Corona నుంచి కోలుకున్నా Black Fungus తో కొత్త సమస్య.. చికిత్సలో దాన్ని వాడటం వల్లేనా..?

May 26 2021 @ 16:49PM

కరోనా సెకండ్ వేవ్‌ కారణంగా భారతదేశ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఇలాంటి తరుణంలో ప్రజలను, వైద్యులను ఇంకా భయపెడుతున్న మరో అంశం బ్లాక్ ఫంగస్. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఫంగస్ వేగంగా వ్యాపిస్తోంది. కరోనా నుంచి కోలుకొని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే సమయంలో పేషెంట్లపై ఈ బ్లాక్ ఫంగస్ దాడి చేస్తోంది. ఇంతకు ముందు కూడా దేశంలో ఈ ఫంగస్ వ్యాధి ఉంది. కానీ ఇంతలా కాదు. ఏడాది మొత్తం చూసుకుంటే అడపాదడపా ఓ వంద కేసులు కనిపించేవి. అదే ఎక్కువ. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కరోనా కారణంగా బలహీనంగా మారిన పేషెంట్లపై ఈ ఫంగస్ దాడి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా వేగంగా వ్యాపిస్తూ భయాందోళనలు కలిగిస్తున్న ఈ బ్లాక్ ఫంగస్‌కు కారణాలేంటి? దీనికి వైద్యులు చెప్తున్న సమాధానమేంటి? ఒకసారి పరిశీలిస్తే..


మనదేశంలో తెలుగు రాష్ట్రాలతోపాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు బాగా వెలుగు చూశాయి. తాజాగా కర్ణాటకలో ఈ ఫంగస్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. దీంతో ఇక్కడి వైద్యులు దీనికి కారణాలు కనుక్కునే పనిలో పడ్డారు. బ్లాక్ ఫంగస్ లేక మ్యూకర్‌మైకాసిస్ అనే ఈ వ్యాధి గురించి చర్చించేందుకు కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సీ ఎన్ అశ్వథనారాయణ్ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రంలో కొవిడ్ టాస్క్‌ఫోర్స్ ఈయన ఆధ్వర్యంలోనే పనిచేస్తోంది. సమావేశంలో పాల్గొన్న వైద్యులందరూ అసలు బ్లాక్ ఫంగస్ ఎక్కడి నుంచి వ్యాపిస్తోంది? దీనికి కారణాలేంటి? అనే విషయంపై చర్చించారు. ఈ చర్చలో కీలకంగా మారిన అంశం కరోనా పేషెంట్లకు అందజేస్తున్న ఆక్సిజన్ సరఫరా విధానం.

కర్ణాటకలో గడిచిన వారం రోజుల్లో 700 వరకూ బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. ఈ పరిస్థితిపై వైద్యులందరూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో ఫంగస్ వ్యాపించడం ఇప్పటి వరకూ జరగలేదని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుందా? అంటే సరఫరా అవుతున్న ఆక్సిజన్, పైపింగ్, సిలిండర్ల నాణ్యతే అయ్యుండొచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు. దీనిపై పరిశోధన చేసేందుకు మరికొన్ని రోజుల్లో కొందరు మైక్రోబయాలజిస్టులతో ఒక కమిటీ నియమించబోతున్నట్లు సమాచారం. భారత్‌లో ఏడాది మొత్తం చూసినా వంద బ్లాక్ ఫంగస్ కేసులు కూడా నమోదయ్యేవి కావు. అలాంటిది ఒక్క కర్ణాటకలోనే వారంలో 700 కేసులు నమోదవడం వైద్య రంగాన్ని కలవరపరుస్తోంది. దానికితోడు మిగతా దేశాల్లో ఇలాంటి పరిస్థితి లేదు. అక్కడ కరోనా కేసులు నమోదవుతున్నా కూడా బ్లాక్ ఫంగస్ కేసులు చాలా అరుదుగా కనబడుతున్నాయి.


బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి కలుషితమైన ఆక్సిజన్ కారణం అయ్యుండొచ్చని డాక్టర్లు అంటున్నారు. సిలిండర్లలోకానీ, లేదంటే ఆస్పత్రుల్లో ఐసీయూల్లో ఉన్న పైపింగ్ వ్యవస్థలోకానీ నాణ్యతా లోపం కూడా బ్లాక్ ఫంగస్‌కు కారణం అయ్యుండొచ్చట. అలాగే ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీల్లో కలుషిత పరిస్థితులు, అలాగే స్టెరిలైజేషన్ లోపం కూడా బ్లాక్ ఫంగస్‌కు ఆధారం కావొచ్చని డాక్టర్లు అంటున్నారు. ఇలా ఎక్కడో ఒకచోట ఆక్సిజన్ సరఫరా కలుషితం కాకపోతే ఇన్ని బ్లాక్ ఫంగస్ కేసులు రావడం జరగదని, అదే జరిగితే పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లేనని వాళ్లు వివరించారు. డిప్యూటీ సీఎంతో సమావేశంలో కూడా కర్ణాటక డాక్టర్లు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు.

డాక్టర్లు లేవనెత్తిన మరో కలవరపరిచే అంశం ఏంటంటే.. ఆస్పత్రి వెంటిలేటర్లలో ట్యాప్ వాటర్ ఉపయోగించడం. అసలు ఇలా చేస్తారా? అని అనుమానాలు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల ఇదే జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే కరోనా కేసులు విపరీతంగా పెరగడం వల్ల ఆక్సిజన్ డిమాండ్ కూడా పెరిగింది. దీంతో పరిశ్రమల నుంచి అధిక మొత్తాల్లో ఆక్సిజన్ సరఫరా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ స్టెరిలైజేషన్ సరిగా జరుగుతుందా? పరిశుభ్రత కచ్చితంగా పాటిస్తున్నారా? అనేది మరో ప్రశ్న. ఇంత డిమాండ్ ఉన్న వేళ ఆక్సిజన్ నాణ్యతలో మార్పు రావడం లేదా? అనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. బ్లాక్ ఫంగస్ వ్యాప్తిపై వేసిన కమిటీ వీటన్నింటిపైనా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనుంది. అలాగే బ్లాక్ ఫంగస్ సోకిన పేషెంట్ల మెడికల్ హిస్టరీని పరిశీలించి విశ్లేషణ చేస్తుంది. ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్న ఫ్యాక్టరీలను కూడా ఈ బృందం పరిశీలిస్తుంది. ఇవన్నీ పరిశీలించి ప్రభుత్వానికి తమ నివేదికను అందజేయనుంది. ఈ నివేదికపైనే ప్రస్తుతం దేశం మొత్తం ఫోకస్ పెడుతోంది. బ్లాక్ ఫంగస్ కారణాలు తెలియాలంటే ఈ రిపోర్టు వచ్చే వరకూ ఆగాల్సిందే.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.