మగాడిగా పుట్టడమే నేరమా?

ABN , First Publish Date - 2022-05-01T06:12:41+05:30 IST

మాడభూషి శ్రీధర్‌ ఈ నెల 24న ఇదే పేజీలో ‘పెళ్లి అంటే రేప్‌కి లైసెన్స్‌ కాదు’ శీర్షికన రాసిన వ్యాసానికి కొనసాగింపుగా ఈ అభిప్రాయాలను పంచుకుంటున్నాను...

మగాడిగా పుట్టడమే నేరమా?

మాడభూషి శ్రీధర్‌ ఈ నెల 24న ఇదే పేజీలో ‘పెళ్లి అంటే రేప్‌కి లైసెన్స్‌ కాదు’ శీర్షికన రాసిన వ్యాసానికి కొనసాగింపుగా ఈ అభిప్రాయాలను పంచుకుంటున్నాను. మారిటల్‌ రేప్‌కు సంబంధించి కర్నాటక హైకోర్టు ముందుకొచ్చిన కేసులో భర్త ప్రవర్తన అత్యంత హేయం. కన్నకూతురి ముందే లైంగిక హింసకు పాల్పడిన ఆ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాల్సిందే. చట్టాల మాట అటుంచి, సభ్యసమాజం ఈ తరహా నీచ, పెడధోరణులను ఏమాత్రం అంగీకరించదు.


ఏ చట్టమైనా ఆయా కాలాల సామాజిక పరిస్థితుల దృష్ట్యా బలహీనుల రక్షణ కోసం రూపొందుతుంది. మహిళల రక్షణ కోసం కూడా ఇలాగే పలు రకాల చట్టాలను అందుబాటులోకి తెచ్చారు. ఏ మహిళ అయినా అన్యాయానికి, హింసకు, వేధింపులకు గురైనప్పుడు చట్ట పరిధిలో కోర్టులను ఆశ్రయించి న్యాయం పొందడం వరకూ ఎవరికీ ఏ అభ్యంతరం ఉండదు. అయితే ఇటీవలి కాలంలో ఈ చట్టాలను దుర్వినియోగపరిచి, అసత్య ఆరోపణలతో భర్తను, అత్తమామలను రోడ్డుకు ఈడ్చి పగ సాధించడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు.


అమెరికా మాదిరి మన దేశంలోనూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ విడాకుల కేసులు, గృహహింస, కట్నం కేసులు బాగా పెరుగుతున్నాయి. అమెరికాలో పెళ్లి చేసుకోవడం కష్టం, విడాకులు పొందడం సులభం. మనదేశంలో పెళ్లి చేసుకోవడం సులభమే గానీ విడాకులు పొందడం మాత్రం అత్యంత కష్టంగా మారింది. అమెరికాలో పద్దెనిమిదేళ్లు దాటిన పిల్లల బాధ్యతలను తల్లిదండ్రులు భరించరు కనుక మన మాదిరి అత్తమామలను కోర్టుకు ఈడ్చే పరిస్థితి అక్కడ ఉండదు. సఖ్యత కుదరనపుడు చిన్న కారణాలపై కూడా అమెరికాలో విడాకులు మంజూరు చేస్తారు. మన దగ్గర ఒకసారి తాళి కట్టిన నేరానికి జీవితాంతం క్షోభ అనుభవిస్తూ భరించాల్సిందేననే సామాజిక భావనలు వేళ్లూనుకుని ఉన్నాయి. ప్రతి దశలోనూ కలిపి ఉంచటానికే ప్రాధాన్యం ఇస్తారు.


ఇప్పుడు మన దగ్గర కూడా విడాకులు కోరేవారి సంఖ్య పెరగడానికి సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు కారణం అనుకోవాలి.ఆడపిల్లలూ ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుంటున్నారు. సంప్రదాయ కట్టుబాట్లను తిరస్కరిస్తున్నారు. చిన్న కారణాలే వైవాహిక జీవితంలో విభేదాలకు ఆజ్యం పోస్తున్నాయి.


పెళ్లయి అత్తవారింటికి వెళ్లిన కూతురికి వెనక ఉండి తల్లి నడిపిస్తోంది. అందరూ కాకున్నా కొందరికి ఇది వర్తిస్తుంది. తల్లీ కూతుళ్ల మధ్య నిత్యం గంటలకొద్దీ ఫోను సంభాషణలు సాగుతుంటాయి. అత్తారింట్లో జరిగే ప్రతి చిన్న విషయం ఎప్పటికప్పుడు తల్లికి కూతురు చేరవేస్తుంటుంది. ఆ తల్లి రిమోట్‌ కంట్రోల్‌ను తన చేతిలో పెట్టుకుని సలహాలు, సూచనల పేరిట కూతురికి జ్ఞానబోధ చేస్తుంటుంది. సగం కాపురాలు కూలడానికి ప్రధాన కారణం ఇదే. ఇకనుంచీ అత్తిల్లే నీ పుట్టిల్లు. చిన్న సమస్యలు ఏ సంసారాల్లోనయినా ఉంటాయి. వాటిని చాకచక్యంగా పరిష్కరించుకుని నీ కాపురాన్ని చక్కదిద్దుకో అని చెప్పాల్సిన తల్లి, దానికి విరుద్ధంగా మరింతగా ఎగదోసి కలతల మంట రాజేస్తున్నది. కాపురానికంటే కెరీరే ముఖ్యం అనే ధోరణి ప్రబలడం కూడా విభేదాలకూ, విడాకులకూ దారితీస్తోంది.


‘‘నేను అమెరికాలో ఎం.ఎస్‌ చేసి తీరాల్సిందే. నాన్న చెప్పించనంటున్నాడు... అమెరికా సంబంధమే చేసుకుంటాను’’ అని భీష్మించుకున్న అమ్మాయిలూ మన మధ్యే ఉన్నారు. అలా ఏరి కోరి అమెరికా సంబంధం చేసుకుని, ఎం.ఎస్‌. పట్టా పొందాక అసలు కథ, లోటుపాట్లు పైకి తేలుతున్నాయి. చదువులు, ఉద్యోగాల్లో స్థిరపడడం వంటి కారణాలతో ఆడపిల్లలూ ముప్పై ఏళ్లు పైబడ్డాకే పెళ్లికి ఓకే చెప్తున్నారు. ఆ ఏజ్‌ గ్రూప్‌లో ఎంతో కొంతమేర రాజీపడి చేసుకున్నా అసంతృప్తులు వెంటాడుతూ కాపురంలో పరోక్షంగా చిచ్చు రేపుతున్నాయి.


‘‘అమ్మా! ఇవాళ శ్రావణ శుక్రవారం. పదింటి దాకా నిద్రపోతారా? లేచి తలస్నానం చేసి పట్టుచీర కట్టుకురా’’ అని అత్తగారు చెప్పే హితోక్తి కోడలికి కర్ణకఠోరంగా విన్పిస్తోంది. అప్పటికప్పుడు పెట్టె సర్దుకుని అలిగి పుట్టింటికి బయలుదేరుతోంది. అత్తామామలే దిగొచ్చి కాళ్లావేళ్లాపడి కోడలి ప్రయత్నాన్ని ఆపాల్సి వస్తోంది.


మహిళల రక్షణ కోసం 498–ఎ, డి.వి.సి వంటి పలు చట్టాలు ఉన్నాయి. మహిళల ప్రయోజనం కోసం మహిళా పోలీస్‌స్టేషన్లు, భరోసా కేంద్రాలు, లోక్‌ అదాలత్‌లు, స్వచ్ఛంద న్యాయ సహాయ కేంద్రాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నీ మహిళల ప్రయోజనం కోసం చేసినవే. అదే రీతిలో భార్య నుంచి న్యాయం పొందగోరే భర్తకు చట్టాలు లేవు. కొలీగ్స్‌తో, పరిచయస్థులతో ఇష్టపూర్వకంగా శారీరక సంబంధాలు నెరపి, తేడా పడినపుడు వారిపై రేప్‌ కేసులు బనాయించే అతివలూ చాలాచోట్ల కన్పిస్తున్నారు. తన వివాహేతర సంబంధం బయటపడినపుడు, తిరిగి భర్తపైనే రేప్‌ కేసు పెట్టేవారూ తయారయ్యారు.


తన మాటే నెగ్గాలన్న పంతం, గయ్యాళితనంతో భర్తను పూర్తిగా కీలుబొమ్మగా చేసుకుని అనుక్షణం అణగదొక్కేవారు కొందరు. ఇక భరించలేను బాబో! అని నిస్సహాయస్థితిలో విడాకుల కోసం కోర్టులను ఆశ్రయిస్తే ఆ భర్త మీద, అత్తమామల మీద కట్నం వేధింపులు, గృహహింస కేసులు పెడుతున్నారు. భర్త, అత్తమామలపై 498–ఎ చట్టం కింద ఫిర్యాదు చేస్తే పోలీసులు క్రిమినల్‌ కేసు రిజిస్టర్‌ చేసి కోర్టుకు లాగుతున్నారు. చేయని నేరానికి వయోవృద్ధులైన అత్తమామలు, భర్త కోర్టులో నిందితులుగా నిలబడాల్సి వస్తోంది. ఈ కేసులతో కెరీర్‌లో మంచి అవకాశాలనూ చాలామంది కోల్పోతున్నారు. ఒకప్పుడు 498–ఎ కింద ఫిర్యాదు చేయగానే అత్తమామలను వృద్ధులని కూడా చూడకుండా పోలీసులు అరెస్టు చేసేవారు. అయితే ఈ చట్టం దుర్వినియోగం అవుతున్నందున అరెస్టుల విషయంలో తొందరపడవద్దని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేయడంతో పోలీసులు దూకుడు తగ్గించారు.


తప్పెవరిది? అనే విచక్షణ లేకుండా సమాజం కూడా ఆడపిల్లల పక్షానే నిలబడి సానుభూతి చూపిస్తోంది. ‘ఏమీ లేకుంటే కేసు ఎందుకు పెడుతుంది? వీళ్లేదో వేధించే ఉంటారు’ అని బంధుమిత్రులే నిర్ధారించి తీర్పులివ్వడం పుండుమీద కారం చల్లినట్లవుతోంది. భార్యాభర్తల గొడవలను, రాజీప్రయత్నాల్లో ఏ పెద్దమనిషికో వివరిస్తే అవి చాలా చిన్న విషయాలుగా తేలిగ్గా తీసిపారేయవచ్చు. ఆ క్షోభ అనుభవించే వారికే తెలుస్తుంది. భార్య ప్రవర్తనకు సంబంధించి అన్ని సందర్భాల్లో సాక్ష్యాధారాలు చూపడమూ అసాధ్యం.


భార్యాభర్తల వివాదాలు రచ్చకెక్కి మీడియాదాకా చేరితే పరిస్థితి కుక్కలు చింపిన విస్తరే అవుతుంది. ఈ తరహా కేసుల పట్ల ప్రజలకు ఉండే ఆసక్తిని సొమ్ము చేసుకుని రేటింగ్స్‌, వ్యూస్‌ పెంచుకోవడానికి టీవీ చానల్స్‌, యూట్యూబ్‌ చానల్స్‌ పోటీపడుతున్నాయి. చర్చనంతా ఏకపక్షంగా ఒకే వైపునకు మళ్లిస్తూ, తప్పంతా భర్తదేనని నిర్ధారిస్తూ తీర్పులిచ్చి పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నారు. భర్త, అత్తమామలు నిరపరాధులుగా బయటపడినపుడు ఇదే మీడియా ఆ విషయాలను రవ్వంత పట్టించుకోదు. రేపిస్టు అనో, వరకట్న పీడితుడనో మచ్చపడితే సమాజంలో తలెత్తుకు తిరగగలరా? ఈ సంక్షోభంలో మానసిక ఒత్తిడికి తట్టుకోలేక కొంతమంది మగవారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.


ఒకసారి భార్యాభర్తల గొడవలు విడాకులు, 498–ఎ, డివిసి కేసుల దాకా వస్తే ఇక రాజీదారులున్నా శాశ్వతంగా మూసుకుపోయినట్లే. తనపైనే గాక అన్నెంపున్నెం ఎరగని వృద్ధ తల్లిదండ్రులను, అక్కచెల్లెళ్లను రచ్చకీడ్చి పరువుతీస్తూ క్షోభపెడతారా? అని మనసు విరిగిపోయి, ఇక నిండా మునిగినవాడికి చలేమిటన్నట్లు కేసును ఎంతవరకైనా తీసుకువెళ్లటానికి ఆ భర్త సిద్ధపడుతున్నాడు. 498–ఎ కింద ఫిర్యాదు దాఖలు చేయడానికి వచ్చిన మహిళలను వ్యక్తిగత స్థాయిలో పోలీసులు కూడా వారిస్తున్నారు. రాజీ మార్గాలన్నీ మూసుకుపోతాయి, కనుక ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి అని కేసుల ఒత్తిడి రీత్యా పోలీసులు హితవు చెప్తున్నా చాలామంది పెడచెవిన పెడుతున్నారు.


సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగినా పెద్దగా ఒరిగే ప్రయోజనమేదీ ఎవరికీ ఉండదు. కింది కోర్టు తీర్పుపై ఇద్దరిలో ఎవరో ఒకరు పై కోర్టులో అప్పీలుకు వెళ్లవచ్చు. చివరకు డబ్బు ముట్టజెప్పి కేసులను సెటిల్‌ చేసుకుని ‘పరస్పర/ఆమోదం’ పేరుతో విడిపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఇరు కుటుంబాల వారు ఎంతో మానసిక వేదనకు, ఇబ్బందులకు గురవుతారు. డబ్బు కూడా తగలేసుకోక తప్పదు. కారణాలు ఏమైనా కలిసి ఉండడం దుర్లభం అని తేలిపోయాక, అనవసర కాలయాపనతో జీవితాలను వృధా చేసుకోకుండా విడిపోవడం ఉభయులకూ ప్రయోజనకారి.


పెళ్లి చేసుకుని ఇన్ని బాధలు పడేకంటే సోలో బతుకే సో బెటరు అని చాలామంది కుర్రవాళ్లు ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. ఈ పరిస్థితులు, పోకడలు ఇలాగే కొనసాగితే మునుముందు సామాజికంగా తీవ్ర దుష్పరిణామాలు తలెత్తవచ్చు.


మగవాడిగా పుట్టడమే నేరమా? అని వగచే స్థాయికి ఎవరూ రాకూడదు. మగవారి పట్ల సమాజ దృష్టికోణం మారడంతో పాటు, స్త్రీ, పురుష వివక్ష లేని తటస్థ చట్టాల రూపకల్పనకు ప్రభుత్వాలు తక్షణం చర్యలు చేపట్టాలి.

గోవిందరాజు చక్రధర్‌

Updated Date - 2022-05-01T06:12:41+05:30 IST