CM పదవి పేమెంట్ సీటా?: Bjpని నిలదీసిన Siddaramaiah

ABN , First Publish Date - 2022-05-08T00:02:49+05:30 IST

కర్ణాటక ముఖ్యమంత్రి పదవి వేలానికి పెట్టారా? డబ్బులిస్తే చాలు...ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేస్తారా? అని..

CM పదవి పేమెంట్ సీటా?: Bjpని నిలదీసిన Siddaramaiah

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి వేలానికి పెట్టారా? డబ్బులిస్తే చాలు...ముఖ్యమంత్రి పదవి (CM seat) కట్టబెట్టేస్తారా? అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) బీజేపీని సూటిగా నిలదీశారు. ఆ విషయం తాను తెలుసుకోవాలనుకుంటున్నానని అన్నారు. రూ.2,500 కోట్లు ఇస్తే అత్యున్నత పదవి మీదేనంటూ కొందరు పవర్ బ్రోకర్లు తనను సంప్రదించారని అధికార పార్టీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ పేర్కొనడంపై  తక్షణం దర్యాప్తు జరపాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం వరుస అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మాజీ సీఎం డిమాండ్ ప్రాధాన్యం సంతరించుకుంది.


''ఇది చాలా సీరియస్ అంశం. దీనిపై సరైన దర్యాప్తు జరిగితేనే నిజం వెలుగుచూస్తుంది. సీఎం పదవి పేమెంట్ సీటా?'' అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. ఢిల్లీకి చెందిన పవర్ బ్రోకర్లు కొందరు తనను సీఎం పదవి కోసం సంప్రదించారంటూ యత్నాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే కలకలం రేపాయి. అయితే, యత్నాల్ నేరుగా ఎవరి పేరును ప్రస్తావించలేదు. దీనిపై సిద్ధరామయ్య మాట్లాడుతూ, బీజేపీలో పలు అవకతవకలు జరిగినట్టు తనకు సమాచారం ఉందని అన్నారు. బీజేపీలో లెజిస్లేచర్ పార్టీనే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటుందనే అభిప్రాయం ప్రజల్లో ఉందని, అయితే సీఎం సీటు వేలం ద్వారా అమ్ముతారని యత్నాల్ వెల్లడించారని చెప్పారు. బీజేపీ గత సీఎంలు కూడా ఆ పదవి కోసం ఎంత మొత్తం ఖర్చుపెట్టారనే వ్యవహారంపై కూడా దృష్టి సారించాల్సి ఉందన్నారు. మంత్రుల పదవులతో పాటు ఇతర పదవులకు కూడా బీజేపీ రేట్లు పెట్టినట్టు తెలుస్తోందన్నారు. సివిల్ కాంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమిషన్ల స్కాములు, యత్నాల్ ఆరోపణలకు లింక్ ఉన్నట్టు కనిపిస్తోందని ఉడిపి సివిల్ కాంట్రాక్టర్ ఆత్మహత్య ఘటనను ప్రస్తావిస్తూ అన్నారు. ఇన్ని ఆరోపణలు వస్తున్నా బీజేపీ మౌనంగా ఎందుకు ఉంటోందని నిలదీశారు. అధిష్ఠానానికి తెలిసే ఇవన్నీ జరుగుతుండటమే ఈ మౌనానికి కారణమా అని సిద్ధరామయ్య సూటిగా ప్రశ్నించారు.

Read more