డ్రగ్‌ మాఫియాకు హైదరాబాద్ షెల్టర్‌ జోన్‌..?

ABN , First Publish Date - 2021-06-22T12:20:55+05:30 IST

భారీ మోతాదులో మాదకద్రవ్యాలు పట్టుపడటం కలకలం రేగుతోంది.

డ్రగ్‌ మాఫియాకు హైదరాబాద్ షెల్టర్‌ జోన్‌..?

  • పట్టుబడుతున్న రూ.కోట్ల విలువ చేసే డ్రగ్స్‌
  • స్థానికుల సహకారం?

హైదరాబాద్‌ సిటీ : శంషాబాద్‌ విమానాశ్రయంలో మరోసారి భారీ మోతాదులో మాదకద్రవ్యాలు పట్టుపడటం కలకలం రేగుతోంది.  రెండు వారాల వ్యవధిలో రూ. కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ దొరకడంతో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమవారం జోహన్నె్‌సబర్గ్‌ నుంచి దోహా మీదుగా నగరానికి విమానంలో వచ్చిన ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేయగా, రూ.19.5 కోట్లు విలువ చేసే మూడు కేజీల హెరాయిన్‌ దొరికిందని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు వివరించారు. ఈ నెల 6న కూడా జింబాబ్వేకు చెందిన ఇద్దరి వద్ద రూ. 50 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను పట్టుకున్న విషయం తెలిసిందే. డ్రగ్స్‌ అంటే పంజాబ్‌, గోవా, బెంగళూరు తర్వాత హైదరాబాద్‌ పేరు ప్రధానంగా వినిపించడంతో అనుమానాలకు తావిస్తోంది.  


దొరకని దొంగలెందరో..?

రెండు వారాల వ్యవధిలో రెండు ఘటనల్లో పెద్ద ఎ త్తున డ్రగ్స్‌ దొరకగా, కళ్లు గప్పి వెళ్లిన కేసులెన్నీ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు కేసు లూ అధికారులకు వచ్చిన సమాచారం ఆధారంగానే పట్టుకున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ మాదకద్రవ్యాలను తరలిస్తూ పలువురు ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డారు. పకడ్బందీగా సెక్యూరిటీ ఉన్నప్పటికీ టాంజానియా, నైజీరియా, జింబాబ్వే లాంటి ఆఫ్రికా దేశాల నుంచి సిటీకి డ్రగ్స్‌ తరలిస్తున్నట్లు భావిస్తున్నారు. 


ఇక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు..?

దశాబ్ద కాలంగా నగరంలో డ్రగ్స్‌ అమ్మకాలు జోరందుకుంటున్నాయి. విశాలమైన నగరం, నిందితులు స్థావరాలు ఏర్పాటు చేసుకోడానికి అనువుగా శివారు ప్రాంతాలు, ఈజీగా అద్దెకు ఇళ్లు దొరకడం, సిటీ నుంచి ముంబై, బెంగళూరు, నాగ్‌పూర్‌, చెన్నయ్‌, విశాఖపట్నం మీదుగా ఒడిశా, గోవా నగరాలకు వెళ్లడానికి రోడ్డు మార్గాలు ఉండటంతో నేరస్తులు హైదరాబాద్‌ను షెల్టర్‌జోన్‌గా భావిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు పోలీసులకు చిక్కిన వారిని ప్రశ్నిస్తే గోవా, ముంబై నుంచి  తరలించామని చెప్పేవారు. క్రమేణా సీను రివర్స్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారా అన్న అనుమానాలకు ఇటీవల చిక్కిన సుమారు రూ. 80 కోట్ల విలువైన డ్రగ్స్‌ బలం చేకూరుస్తున్నాయి. 


స్థానికుల సహకారం.. 

మాదకద్రవ్యాల తరలింపులో వందల సంఖ్యలో విదేశీయులతోపాటు అంతకు మించి నగరవాసులూ అరెస్ట్‌ అయ్యారు. స్థానికుల సాయంతోనే ఆఫ్రికన్లు ఇక్కడ దందా కొనసాగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విదేశాల నుంచి స్మగ్లింగ్‌ అవుతున్న డ్రగ్స్‌కు సూత్రధారులు విదేశీయులే అయినప్పటికీ ఇక్కడి వారి సహకారం లేకుండా ఈ దందా చేయరని అధికారులు అంటున్నారు. విదేశీయులు డబ్బు మోజులో పడి అనుకోకుండానే డ్రగ్స్‌ సరఫరాదారుల అవతారమెత్తుతున్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన కొందరు, అధిక సంపాదన కోసం ఇంకొందరు.. తెలియక కొంత మంది మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నారని అంటున్నారు.  


పెరుగుతున్న కేసులు

నగరంలో 2019లో 55 మాదక ద్రవ్యాల కేసులు నమోదు కాగా, 2020లో 88 కేసులు నమోదయ్యాయి. 2019లో 133 మంది అరెస్టు కాగా, 2020లో 196 మంది చిక్కారు. ఈ రెండేళ్లలో విదేశీయుల సంఖ్య కేవలం 14మంది మాత్రమే.

Updated Date - 2021-06-22T12:20:55+05:30 IST