
పది జట్లు, 71 మ్యాచ్‌లు
ప్రధాన పట్టణాల్లో బుకీలు
పల్లె పల్లెనా ఏజెంట్లు
బెట్టింగ్ రూ.100 కోట్లు దాటవచ్చని అంచనా
పోలీసులు నిఘా పెట్టకపోతే వీధినపడనున్న కుటుంబాలు
కడప, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ శుక్రవారం గ్రాండ్‌గా మొదలైంది. ఈసారి పది జట్లు బరిలోకి దిగాయి. సుమారు రెండు నెలల పాటు మరో 72 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. కొందరు ఆటను ఆటగా చూసే రోజులు మారి బెట్టింగ్ నిర్వహించే రోజులు వచ్చాయి. ఒకప్పుడు మ్యాచ్ గెలుపు ఓటమి పై బెట్టింగ్ జరగ్గా ఇప్పుడు బంతి బంతికి బెట్టింగ్ కాస్తున్నారు. బెట్టింగ్ మహమ్మారిని కట్టడి చేయకపోతే ఎన్నో కుటుంబాలు ఈ ఉచ్చులో చిక్కుకుని రోడ్డున పడే ప్రమాదం ఉంది. మ్యాచ్‌ను బట్టి ఒక్కో మ్యాచ్‌లో ఒకటిన్నర కోటి దాకా చేతులు మారతాయనే ప్రచారం ఉంటోంది. ఈ లెక్కన 100 కోట్లకు పైగా బెట్టింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. క్రికెట్లో బెట్టింగ్ పెరుగుతున్నప్పటికీ అది కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యేది. అయితే ఐపీఎల్ రాకతో బెట్టింగ్ విస్తరించింది. అయితే మొబైల్ కంపెనీల మధ్య పోటీతో ఇంటర్నెట్ చౌక అయ్యింది. దీంతో స్మార్ట్‌ఫోన్ అందరి చేతిలో ఉంది. ఒకప్పుడు టీవీల్లోనే క్రికెట్ వచ్చేది. అయితే ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌తో బెట్టింగ్ స్వరూపమే మారిపోయింది. సెల్ కంపెనీలు కూడా ఐపీఎల్ రోజుల్లో ప్రత్యేక ప్లాన్లు, వోచర్లు, క్రికెట్ ప్రసారమయ్యే స్పోర్ట్స్ చానళ్లు, ఓటీటీలను వీక్షించే అవకాశం కల్పించారు. దీంతో పాటు పలు బెట్టింగ్ యాప్‌లు అందుబాటులో ఉండడంతో బెట్టింగ్ ఆడాలనే ఆలోచన ఉంటే చాలు యాప్‌ల ద్వారా కొందరు బెట్టింగ్‌లు ఆడుతున్నారు.
పట్టణం నుంచి పల్లెకు
ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. మరి కొంత మంది అమాయకులను ఈజీ మనీ సంపాదించుకోవచ్చంటూ ఆ బురదలోకి లాగేస్తున్నారు. గతంలో కేవలం ప్రధాన పట్టణాలకే బెట్టింగ్ ఉంటే ఇప్పుడు పల్లెలకూ పాకింది. చాలా ఊర్లలో ఊరికి ఒకరో ఇద్దరో బుకీలను నియమించుకున్న ఏజెంట్లు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రొద్దుటూరు పట్టణం బెట్టింగ్‌కు స్థావరంగా ఉండేది. అక్కడి నుంచే బెట్టింగ్ నెట్వర్క్ అంతా నడిచేది. అయితే ఇప్పుడు బుకీలు రూటు మార్చారు. ప్రొద్దుటూరులో ఉండకుండా పది రోజుల క్రితమే ప్రధాన బుకీలు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రధాన బుకీలు కొందరు కోల్‌కతాతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉంటూ తమ నెట్వర్క్ ద్వారా బెట్టింగ్ నిర్వహించేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ప్రొద్దుటూరు పట్టణంలో దస్తగిరిపేట, మోడంపల్లె, వసంతపేట, రామేశ్వరం, బొల్లవరం, గోపవరం, మైదుకూరు రోడ్డు, ఆర్ట్స్ కాలేజీ, గాంధీ రోడ్డు, జిన్నా రోడ్డు, వైఎంఆర్ కాలనీ, శ్రీనివా్‌సనగర్‌లోని పలు ప్రాంతాల్లో బెట్టింగ్ ఏజెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. కడప నగరంలోని ఎర్రముక్కపల్లె, రవీంద్రనగర్, అల్మా్‌సపేట, నకాష్, చిన్నచౌక్, నాగరాజుపేటలోని కొన్ని చోట్ల క్రికెట్ బెట్టింగ్ ఆడేవారు ఉన్నట్లు తెలుస్తోంది.
యువతే టార్గెట్
క్రికెట్ బెట్టింగ్‌లో ఉన్నత చదువులు చదువుతున్న యువత, కొందరు ఉద్యోగులు బెట్టింగ్ ఊబిలో కూరుకుపోయారని చెబుతారు. బెట్టింగ్‌కు బానిస అయిన వారు గెలుస్తామన్న ధీమాతో అప్పులు చేసి ఈ ఊబిలో చిక్కుకుపోతున్నారు. ఒకప్పుడు గతంలో గెలుపోటములపై బెట్టింగ్ జరిగేది. ఇప్పుడు ఏ బ్యాట్స్‌మెన్ ఎన్ని పరుగులు చేస్తాడు. అందులో ఎన్ని సిక్స్‌లు, ఎన్ని ఫోర్లు, ఏ ఓవర్లో ఎన్ని పరుగులు తీస్తాడు, అందులో ఫోర్లు ఎన్ని, సిక్స్‌లు ఎన్ని, ఏ బౌలర్ ఎన్ని వికెట్లు తీస్తాడు అనే వాటిపై బెట్టింగ్ కాస్తున్నట్లు చెబుతున్నారు.
డిపాజిట్లు చెల్లించాల్సిందే
బుకీ ద్వారా బెట్టింగ్ నిర్వహించే వారు ముందస్తుగా బుకీకి డిపాజిట్ చేయాలని తెలుస్తోంది. రూ.10 వేలు మొదలుకొని లక్ష దాకా డిపాజిట్ చేస్తేనే ఆడేందుకు బెట్టింగ్‌కు అవకాశం ఇస్తున్నట్లు చెబుతున్నారు. బుకీలు సేఫ్‌సైడ్‌లో ఉండేందుకు డిపాజిట్లను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పోలీసు నిఘా నుంచి తప్పించుకునేందుకు కోడ్ భాషలో లావాదేవీల్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారని చెబుతారు. బెట్టింగ్ గెలిచిన సొమ్మును వివిధ మార్గాల్లో అందించేందుకు బుకీలు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
కట్టడి చేయకపోతే అంతే
బెట్టింగ్‌ను కట్టడి చేయకపోతే చిన్న కుటుంబాలు రోడ్డున పడతాయి. తెల్లారేసరికి లక్షల రూపాయలు సంపాదించాలన్న దురాశతో బెట్టింగ్ పెట్టిన వారి జీవితాలు తెల్లారే సరికి రోడ్డున పడే అవకాశం ఉంది. చిన్న కుటుంబాలు బెట్టింగ్ వల్ల నాశనమయ్యాయి. బెట్టింగ్‌పై చేసిన అప్పులు తీర్చలేక ఆస్తులు అమ్ముకున్న వారు కూడా ఉన్నట్లు చెబుతారు.
యాప్‌ల జోరు
బుకీలు, ఏజెంట్ల ద్వారా బెట్టింగ్ నిర్వహించలేని కొందరు యాప్‌ల ద్వారా మూడో కంటికి తెలియకుండా ఆడుతున్నారు. వివిధ రకాల మొబైల్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. నగదు లావాదేవీలు కూడా అత్యంత పకడ్బందీగా నిర్వహించినట్లు తెలుస్తోంది. చాలామంది యువకులు మొబైల్ యాప్‌లపై అవగాహన ఉన్న వారు చాలా మంది యాప్‌లతోనే ఆట ఆడటానికి ఇష్టపడుతున్నట్లు చెబుతున్నారు.
బెట్టింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు
ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పదే పదే దొరికితే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు.