భావ వ్యక్తీకరణ దేశద్రోహమా?

ABN , First Publish Date - 2022-01-18T09:06:19+05:30 IST

దేశద్రోహంతో పాటు ఐపీసీలోని సెక్షన్‌ 153(ఏ), 505, 120బీ కింద సీఐడీ

భావ వ్యక్తీకరణ దేశద్రోహమా?

  • సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయండి
  • హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ రఘురామ 
  • అనారోగ్యం వల్ల రాలేక పోతున్నా..
  • సీఐడీ పోలీసులకు లేఖ
  • కోర్టులో కేసు విచారణలో ఉందని వెల్లడి


 

అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): దేశద్రోహంతో పాటు ఐపీసీలోని సెక్షన్‌ 153(ఏ), 505, 120బీ కింద సీఐడీ పోలీసులు సుమోటోగా తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదలచేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. ‘‘ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలు పరిశీలిస్తే.. సీఎంను వ్యక్తిగతంగా, ఫలానా సామాజికవర్గానికి వ్యతిరేకంగా మాత్రమే వ్యవహరించానని పేర్కొన్నారు. నా వ్యాఖ్యలు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే లా ఉన్నాయని ఎక్కడా పేర్కొనలేదు.


వాక్‌ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ ప్రాథమిక హక్కు. ఈ నేపఽథ్యంలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ చెల్లుబాటు కాదు. స్థానిక శాసనసభ్యులతోపాటు మరికొందరు నియోజకవర్గంలోకి రాకుండా అడ్డుకుంటామని శపథం చేశారు. దీంతో మా అమ్మమ్మ అంత్యక్రియలకు సైతం హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి వస్తున్నానని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌, ఎస్పీకి ఈ నెల 10, 11 తేదీల్లో ఫోన్‌ ద్వారా తెలియజేశాను.


ఈ నెల 11న ఉదయం తొమ్మిది గంటలకు అకస్మాత్తుగా పోలీసులు ఇంటికి వచ్చి మంగళగిరి సీఐడీ పోలీసుల ముందు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ముఖ్యమంత్రి రాజకీయ ప్రత్యర్థులపై సీఐడీ ఏడీజీ పలు తప్పుడు కేసులు నమో దు చేస్తున్నారు’’ అని రఘురామ పిటిషన్‌లో వివరించారు. అలాగే, అనారోగ్యం కారణంగా విచారణకు రాలేకపోతున్నానని రఘురామకృష్ణరాజు సీఐడీ పోలీసులకు లేఖ రాశారు.  కేసు విచారణ ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉన్నందున నాలుగు వారాలు గడువు కావాలని విజ్ఞప్తి చేశారు.     


Updated Date - 2022-01-18T09:06:19+05:30 IST