ఉచిత బియ్యం ఉత్తిమాటేనా?

ABN , First Publish Date - 2021-05-11T06:39:28+05:30 IST

కరోనా నేపథ్యంలో రేషనకార్డులు కలిగిన పేద కు టుంబాలకు మే, జూన నెలల్లో ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తామని కేంద్రప్రభుత్వం ప్రకటించింది.

ఉచిత బియ్యం ఉత్తిమాటేనా?
రేషన దుకాణంలో సరుకులు తీసుకుంటున్న ప్రజలు(ఫైల్‌)

 కరోనా వేళ రెండు నెలలు  ఉచితమని ప్రకటించిన కేంద్రం
 ఆ కోటా రాలేదంటున్న రేషన డీలర్లు
 డబ్బు ఇస్తేనే బియ్యం
 పెదవివిరుస్తున్న లబ్ధిదారులు

మోత్కూరు, మే10 :
కరోనా నేపథ్యంలో రేషనకార్డులు కలిగిన పేద కు టుంబాలకు మే, జూన నెలల్లో ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తామని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ మేరకు కేంద్రప్రభుత్వం నుంచి బియ్యం కోటా విడుదల కాకపోవడంతో డీలర్లు గతంలో మాదిరిగానే డబ్బులు కిలోకు రూపాయి చొప్పున వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూపాయికి కిలో చొప్పున కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికీ ఆరు కిలోల బి య్యం పంపిణీ చేస్తోంది. రెండు నెలలుగా దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ వైరస్‌ విజృంభిస్తుండటంతో కొన్ని రాషా్ట్రల్లో లాక్‌డౌన, మరికొన్ని రాష్ట్రా ల్లో పాక్షిక లాక్‌డౌన అమలు చేస్తున్నారు. దీంతో పరిశ్రమలు, వ్యాపారాలు, ఇతర పనులు కుంటుపడటంతో నిరుపేద, పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఉపాధి కోల్పోయారు. వారిని ఆదుకునేందుకు 15రోజుల క్రితం కేంద్రం  రేషనకార్డుదారులకు మే, జూన నెల ల్లో ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించింది. అయితే అందుకు అనుగుణంగా బియ్యం కోటా విడుదలకాలేదు.
ఉమ్మడి జిల్లాలో 9.74లక్షల రేషనకార్డులు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2,081 రేషన దుకాణాలుండగా, 9,74,879 కార్డులు ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో 481రేషన దుకాణాలు, 2,13,810 కా ర్డులు, నల్లగొండ జిల్లాలో 991రేషన దుకాణాలు 4,54,019కార్డులు, సూర్యాపేట జిల్లాలో 609 రేషన దుకాణాలు 3,07,050 కార్డులు ఉన్నాయి. ఈ కార్డులకు ప్రభుత్వం ప్రతినెల 59వేల క్వింటాళ్ల బియ్యం కోటాను విడుదల చేస్తోంది. ఈ నెల కోటా కోసం డీలర్లు గత నెలలోనే డీడీలు తీశారు. ఆ మేరకు రేషన దుకాణాలకు బియ్యం కూడా సరఫరా అయింది.
ఉచితమన్న కేంద్రం, డబ్బులు తీసుకుంటున్న డీలర్లు
రేషన కార్డుదారులకు ఒక్కొక్కరికి మే, జూన మాసాల్లో ఐదు కిలోల రేషన బియ్యం ఉచితంగా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో లబ్ధిదారులు డబ్బులు తీసుకెళ్లకుండా రేషన దుకాణానికి వెళ్తున్నారు. డీలరు డబ్బులు అడగటంతో లబ్ధిదారులు ఖంగుతింటున్నారు. ఉచితం కదా అని ప్రశ్నిస్తే అలాంటి ఆదేశాలేవీ రాలేదని డీలర్లు చెబుతున్నారు. దీంతో ఉచితంగా ఇస్తామని ఆశచూపడమెందుకని కార్డుదారులు మండిపడుతున్నారు. డబ్బు వెంట తెచ్చుకోని వారు తిరిగి ఇళ్లకు వెళ్లి డబ్బు తెచ్చి రేషన తీసుకెళ్తున్నారు. గత ఏడాది మొదటి దశ కరోనా సమయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండు మాసాలు (ఏప్రిల్‌, మేలో) ఒక్కొక్కరికి పన్నెండు కిలోల చొప్పున, ఆ తర్వాత ఆరు మాసాలు (జూన నుం చి నవంబరు వరకు) ఒక్కొక్కరికి పది కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందే తప్ప కోటా విడుదల చేయలేదని అధికారులు చెబుతున్నారు. డీలర్లు గత నెలలోనే డీడీలు తీసినప్పటికీ వారికి డబ్బు వాపసు ఇవ్వడమో, లేక మే, జూన మాసాలు ఉచితం బియ్యం పంపిణీ చేశాక నెల కోటా ఇస్తేనో సరిపోయేదికదా అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఉచితంగా రేషన బియ్యం ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
భయంభయంగా డీలర్లు
కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండటంతో రేషన డీలర్లు భయంభయంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. వైరస్‌తో ప్రమాదం ఉందని, ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనం కల్పించడం లేనందున ఈ నెల బియ్యం పంపిణీ చేయవద్దని డీలర్ల సంఘం రాష్ట్ర నాయకులు ప్రకటించారు. దీంతో ఈ నెల 7వ తేదీ వరకు మోత్కూరు, మరికొన్ని మండలాల్లో డీలర్లు బియ్యం పంపిణీ ప్రారంభించలేదు. బీమా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందంటూ రాష్ట్ర నాయకులు చెప్పడంతో ఈ నెల 8వ తేదీ నుంచి బియ్యం పంపిణీని డీలర్లు ప్రారంభించారు.
ప్రజల్లో అప్రతిష్ఠపాలవుతున్నాం

- రాజ్యలక్ష్మీ, రేషన డీలర్‌, జామచెట్లబావి
కరోనా వేళ మే, జూనలో కార్డుదారులకు ఒక్కొక్కరికీ ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే డబ్బులు ఎలా తీసుకుంటారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడంలేదని చెప్పినా నమ్మడం లేదు. ప్రభుత్వం ఉచితంగా ఇస్తామని ప్రకటించి, డీలర్లను డబ్బులు తీసుకోమని చెప్పడంతో మేం ప్రజల్లో అప్రతిష్ఠపాలవుతున్నాం. కరోనా వేళ భయంభయంగా బియ్యం ఇవ్వాల్సి వస్తోంది. ప్రభుత్వం మాకు తగిన భరోసా కల్పించాలి.
అలాంటి ఆదేశాలేవీ రాలేదు

- షేక్‌ అహమ్మద్‌, తహసీల్దార్‌, మోత్కూరు
ఈ నెల రేషన ఉచితంగా ఇవ్వాలన్న ఆదేశాలేవి ప్రభుత్వం నుంచి రాలేదు. గతంలో మాదిరిగానే డీలర్ల నుంచి డీడీలు తీసుకుని బియ్యం ఇచ్చాం. వారు కూడా డబ్బులు తీసుకునే లబ్ధిదారులకు బియ్యం ఇస్తున్నారు. ఆ తర్వాత ఇస్తారేమో తెలియదు.

Updated Date - 2021-05-11T06:39:28+05:30 IST