విధ్వంసానంతర నిర్మాణం ఇదేనా?

ABN , First Publish Date - 2020-08-05T06:18:12+05:30 IST

అయోధ్యలో 1992 డిసెంబర్ 6న ఉదయం 8 గంటల నుంచే బాబ్రీ మసీదు గేట్లకు ముందు స్థలంలో హోమానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆర్‌ఎస్ఎస్ హేమాహేమీలంతా అక్కడే ఉన్నారు. ‘మేము...

విధ్వంసానంతర నిర్మాణం ఇదేనా?

బిజెపి అమ్ములపొదిలో ప్రధాన అస్త్రాలైన కశ్మీర్, అయోధ్య, పౌరసత్వ చట్టం ఇప్పటికే ప్రయోగించారు. ఉమ్మడి పౌరస్మృతి ని కూడా ఏదో ఒకనాడు వాడుకోవచ్చు కానీ, ప్రజల దైనందిన సమస్యలను పరిష్కరించేందుకు, ఆర్థిక సంక్షోభాన్ని నివారించేందుకు ఈ ఆయుధాలు ఎంత మాత్రమూ సరిపోవు. రామ మందిర నిర్మాణం పై సంతోషించినా వ్యవస్థల విధ్వంసాన్ని, రాజ్యాంగ హననాన్ని జనం హర్షించబోరని బిజెపి నేతలు అర్థం చేసుకుంటే మంచిది.


అయోధ్యలో 1992 డిసెంబర్ 6న ఉదయం 8 గంటల నుంచే బాబ్రీ మసీదు గేట్లకు ముందు స్థలంలో హోమానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆర్‌ఎస్ఎస్ హేమాహేమీలంతా అక్కడే ఉన్నారు. ‘మేము కట్టబోయే మందిరానికి శిలాన్యాస్ (భూమిపూజ) జరుగుతుంది. శిలపై దోసిళ్లతో నీరు పోసేందుకు ఒకో ప్రాంతానికి చెందిన కార్యకర్తలను వరుసగా ఆహ్వానిస్తాం’ అని ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖుడు ఒకరు చెప్పారు. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఫైజాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ ఆర్‌.ఎస్. శ్రీవాత్సవ వచ్చారు. ఆక్కడే ఉన్న పోలీసు సీనియర్ సూపరింటెండెంట్ డీబీ రాయ్‌తో మాట్లాడి వెళ్లిపోయారు. ఈ శ్రీవాత్సవే తర్వాతి కాలంలో బిజెపి ఎంపి అయ్యారు. మసీదు దరిదాపుల్లో పారా మిలటరీ బలగాలేవీ కనిపించలేదు. ఆ తర్వాత లాల్ కృష్ణ ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, ప్రమోద్ మహాజన్, కేదార్ నాథ్ సహానీ, విజయరాజే సింధియా మొదలైన అగ్రనేతలంతా వరుసగా శిలాన్యాస్ కార్యక్రమానికి వచ్చారు. ఆ తర్వాత వారు కొద్ది దూరంలో నిర్మించిన వేదికపైకి వెళ్లారు. ఇదంతా ఒక సాధారణ కార్యక్రమంలా అనిపించింది కాని ఒక చరిత్ర విధ్వంసమై, మరో చరిత్ర నిర్మాణం అయ్యే కార్యక్రమం ప్రారంభమవుతుందని అనిపించలేదు. సరిగ్గా పదిన్నర గంటల సమయంలో అసలు కార్యక్రమం ప్రారంభమైంది. వేలాది కరసేవకులు దూసుకువెళ్లడంతో బాబ్రీ మసీదు గుమ్మటాలు ఒక దాని తర్వాత మరొకటి కూలిపోతున్న దృశ్యాలను చూస్తున్నప్పుడు మరో 28 సంవత్సరాల తర్వాత ఇదే ప్రాంతంలో ఒక మందిరాన్ని నిర్మిస్తారనే ఆలోచన ఏ మాత్రం కలుగలేదు. ఆ శిథిలాలనుంచి పెద్ద ఎత్తున రేగిన దుమ్ము వినీలాకాశం నిండా దట్టమైనప్పుడు ఆ కట్టడాన్ని కూలద్రోసేందుకు ప్రేరేపించిన శక్తులే తర్వాతి కాలంలో కేంద్రంలో అధికారంలోకి రాగలవని, వాటి సారథ్యంలోనే మందిర నిర్మాణం ప్రారంభమవుతుందన్న తలంపు తట్టలేదు. ఒక విధ్వంసం లోంచే నిర్మాణం వస్తుందన్న విషయం అయోధ్య విషయంలో నూటికి నూరు శాతం రుజువైంది. భారతీయ జనతా పార్టీ కూడా విధ్వంసంలోంచే నిర్మాణమైంది. ఆ పార్టీకి చెందిన అనేకమంది నేతలు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా బాబ్రీ మసీదు శిథిలాల మధ్య నుంచి తమ భవిష్యత్తును నిర్మించుకున్నారనడంలో ఏ మాత్రం సందేహం లేదు.


ఈ నిర్మాణానికి బిజెపి పకడ్బందీగా రూపొందించుకున్న చరిత్ర ఉన్నది. అయోధ్యలోని ఒక వివాదాస్పద స్థలంపై కొన్ని దశాబ్దాలుగా కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. చాలా ఏళ్లుగా అది ఒక స్థానిక వివాదంగానే ఉండిపోయింది. ఆ ప్రాంతం రాముడు జన్మించిన నేలగా ప్రజలు విశ్వసించకపోతే అదొక సాధారణ వివాదంగానే ఉండిపోయేది. ఆ వివాదం ప్రాధాన్యతను గుర్తించి దాన్నొక సామాజిక, రాజకీయ ఉద్యమంగా మలిచి తమ రాజకీయ పార్టీని బలోపేతం చేసిన ఘనత లాల్ కృష్ణ ఆడ్వాణికి దక్కుతుంది. కాని ఆడ్వాణీకి ఆ ఘనత దక్కేందుకు, భారతీయ జనతా పార్టీ జాతీయ రాజకీయాల్లో బలోపేతమయ్యేందుకు, ఇవాళ నరేంద్రమోదీ ప్రబల శక్తిగా ఎదిగేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు కారణం కాదని చెప్పడానికి వీల్లేదు.


నిజానికి బాబ్రీ మసీదు కూలిపోవడం వల్లే కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని, బిజెపి ఎదుగుదలకు నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కారణమని ఇవాళ అనేకమంది కాంగ్రెస్ వాదులు దూషిస్తున్నారు. తమ గాంధీ కుటుంబంలో ఎవరైనా అధికారంలో ఉండి ఉంటే బాబ్రీ మసీదు కూలి ఉండేది కాదని రాహుల్ గాంధీ సైతం ఒకప్పుడు పీవీ నరసింహారావును పరోక్షంగా దూషించారు. కాని చరిత్రలో జరిగిన ఘటనలు దాచేస్తే దాగని సత్యాలు. పీవీకి ముందు ప్రధానులుగా ఉన్న రాజీవ్ గాంధీ, వీపీసింగ్లు అనుసరించిన చర్యలే దేశంలో మతపరమైన భావోద్వేగాలు రేగేందుకు కారణమయ్యాయని చెప్పక తప్పదు. 1985లో రాజీవ్ ప్రధానమంత్రి పదవి చేపట్టిన మొదటి సంవత్సరం నుంచే రామజన్మభూమి ఉద్యమం స్థిరంగా ఊపందుకోవడం ప్రారంభించింది. అప్పటికి ఉత్తర ప్రదేశ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వీరబహదూర్ సింగ్ ఉన్నారు. నాడు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలే అయోధ్య విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. 1986 జనవరి 19న లక్నోలో జరిగిన హిందూ మత నేతల సదస్సులో మార్చి 8న మహాశివరాత్రి లోపు ప్రభుత్వం స్పందించకపోతే రామజన్మ భూమి గేట్ల తాళాలు బద్దలు కొట్టి తెరవాలని తీర్మానించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. తాళాలు తెరిచేందుకు అనుమతించాల్సిందిగా ప్రభుత్వమే ఫైజాబాద్ జిల్లా కోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది.


జనవరి 28న కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. దీనిపై మరో అప్పీలును దాఖలు చేయడంతో మూడురోజుల్లోనే ఫిబ్రవరి 1న కోర్టు గేట్లు తెరిచేందుకు అనుమతించింది. ఆ ఆదేశాలను వెంటనే అమలు చేశారు. దూరదర్శన్ జాతీయ స్థాయిలో ఆ సంఘటనకు ప్రాచుర్యం కల్పించింది. కనుక ప్రభుత్వాలు తలుచుకుంటే కోర్టులు తమ అభిప్రాయాలు మార్చుకోగలవనడానికి ఆనాడే మనకు ఉదాహరణలు కనపడతాయి. నాడు శిలాన్యాస్కు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుమతించాయి. 1989 పార్లమెంటరీ ఎన్నికల్లో అయోధ్య నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించి, రామ రాజ్యాన్ని నెలకొల్పుతానని రాజీవ్ గాంధీ హామీ ఇచ్చిన విషయం చరిత్ర పుటల్లో నమోదైంది. తనకు భరణం కావాలని కోర్టుకు వెళ్లిన షాబానో అన్న ముస్లిం మహిళకు అనుకూలంగా వెలువడిన సుప్రీం తీర్పును చెల్లకుండా చేయడానికి రాజీవ్ గాంధీ 1986లో ముస్లిం మహిళల పరిరక్షణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారని, దానిపై వచ్చిన విమర్శలను ఎదుర్కోవడానికే అయోధ్య విషయంలో రాజీవ్ సానుకూలంగా వ్యవహరించారని వచ్చిన ఆరోపణలకు కాంగ్రెస్ చరిత్రకారులు ఇంతవరకు స్పష్టమైన జవాబునీయలేదు.


అటు హిందువులు, ఇటు ముస్లింల ఓట్ బ్యాంకు రెండింటినీ పొందాలని చేసిన ప్రయత్నాలే కాంగ్రెస్ పతనానికి కారణమయ్యాయన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. 1985లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో 269 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ సంఖ్యాబలం 1989లో 94 సీట్లకు, 1991లో 46 సీట్లకు ఎందుకు పడిపోయింది? 1989 నవంబర్లో జరిగిన 9వ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలై రాజీవ్ గాంధీ ఎందుకు గద్దె దిగాల్సి వచ్చింది? బోఫోర్స్ కుంభకోణంతో పాటు అయోధ్యపై ఊగిసలాట, షాబానో కేసులో లొంగుబాటు కారణాలు కావా? ఆ తర్వాత వచ్చిన వీపీ సింగ్ హయాంలోనే కదా ఆడ్వాణీ గుజరాత్లోని సోమనాథ్ నుంచి తన రథయాత్రను ప్రారంభించింది? ఆ తర్వాత జరిగిన ఘటనలు, భావోద్వేగ పరిణామాల మూలంగానే కదా ఉత్తర ప్రదేశ్లో 1991 జూలైలో బిజెపి 221 సీట్లు గెలిచి కల్యాణ్ సింగ్ అధికారంలోకి వచ్చింది? మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్లను కూడా బిజెపి గెలుచుకుంది. ఈ పరిణామాలన్నిటికీ పీవీ నరసింహారావు బాధ్యులా? బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత పీవీ ఈ నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీలను రద్దు చేసి ఎన్నికలు జరిపిస్తే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయాన్ని ఎందుకు విస్మరించారు? ఉత్తర ప్రదేశ్లో నాడు బిజెపిని సమర్థంగా అడ్డుకోగలిగిన ఎస్‌పి-–బిఎస్‌పి ఆ తర్వాతి కాలంలో అంతర్వైరుధ్యాలు, అరాచకాల వల్ల విశ్వసనీయత కోల్పోయిన విషయం నిజం కాదా?


1980లో విశ్వహిందూ పరిషత్‌ రామజన్మభూమి ఉద్యమాన్ని చేపట్టింది. దాదాపు 9 సంవత్సరాల తర్వాత పాలంపూర్‌లో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో రామజన్మభూమి అంశాన్ని ఒక రాజకీయ ఉద్యమంగా చేపట్టాలని నిర్ణయించిన తర్వాతే ఈ దేశ రాజకీయాల్లో ఒక మలుపు ప్రారంభమైంది. దానికి కాంగ్రెస్ చేయూతనిచ్చింది. అదే బీజేపి ఎదిగేందుకు కారణమైంది. ఈ దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తి అవసరమన్న అభిప్రాయానికి ప్రజలు అప్పటికే వచ్చారు. ఎమర్జెన్సీ కాలం నుంచి జరుగుతున్న పరిణామాలే అందుకు నిదర్శనం. నిజానికి ఇందిర హత్యానంతరం 1984లో బిజెపి మొదటి సారి స్వతంత్రంగా పోటీ చేసినప్పుడు 7.66 శాతం ఓట్లతో కేవలం 2 సీట్లు సాధించినప్పటికీ దాదాపు 101 స్థానాల్లో రెండవ స్థానంలో ఉన్న విషయం మరిచిపోరాదు. సానుభూతి ప్రభంజనం లేకపోతే బిజెపి ఓట్ల శాతం ఇంకా పెరిగి ఉండేది. బహుశా రాజీవ్ అయోధ్య గురించి ఆలోచించడానికి ఈ పరిణామం కారణం అయి ఉండవచ్చు. మళ్లీ ఇవే సానుభూతి పవనాలు 1991లో కూడా బిజెపిని దెబ్బతీశాయి. అప్పుడు రాజీవ్ గాంధీ హత్య వల్ల వచ్చిన సానుభూతి పవనాల మూలంగా కాంగ్రెస్‌కు 232 సీట్లు వచ్చాయి. 1989లో లోక్ సభలో 86 సీట్లు గెలుచుకున్న బిజెపి 1991 ఎన్నికల్లో 116 సీట్లు గెలుచుకున్నది. రాజీవ్ మరణించకపోతే బిజెపి అంతకంటే ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగేదని, లేకపోతే పీవీ మైనారిటీ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయడం అంత సులభమయ్యేది కాదని అంచనా వేయడానికి ఆస్కారం లేకపోలేదు.


భారత రాజకీయాల్లో బిజెపి ప్రబల శక్తిగా ఎదగడాన్ని కాంగ్రెస్ ఎందుకు అంచనా వేయలేకపోయింది? కాంగ్రెస్ మాత్రమే కాదు ఈ దేశంలో బిజెపియేతర పక్షాలన్నీ బిజెపిని అడ్డుకోవడంలో విఫలమయ్యాయి. ఇవాళ బిజెపి ఎదుగుదలను విమర్శిస్తున్నవారు, శాపనార్థాలు పెడుతున్నవారు కనీసం ప్రతిపక్ష స్థాయికి కూడా ఎదగలేకపోయారు. ప్రజలను చైతన్యం చేయలేకపోయిన తమ భావదారిద్ర్యం, తప్పిదాల గురించి ఆత్మ విమర్శ కూడా చేసుకోలేకపోతున్నారు. 2014లో బిజెపి అధికారంలోకి రావడానికి రామజన్మభూమి ఉద్యమం ఏ మాత్రం కారణం కాదు. అప్పటికే ఆ ఉద్యమానికి అతీతమైన రాజకీయ శక్తిని బిజెపి సంపాదించింది. మోదీ అప్పుడు ఎన్నికల్లో అయోధ్య గురించి మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పూర్తి ఘనత తనకు మాత్రమే ఆపాదించేలా ఆయన చేసుకోగలిగారు. ఒకప్పుడు రాజకీయ అవసరం కానిది ఇప్పుడు అవసరం అని ఆయన భావిస్తుండవచ్చు. బిజెపి అమ్ములపొదిలో ప్రధాన అస్త్రాలైన కశ్మీర్, అయోధ్య, పౌరసత్వ చట్టం వంటివి ఇప్పటికే ప్రయోగించారు. ఇక ఉమ్మడి పౌరస్మృతిని కూడా ఏదో ఒకనాడు వాడుకోవచ్చు. కాని ప్రజల దైనందిన సమస్యలను, నిరుద్యోగాన్నీ, ఆర్థిక సంక్షోభాన్ని, అనారోగ్యాన్నీ నివారించేందుకు ఈ ఆయుధాలు ఎంత మాత్రమూ సరిపోవు. తమ ఎజెండా అమలుతోనే పబ్బం గడుపుకోలేమని, మందిర నిర్మాణంపై సంతోషించినా వ్యవస్థల విధ్వంసాన్ని, రాజ్యాంగ హననాన్ని జనం హర్షించబోరని బిజెపి నేతలు అర్థం చేసుకుంటే మంచిది.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2020-08-05T06:18:12+05:30 IST