భార్యల్ని కొట్టడం భర్తల జన్మహక్కు??!!

ABN , First Publish Date - 2021-11-27T21:11:02+05:30 IST

అతని భార్య, కొట్టుకుంటాడో... నరుక్కుంటాడో... అతనిష్టం

భార్యల్ని కొట్టడం భర్తల జన్మహక్కు??!!

న్యూఢిల్లీ : అతని భార్య, కొట్టుకుంటాడో... నరుక్కుంటాడో... అతనిష్టం; మధ్యలో తలదూర్చడానికి మనమెవరం...? అని మనం తరచూ వింటుంటాం. ఇది ఎవరో నూటికో కోటికో ఒకరు అనడం కాదు,  ఇటువంటి అభిప్రాయాన్నే దేశం మొత్తంలో మెజారిటీ మగవాళ్లు, ఆడవాళ్లు కూడా కలిగి ఉండటమే ఆందోళన కలిగించే విషయం. జీవిత భాగస్వామిని మగవాడు కొట్టడం అనే అంశం మీద జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా జరిపిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.


మహిళా సాధికారత గురించి ఎంతగా చెప్పుకుంటున్నప్పటికీ, గృహ హింస కూడా ఎక్కువగానే జరుగుతోంది. మహిళల విషయంలో పురుషుల వైఖరిపై ఆందోళనకర అంశాలను జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. భార్యను భర్త కొట్టడం సమర్థనీయమేనా? అనే ప్రశ్నకు అత్యధిక శాతం మహిళలు సైతం ‘ఔను’ అని సమాధానం చెప్పడం విస్మయం కలిగిస్తోంది. 


ఈ అధ్యయనంలో పాల్గొన్న తెలంగాణా మహిళల్లో 83.8 శాతం మంది భర్త తన భార్యను కొట్టడం సమర్థనీయమేనని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో 14.8 శాతం మంది మహిళలు మాత్రమే ఈ ప్రశ్నకు ‘ఔను’ అని జవాబు చెప్పారు. అదేవిధంగా పురుషులను ఈ ప్రశ్న అడిగినపుడు, కర్ణాటకలో ఈ సర్వేలో పాల్గొన్న పురుషుల్లో 81.9 శాతం మంది భర్త తన భార్యను కొట్టడం సమర్థనీయమేనని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ పురుషుల్లో 14.2 శాతం మంది మాత్రమే ఇటువంటి భర్తలను సమర్థించారు.  భార్యను భర్త కొట్టడాన్ని అతి తక్కువగా సమర్థించిన పురుషులు, మహిళలుగల రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ మాత్రమే. ఆంధ్ర ప్రదేశ్‌లో 83.6 శాతం మంది మహిళలు, 66.5 శాతం మంది పురుషులు భర్త తన భార్యను కొట్టడాన్ని సమర్థించారు.


భార్యను భర్త ఏ కారణంతో కొడతారో చెప్పాలని కోరుతూ 7 కారణాలను కూడా ఈ ప్రశ్నలో పేర్కొన్నారు. 

- భర్తకు చెప్పకుండా భార్య బయటకు వెళ్ళడం

- ఇంటిని లేదా పిల్లలను నిర్లక్ష్యం చేయడం

- భర్తతో వాదనకు దిగడం

- సెక్స్ చేయడానికి తిరస్కరించడం

- భోజన పదార్థాలు సరైన విధంగా వండకపోవడం

- నమ్మకద్రోహానికి పాల్పడుతున్నట్లు అనుమానించడం

- భర్త తరపు బంధువులను అగౌరవపరచడం

 

అస్సాం, ఆంధ్ర ప్రదేశ్, బిహార్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీరు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, తెలంగాణా, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లలో 2019-21 మధ్య కాలంలో ఈ సర్వేలను నిర్వహించారు. ఈ సమాచారాన్ని బుధవారం వెల్లడించారు. 


Updated Date - 2021-11-27T21:11:02+05:30 IST