస్‌ ‘ఐరన్‌మ్యాన్‌’

ఐఆర్‌ఎస్‌ ‘ఐరన్‌మ్యాన్‌’

ట్రయాథ్లాన్‌లో సత్తాచాటిన కడప వాసి రామనాథ రెడ్డి

అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): అది ఇస్తోనియాలోని టాలిన్‌ నగరం.. సమయం ఉదయం ఆరున్నర గంటలు.. చల్లటి వాతావరణంలో టాలిన్‌లోని హర్కు సరస్సులో 3.8 కిలోమీటర్లు ఈదడమంటే మామూలు విషయం కాదు. అది పూర్తయిన వెంటనే 180 కిలోమీటర్ల సైక్లింగ్‌.. ఆ తర్వాత 42.2 కిలోమీటర్లు రన్నింగ్‌ చేయాలి. ఈ మూడు ఈవెంట్లన్నీ కలిపి 17 గంటల్లోనే పూర్తిచేయాలి. ‘ఐరన్‌మ్యాన్‌’ టైటిల్‌ కోసం నిర్వహించే ఈ పోటీల్లో పాల్గొనేందుకు దేశవిదేశాల నుంచి ఎందరో ప్రతిభావంతులు ఆసక్తి చూపుతారు. అలాంటి ప్రతిష్ఠాత్మక పోటీల్లో తొలిసారిగా పాల్గొన్న భారత రెవెన్యూ సర్వీస్‌(ఐఆర్‌ఎస్‌) అధికారి వుండేల రామనాథ రెడ్డి మొదటి ప్రయత్నంలోనే టైటిల్‌ సాధించారు. టాలిన్‌ వేదికగా 6న జరిగిన ట్రయాథ్లాన్‌లో మూడు ఈవెంట్లనూ 15:52 గంటల్లోనే పూర్తిచేశారు. ఈ పోటీని 17 గంటల్లోపు పూర్తిచేసిన వారందరికీ ‘ఐరన్‌మ్యాన్‌’ టైటిల్‌ అందిస్తారు. వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన రామనాథ రెడ్డి భారత్‌ నుంచి ఈ ఘనత సాధించిన తొలి ఐఆర్‌ఎస్‌ అధికారిగా రికార్డు నెలకొల్పారు. ఉదయాన్నే జరిగిన స్విమ్మింగ్‌ పోటీల్లో 3.8 కి.మీ. దూరాన్ని 1:46:47 గంటల్లో ఈదిన ఆయన అనంతరం సైక్లింగ్‌లో 180 కి.మీ. దూరాన్ని 7:42:36 గంటల్లో పూర్తిచేశారు. ఆఖరిదైన 42.2 కి.మీ. మారథాన్‌ను 6:00:20 గంటల్లో ముగించారు. ప్రొద్దుటూరులోని దొరసానిపల్లి రామనాథరెడ్డి స్వగ్రామం. ప్రస్తుతం ఆయన ముంబై కస్టమ్స్‌లో జాయింట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.


Updated Date - 2022-08-12T08:55:19+05:30 IST