అదనంగా ఉచిత బియ్యం పంపిణీ ఉత్తదేనా?

ABN , First Publish Date - 2021-05-09T04:56:42+05:30 IST

కరోనా వైరస్‌ నేపథ్యంలో తెల్ల రేషన్‌ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బియ్యం అల్లాదుర్గం మండలంలో పంపిణీ చేయడం లేదు. దీంతో వినియోగదారులు రేషన్‌ డీలర్లను నిలదీయంతో వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి.

అదనంగా ఉచిత బియ్యం పంపిణీ ఉత్తదేనా?

 బియ్యం విడుదల చేయని కేంద్రం

 పాతవిధానంలో పంపిణీ

 రేషన్‌ డీలర్లను నిలదీస్తున్న వినియోగదారులు


 అల్లాదుర్గం, మే 8: కరోనా వైరస్‌ నేపథ్యంలో తెల్ల రేషన్‌ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బియ్యం అల్లాదుర్గం మండలంలో పంపిణీ చేయడం లేదు. దీంతో వినియోగదారులు రేషన్‌ డీలర్లను నిలదీయంతో వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. మే నెలకు సంబంధించి మండలంలోని 28 మంది రేషన్‌ డీలర్లు ఏప్రిల్‌ నెలలోనే డీడీలు చెల్లించారు. ఈ డీడీలకు సంబంధించి బియ్యం విడుదల కాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అదనపు బియ్యం విడుదల కాలేదు. దీంతో డీలర్లు పాత పద్ధతిలోనే ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున రూపాయి కిలో బియ్యం మూడురోజులుగా పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రతీ ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం మే నెల నుంచి అందిస్తామన్న ఐదు కిలోల ఉచిత బియ్యం అందకపోవడంతో వినియోగదారులు నిరాశ చెందుతున్నారు. మండలంలో 8 వేల 740 తెల్ల రేషన్‌ కార్డులు ఉన్నాయి. వాటి ప్రకారం ప్రతీ నెల 180 మెట్రిక్‌ టన్నుల బియ్యం ప్రభుత్వం విడుదల చేస్తుంది. మే నెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అదనంగా అందిస్తామన్న బియ్యం విడుదల కాకపోవడంతో పాతవిధానంలోనే డీలర్లు పంపిణీ చేస్తున్నారు. బియ్యం విడుదలకాని విషయం తెలియని వినియోగదారులు డీలర్లను నిలదీయడంతో వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. బియ్యం విడుదల కాలేదని డీలర్లు వినియోగదారులకు వివరణ ఇచ్చుకోలేక తంటాలు పడుతున్నారు. కేంద్రం ఒకేసారి బియ్యం విడుదల చేస్తే బాగుంటుందని డీలర్లు కోరుతున్నారు.


Updated Date - 2021-05-09T04:56:42+05:30 IST