మోదీ వ్యతిరేక ఫ్రంట్ సాధ్యమా?

ABN , First Publish Date - 2022-05-25T06:18:00+05:30 IST

సామాజిక పరిస్థితులు పరిపక్వం కాకుండా సమాజంలో ఏ మార్పూ సంభవం కాదు. కొన్నిసార్లు పరిస్థితులు పరిపక్వంగా ఉన్నా మార్పుకు దోహదం చేసే శక్తులు బలహీనంగా ఉంటే కూడా అది సాధ్యపడదు...

మోదీ వ్యతిరేక ఫ్రంట్ సాధ్యమా?

సామాజిక పరిస్థితులు పరిపక్వం కాకుండా సమాజంలో ఏ మార్పూ సంభవం కాదు. కొన్నిసార్లు పరిస్థితులు పరిపక్వంగా ఉన్నా మార్పుకు దోహదం చేసే శక్తులు బలహీనంగా ఉంటే కూడా అది సాధ్యపడదు. దేశ చరిత్రలో మార్పు కోసం ప్రయత్నాలు అనేకం అనేక సందర్భాల్లో జరుగుతూనే ఉంటాయి. ఆ ప్రయత్నాలు సఫలీకృతం కావడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.


నాడు ఇందిరాగాంధీ పాలనకు వ్యతిరేకంగా మొత్తం ప్రతిపక్షాలను కూడగట్టిన జయప్రకాశ్ నారాయణ్ లాంటి నేతలు నేడు దేశంలో కానరారు. రాజీవ్ గాంధీ పాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను సమీకరించిన ఎన్టీఆర్, దేవీలాల్, విపిసింగ్ వంటి నేషనల్ ఫ్రంట్ నేతలూ లేరు. 1998లో కాంగ్రెస్ వ్యతిరేక కూటమిగా బిజెపి, సమతా పార్టీ, అన్నాడిఎంకె, శివసేన తదితర ప్రాంతీయ పార్టీలతో ఏర్పడిన ఎన్డీఏ తాలూకు వాతావరణమూ సమసిపోయింది. వాజపేయి నేతృత్వంలో బిజెపికి వ్యతిరేకంగా యుపిఏను నిర్మించిన హరికిషన్ సింగ్ సూర్జిత్ లాంటి వారూ మృగ్యమైపోయారు. ఆఖరుకు యుపిఏ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్వహించి ఒక వాతావరణాన్ని కల్పించిన అన్నా హజారే, రాందేవ్ లాంటి వారూ మరోసారి తెర ముందుకు రావడానికి సిద్ధంగా లేరు. చివరకు 2019లో మోదీ వ్యతిరేక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసేందుకు చెప్పుకోదగిన ప్రయత్నం చేసిన నేతలూ ఇప్పుడు కింకర్తవ్య విమూఢులై ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కేసిఆర్, అఖిలేశ్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీలాంటి నేతల వద్ద మోదీ సారథ్యంలోని బిజెపిని ఢీకొనేందుకు ఏమైనా మహేంద్ర జాలం ఉన్నదా?


ఇందిరాగాంధీ కాలాన్నే తీసుకుంటే 1973 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయి ఉన్నది. 1972, 73ల మధ్య కరువు పరిస్థితులు దేశాన్ని అతలాకుతలం చేశాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన దాదాపు కోటి మంది శరణార్థులకు ఆశ్రయం, ఆహారం అందించడం భారంగా మారింది. బియ్యం, గోధుమలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటాయి. బొంబాయి, మైసూరు, నాగపూర్, కేరళల్లో ఆహారం కోసం అల్లర్లు జరిగాయి. ప్రభుత్వ రంగ సంస్థలు సగం సామర్థ్యాన్నే వినియోగించుకోగలిగాయి. ప్రతి కీలక రంగంలోనూ కొరత తాండవించింది. క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశానికి అంటడం, బడ్జెట్ లోటు విపరీతంగా పెరగడం ఆర్థిక మాంద్య పరిస్థితులను కల్పించాయి. అనేక చోట్ల పారిశ్రామిక అశాంతి నెలకొన్నది. 1974 మే 8న రైల్వే జాతీయ వ్యాప్తంగా సమ్మె ప్రారంబించింది. లక్షా 50 వేల టెక్స్‌టైల్, ఇతర పారిశ్రామిక కార్మికులు సమ్మె నిర్వహించారు. యూపీలో పోలీసులే తమ పని పరిస్థితులకు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభించారు. యూపీ, గుజరాత్‌లో సామాజిక ఆందోళనల వల్ల ముఖ్యమంత్రులే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితులే జయప్రకాశ్ నారాయణ్ ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు దారితీశాయి. అధికార కాంగ్రెస్‌లోనే తిరుగుబాట్లు జరిగాయి. కాంగ్రెస్(ఓ), సోషలిస్టు పార్టీ, భారతీయ క్రాంతిదళ్, జనసంఘ్, స్వతంత్ర పార్టీ, భారతీయ లోక్‌దళ్, అకాలీదళ్ వంటి పార్టీలనే కాదు కొన్ని వామపక్ష శక్తులనూ కలుపుకునే ప్రయత్నం చేశారు. గాంధేయవాదులు, సర్వోదయ నాయకులు, తార్కుండే వంటి రాడికల్ హ్యూమనిస్టు ఉద్యమ నేతలు కూడా ఏకం అయ్యారు. వారి ధాటికి తట్టుకోలేక ఇందిరాగాంధీ ఎమర్జెన్సీనే విధించి అనేక దారుణాలకు పాల్పడాల్సి వచ్చింది. జయప్రకాశ్ నారాయణ్ వంటి ఉన్నత స్థాయి నేత మాత్రమే కాదు, జార్జి ఫెర్నాండెజ్, మధులిమాయే, మధు దండావతే వంటి ఫైర్ బ్రాండ్ సోషలిస్టు నేతలు, అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ ఆడ్వాణీ వంటి సైద్ధాంతిక భూమిక ఉన్న నేతలైనా ఇప్పుడు ఉన్నారా?


వేలాది సిక్కుల హత్యాకాండ మధ్య అధికారంలోకి వచ్చిన రాజీవ్ గాంధీ హయాంలో బోఫోర్స్ శతఘ్నులు, జర్మన్ సబ్ మెరైన్ల కొనుగోలుతో పాటు అనేక వ్యవహారాల్లో అవినీతి కుంభకోణాలు తలెత్తాయి. విపిసింగ్, అరీఫ్ మహమ్మద్ ఖాన్, అరుణ్ నెహ్రూ లాంటి వారు రాజీనామా చేశారు. షాబానో కేసు రాజీవ్‌కు అప్రతిష్ట మిగిల్చింది. శ్రీలంకలో భారత శాంతి సేన సృష్టించిన నెత్తుటి మరకలూ ఆయన తప్పుడు నిర్ణయాలకు పరాకాష్టగా మారాయి. పత్రికా స్వేచ్ఛను అరికట్టేందుకు ఆయన ప్రయోగించాలనుకున్న పరువునష్టం బిల్లూ ఆయనకు చెడ్డ పేరు తెచ్చింది. ఆర్థిక వ్యవస్థ కూడా ఛిన్నాభిన్నమైంది. ఈ పరిస్థితుల్లో 1988 ఆగస్టులో ఎన్టీఆర్, విపిసింగ్‌ల నేతృత్వంలో బిజెపి, ఏడు ప్రతిపక్ష పార్టీలు నేషనల్ ఫ్రంట్ అనే సమైక్య వేదికపై ముందుకు వచ్చాయి. చెన్నైలోని మెరీనా బీచ్‌లో జరిగిన బ్రహ్మాండమైన సభలో ఈ ఏడు పార్టీలను సూర్యుడి సప్తాశ్వాలుగా ఎన్టీఆర్ పోల్చారు. మరి నాటి నేతలు ఈనాడు ఏరీ?


మిత్రపక్షాలను ఎప్పుడూ అధికారంలో చూడగలిగే విశాల మనస్తత్వం కాంగ్రెస్‌కు లేనందువల్ల పీవీ నరసింహారావు ప్రభుత్వం తర్వాత ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ మనుగడలో కొనసాగలేకపోయింది. అధికారానికి తామే అర్హులమనుకునే గాంధీ కుటుంబ తత్వం మూలంగానే 1998లో వాజపేయి నేతృత్వంలో ఎన్డీఏ ఏర్పడింది. ఒక రకంగా బిజెపి పునరుత్థానానికి కాంగ్రెస్ అధికారదాహమే కారణం. 1998లో ఎన్నికల తర్వాత ఏర్పడ్డ ఎన్డీఏ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా మనుగడ సాగించలేకపోయింది. కాని 1999లో ఎన్నికలముందే ఎన్డీఏ ఇతర పార్టీలను కలుపుకుని ఒకే ఎన్నికల ప్రణాళికతో పోటీ చేసి 306 సీట్లతో ఘన విజయం సాధించింది. యునైటెడ్ ఫ్రంట్‌లో చక్రం తిప్పిన జైపాల్‌రెడ్డి, బిజెపి నేత అయినా సర్వత్రా ఆమోదయోగ్యత సాధించిన వాజపేయి లాంటి నాయకులు ఇప్పుడెక్కడ ఉన్నారు?


2004 ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. బిజెపి కంటే కాంగ్రెస్‌కు ఏడు సీట్లే ఎక్కువగా వచ్చినప్పటికీ కేవలం 135 సీట్లతో ఆ పార్టీ దాదాపు 14 ఇతర పార్టీలను కలుపుకుని యుపిఏను ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చింది. సిపిఐ(ఎం) నేత హరికిషన్ సూర్జిత్ యుపిఏ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఆ 14 పార్టీల కూటమిలో తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఉన్నది. సూర్జిత్ లాంటి నేతలు కూడా మనకు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?


పదేళ్ల యుపిఏ పాలనకు వ్యతిరేకంగా ప్రజాందోళనను నిర్వహించడంలో అన్నాహజారే, కేజ్రీవాల్ కీలక పాత్ర పోషించారు. నరేంద్రమోదీ ఈ వాతావరణాన్ని ఉపయోగించుకుని 2014లో బిజెపిని పూర్తి మెజారిటీతో అధికారంలోకి తేగలిగారు. బిజెపి అధికారంలో ఉన్నప్పటికీ అనేక పార్టీలు ఎన్డీఏలో కొనసాగాయి. 2019లో నరేంద్రమోదీకి వ్యతిరేకంగా కూటమిని నిర్మించడంలో కాంగ్రెస్ విఫలమైంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ఉత్తరాది రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, కర్ణాటకలలో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ఆ పార్టీకి ఆత్మవిశ్వాసం మితిమీరింది. నిజానికి గతంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కూడా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం, పెద్ద నోట్లరద్దు పర్యవసానాలు, ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి తోడ్పాటు లేకపోవడం గమనించి ఎన్డీఏ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు కేసిఆర్ మాదిరే ఆయన ఢిల్లీలో దీక్ష జరిపారు. అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్, దేవెగౌడ, మమతా బెనర్జీ, మాయావతి, శరద్ యాదవ్, కేజ్రీవాల్ తదితరులతో పాటు వామపక్ష నేతల్ని కూడా కలుసుకున్నారు. వీరిలో మెజారిటీ నేతలు 2019లో తెలుగుదేశంకు అనుకూలంగా కూడా ప్రచారం చేశారు. కాని కేంద్రంలో ఉన్న బిజెపి తన ఎన్నికలపై ఎంత బలంగా దృష్టి సారించిందో ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై అంతే బలంగా దృష్టిసారించింది. జగన్మోహన్ రెడ్డికి పూర్తి అండదండలను అందించి తెలుగుదేశం అధికారంలోకి రాకుండా చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. తాజాగా కేసిఆర్ చేస్తున్న ప్రయత్నాలు గతంలో చంద్రబాబు చేసిన ప్రయత్నాలను గుర్తు చేస్తున్నాయి.


నిజానికి 2019 ఎన్నికలతో పోలిస్తే 2024 ఎన్నికల నాటికి నరేంద్రమోదీ బలం పెరుగుతుందని కానీ, తగ్గుతుందని కానీ చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. 2019లో అయితే మోదీ బలహీన పడ్డారని చెప్పేందుకు ఆస్కారం కనిపించింది. అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పరాజయం చెందడమే ఇందుకు కారణం. అయితే అప్పుడు తనపై వ్యతిరేకతను అసాధారణంగా అధిగమించి రెండోసారి విజయం సాధించిన మోదీ విస్తరణనే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఇటీవల అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిన తర్వాత ఆ పార్టీని ఢీకొనడం అంత సులభం కాదన్న అభిప్రాయానికి ఆస్కారం ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి దాదాపు 50 శాతం ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తోంది.


అయితే దేశంలో మోదీ వ్యతిరేక రాజకీయాలకు స్థలం లేదా? అని ప్రశ్నించేందుకు వీల్లేదు. ఆ స్థలాన్ని ఉపయోగించుకుని బలోపేతం కాగలిగిన శక్తులు మాత్రం బలహీనంగా ఉన్నాయని చెప్పక తప్పదు. ప్రధానంగా కాంగ్రెస్ కుప్పకూలిపోతుండడం, ఇతర పార్టీల విషయంలో ఇంట గెలువ కుండా రచ్చ గెలువగలవా అన్న చర్చ ఉండడమే ఇందుకు కారణం. 2004లో లాగా కాంగ్రెస్ కనీసం 100 సీట్లు దాటినా ఒక ప్రత్యామ్నాయం వీలవుతుంది కాని ఆ పార్టీ అలాంటి నమ్మకాన్ని కలిగించడం లేదు. తన వ్యతిరేక శక్తులేవైనా వాటిని బలహీనపరచేందుకు సామదానభేద దండోపాయాలను ప్రయోగించగల శక్తి మోదీకి ఉన్నది. కనుక మోదీ వ్యతిరేక వాతావరణాన్ని బలోపేతం చేస్తూనే తాము ఎక్కిన కొమ్మ తామే నరుక్కోకుండా ఆచి తూచి వ్యూహరచన చేయడం కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు చాలా ముఖ్యం. గతంలో ప్రత్యామ్నాయ రాజకీయాలను నడిపిన జయప్రకాశ్ నారాయణ్, విపిసింగ్, ఎన్టీఆర్, హరికిషన్ సింగ్ సూర్జిత్ లాంటి హేమాహేమీలు ఇప్పుడు లేరు. అధికార రాజకీయాల్లోనే కాదు, ప్రతిపక్ష రాజకీయాల్లోనూ ప్రమాణాలు దిగజారిపోవడమే ఇందుకు కారణం.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-05-25T06:18:00+05:30 IST