మ‌భ్యపెట్టడమే మనకాలపు రాజకీయమా?

ABN , First Publish Date - 2022-01-21T09:26:59+05:30 IST

ప్రజాజీవితంలో ఉండే వాళ్ళు నైతిక విలువలతో పాటు రాజకీయ విలువలు కూడా తప్పక పాటించాలి. వ్యక్తిగతంగా ఎవరు ఎలా ఉన్నా ప్రజా వేదికలపైన, మీడియా ముందు మాట్లాడినప్పుడు హుందాగా...

మ‌భ్యపెట్టడమే మనకాలపు రాజకీయమా?

ప్రజాజీవితంలో ఉండే వాళ్ళు నైతిక విలువలతో పాటు రాజకీయ విలువలు కూడా తప్పక పాటించాలి. వ్యక్తిగతంగా ఎవరు ఎలా ఉన్నా ప్రజా వేదికలపైన, మీడియా ముందు మాట్లాడినప్పుడు హుందాగా వ్యవహరించాలి. కానీ దురదృష్టవశాత్తు సామాజిక నిర్దేశం చేయవలసిన రాజకీయ నాయకులే ఈ విలువలను పాటించడం లేదు. ఇది సమాజానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకి మంచిది కాదు.


రాజకీయపార్టీలు ప్రజాకర్షక నాయకత్వాన్ని ముందు నిలబెట్టి ప్రజల ఎజెండాను పక్కదారి పట్టించడం ఆనవాయితీగా మారింది. నాయకత్వం విఫలమైనప్పుడల్లా వివిధ పద్ధతుల్లో ప్రజల ఆలోచనలను అవాస్తవాల వైపు మళ్ళించే ప్రయత్నం చేస్తారు. ప్రజా బాహుళ్యానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించే ఎజెండా వారి దగ్గర ఉండదు. ప్రజల జీవన ప్రమాణాల అభివృద్ధికి సంబంధించిన భవిష్యత్ ప్రణాళిక కూడా లేనప్పుడు ఆయా పార్టీలు అతివాద జాతీయవాదాన్ని, జాత్యహంకార వాదాన్ని ప్రదర్శిస్తాయి. కుట్రలను ప్రోత్సహిస్తాయి. తద్వారా వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తాయి. ఇవన్నీ కూడా నాయకత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టిని మళ్ళించడానికి రాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకం.


ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం, అగ్రెసివ్‌గా ఉండడమే నాయకత్వ లక్షణాలు అనిపించేట్టు ఉంది నేటి రాజకీయ నాయకుల ప్రవర్తన. అధికార‌, ప్రతిపక్షాలూ ఇదేవిధంగా వ్యవహరిస్తున్నాయి. కొంత కాలంగా ప్రజల సమస్యల్ని ఎజెండా నుంచి తప్పించి వ్యక్తిగత దూషణలే ప్రధానం చేసారు. అనామకులు వీధుల్లో గొడవపడ్డట్టు ప్రెస్‌మీట్స్ పెట్టి దూషించడం నిత్య ప్రహసనంగా మారింది. రాజకీయ విలువలకు సమాధి కట్టే పనిలో అన్ని పార్టీలు ఒకే తీరుగా వ్యవహరిస్తు న్నాయి. ఈ విలోమ విలువలే అసలు సిసలు నాయకత్వ లక్షణాలనీ, రాజకీయ విలువలని యువతను తప్పుదోవ పట్టించే పనిలో ఉన్నాయి.


కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో జరిగే ఎన్నికల సందర్భంగా ఇచ్చే హామీలు విచిత్రంగా ఉంటున్నాయి. అసాధ్యమైన హామీలను గుప్పించడం, చట్టానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఆనవాయితీగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్నది వాళ్ళ ప్రభుత్వం. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను రాష్ట్రంలో అమలు చేయం అంటూ హాస్యాస్పదమైన ప్రకటనలు ఇస్తున్నాయి. హైదరాబాద్ మేయరు అధికారిక వాహనం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన సందర్భంలో ట్రాఫిక్ సిబ్బంది చలాన్ విధించిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే యువతను తప్పుదోవ పట్టించే ప్రకటనలు తెలంగాణ రాజకీయ నాయకుల నుంచి వెలువడడం తెలంగాణలోని నాయకత్వ బలహీనతనకు నిదర్శనం. మేయ‌రుకు ప్రత్యేక అధికారాలు ఎన్ని ఉన్నప్పటికీ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టబద్ధంగా చర్యలు ఉంటాయి. ఆ మ‌ధ్య హైదరాబాద్ మేయ‌రు వాహ‌నం నో పార్కింగ్ జోన్‌లో ఉన్నదని పోలీసులు ఆ వాహనానికి ఫైన్ వేసిన విష‌యం తెలిసిందే. కాబ‌ట్టి ప్రజాప్రతినిధులు మాట్లాడే ప్రతి మాట‌, ఇచ్చే ప్రతి హామీ సాధ్యాసాధ్యాల‌ను తెలుసుకుని మాట్లాడితే మంచిది. మభ్యపెట్టే ప్రకటనలతోనే నమ్మి యువత ఓటేస్తారు అనుకుంటే అదే వారి భ్రమ మాత్రమే, ప్రజలు ఎప్పుడూ అమాయకులు కాదు.


స్థానిక సంస్థలు, చట్టసభలు ఇలా ఎన్నికలు ఏ స్థాయిలో జరిగినా ప్రజలు తమ ప్రాంతంలో నాయకుల మార్పిడి, అధికార మార్పిడి కోరుకున్నప్పుడు కొత్తవారికి ఓటేసి తమ అభీష్టాన్ని తెలియజేస్తారు. దుబ్బాక, హుజూరాబాద్‌లో అధికార పక్షం హామీలు కూడా ప్రజలు పట్టించుకోలేదు. ప్రలోభాలకు లొంగలేదు. ద‌ళితుల సంక్షేమం కోసం ప్రారంభించిన ద‌ళిత‌బంధు ప‌థ‌కం హుజురాబాద్‌లో ఎన్నిక‌ల ల‌బ్ధి కోస‌మే అని ప్రకటించడం కూడా వివాదాస్పదం అయ్యింది. దుబ్బాకలో మల్లన్నసాగర్ బాధితులు, ప్రభుత్వంపై సహజంగా వ్యతిరేకంగా ఉన్న ఇతర వర్గాల కలయిక ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసింది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నచోట నేతలు పోల్ మేనేజ్‌మెంట్ చేయగలమనుకుంటే అది కుదరదని ఋజువైంది. హుజురాబాద్‌లో రాజేందర్‌ను గెలిపించాలని ప్రజలు ముందే ఒక నిర్ణయానికి వచ్చినందున ఆయనపై పోటీదారులు గెలవలేకపోయారు. ఈ రెండు సందర్భాల్లో గెలిచిన పార్టీ మభ్యపెట్టే మాటలు, అబద్ధాలు, వైష‌మ్యపూరిత ప్రసంగాలు ప్రజలను ప్రభావితం చేశాయని భావిస్తే కూడా తప్పే. ఎవరు ఎన్ని గొప్పలు చెప్పకున్నప్పటికీ వాస్తవంలో జరిగింది వేరు. ముందుగానే అధికారపక్షానికి వ్యతిరేకంగా ఓటింగు చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు.


అధికార‌ప‌క్షం హామీల విష‌యంలో మభ్యపెట్టే ప్రయత్నం చేయడం స‌హ‌జం. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ప్రతిపక్షాలు కూడా వాస్తవాలు చెప్పకుండా మభ్యపెట్టే పనిలోనే ఉన్నాయి. ప్రభుత్వం తీసుకునే కొన్ని పరిపాలనా, విధానప‌ర‌మైన నిర్ణయాలపై కొంద‌రు ఉద్దేశపూర్వకంగానే ప్రజలను త‌ప్పుదోవ పట్టిస్తున్నారు. ఎలాన్‌ మ‌స్క్‌ను రాష్ట్రానికి ఆహ్వానిస్తూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌పై పోల్ నిర్వహించి దానిపై రాజ‌కీయాలు మాట్లాడ‌టం దురదృష్టకరం. ఒక్క కేటీఆరే కాదు, ఇత‌ర రాష్ట్రాల నేత‌లు కూడా ఎలాన్ మ‌స్క్‌ను వారి రాష్ట్రాల‌కు ఆహ్వానించారు. కానీ ఆయా రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇలాంటి వ్యక్తిగత కక్షపూరిత చర్చలు గాని, పోల్స్ గాని నిర్వహించలేదు. అక్కడి అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నాయి. నాయకుల మధ్య అధికారం కోసం జరిగే పోరాటంలో రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడం సమంజసం కాదు. ఇలాంటి వారు వాళ్ల పార్టీ విధానాల‌ను ప్రజలకు చెప్పకుండా వ్యక్తుల వ్యక్తిగత విష‌యాలపై దాడి చేసి ప్రజలను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్రయత్నాలను కొంత‌కాలంగా చేస్తున్నారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడితే ప్రజలు హర్షించరు. ప్రజల సమస్యలు ప్రధాన ఎజెండాగా చేసుకుని సాగే రాజకీయాలు మాత్రమే అశేష ప్రజానికానికి మేలు చేస్తాయి. ప్రజలు వాళ్ళకే పట్టం కడతారు.

ఎర్రోజు శ్రీనివాస్

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వికాస సమితి

Updated Date - 2022-01-21T09:26:59+05:30 IST