పొట్ట ఉబ్బరం వేధిస్తోందా?

ABN , First Publish Date - 2021-08-18T05:30:00+05:30 IST

కొన్నిసార్లు పొట్ట ఉబ్బరం సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది. చాలా సమయం నుంచి ఏమీ తినకపోయినా పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. కొంతమందిలో...

పొట్ట ఉబ్బరం వేధిస్తోందా?

కొన్నిసార్లు పొట్ట ఉబ్బరం సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది. చాలా సమయం నుంచి ఏమీ తినకపోయినా పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. కొంతమందిలో ఈ సమస్య తరచుగా కనిపిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇలా చేయాలి...


బొప్పాయి, పైనాపిల్‌, కివీ వంటి పండ్లు జీర్ణశక్తిని పెంచుతాయి. గ్యాస్‌ ఉత్పత్తి కావడాన్ని తగ్గిస్తాయి. ప్రొటీన్లు, స్టార్చ్‌, కొవ్వు జీర్ణం కావడానికి సహాయపడతాయి. పైనాపిల్‌లో డైజెస్టివ్‌ ఎంజైమ్స్‌ ఉంటాయి. ఇక ప్రొటీన్‌ జీర్ణమయ్యేలా చేయడంలో బొప్పాయి చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే కివీ పండు పేగుల్లో కదలికలను పెంచుతుంది.

అరటికాయలో పొటాషియం పాళ్లు ఎక్కువ. పొట్టలో పేరుకుపోయిన సోడియంను బయటకు పంపి ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది. చిలగడదుంపల్లోనూ పొటాషియం ఎక్కువగా లభిస్తుంది.

పెరుగు, బ్లాక్‌ క్యారెట్‌ జ్యూస్‌, సౌర్ర్కాట్‌(తురిమిన క్యాబేజీని లాక్టిక్‌ ఆమ్లంలో పులియబెడతారు) వంటి వాటిలో ప్రొబయోటిక్స్‌ పుష్కలంగా లభిస్తాయి. ఇవి తీసుకుంటే పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.  పొట్ట ఉబ్బరం సమస్య దరిచేరకుండా ఉంటుంది.

యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ పొట్టలోని ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. పొట్టలో యాసిడ్‌ను బలోపేతం చేస్తుంది. 

వాము, జీలకర్ర పొట్టను శుభ్రం చేస్తాయి. ఇవి జీవక్రియల రేటును మెరుగుపరుస్తాయి. పొట్ట సంబంధ సమస్యల నుంచి ఉపశమనాన్ని అందించడానికి సహాయపడతాయి. పుదీనా టీ కూడా పొట్ట ఉబ్బరం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇది మలబద్ధకం సమస్య దరిచేరకుండా చూస్తుంది. బెర్రీ పండ్లలో ఫైబర్‌ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్‌ జీర్ణం కావడానికి ఎంజైముల అవసరం ఉండదు. కాబట్టి ఎంత శాతం తీసుకుంటానమన్నదే ముఖ్యం. ఫైబర్‌ శాతం మరీ ఎక్కువైనా ఉబ్బరం సమస్యకు దారి తీస్తుంది.

ఉబ్బరం సమస్యకు పసుపు, అల్లం, నిమ్మరసం చక్కగా పనిచేస్తాయి. వీటిని తీసుకోవడం ద్వారా పొట్ట ఉబ్బరం సమస్య దరిచేరకుండా చూసుకోవచ్చు. అలాగే రోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి. ఆహారం బాగా నమిలి తినాలి.

పంచదార శాతం ఎక్కువగా ఉండే పదార్థాలు, పాల ఉత్పత్తులు, క్యాలీఫ్లవర్‌, ముల్లంగి, క్యాబేజీ వంటి వాటిని తక్కువగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే పొట్ట ఉబ్బరం సమస్య దరిచేరకుండా ఉంటుంది.

Updated Date - 2021-08-18T05:30:00+05:30 IST