ఆటాడుకోవడం అల్లాటప్పానా..?

ABN , First Publish Date - 2022-09-11T09:36:38+05:30 IST

స్పోర్ట్స్‌ డ్రామా... సినిమాకు ఇదో ముడి సరుకు. హీరోయిజం, దేశభక్తి, వాణిజ్య అంశాలు, భావోద్వేగాలూ..

ఆటాడుకోవడం అల్లాటప్పానా..?

స్పోర్ట్స్‌ డ్రామా... సినిమాకు ఇదో ముడి సరుకు. హీరోయిజం, దేశభక్తి, వాణిజ్య అంశాలు, భావోద్వేగాలూ... ఇందులో లేనిదంటూ ఏదీ లేదు. అన్నీ కలిపిన కంప్లీట్‌ ప్యాకేజీ. అందుకే స్పోర్ట్స్‌ డ్రామాలు వెల్లివిరుస్తున్నాయి. వాటిలో విజయాల శాతం కూడా ఎక్కువగానే ఉండడంతో.. వెండి తెరపై ఆటలు సాగాయి. ఇప్పటికీ ఏదో ఓ చిత్రసీమలో స్పోర్ట్స్‌ డ్రామా తయారవుతూనే ఉంది. అయితే గత కొంతకాలంగా గమనిస్తే... ఈ జోనర్‌లో విజయాల శాతం తగ్గుతూ వస్తోంది. బడా స్టార్లు చేసిన క్రీడా నేపథ్య చిత్రాలు బాక్సాఫీసు దగ్గర ఘోరంగా బోల్తా కొడుతున్నాయి. అంటే.. స్పోర్ట్స్‌ డ్రామాలపై ప్రేక్షకులకు ఆసక్తి తగ్గుతున్నట్టా..? లేదంటే మనవాళ్లకే ఈ జోనర్‌ తీయడం రావడం లేదా..? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తింది.


హీరో ఓ అనామకుడు. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఓ ఆటపై దృష్టి పెడతాడు. ప్రావీణ్యం సంపాదిస్తాడు. తనకు ఓ మంచి కోచ్‌ దొరుకుతాడు. ఆ కోచ్‌.. హీరోలోని ప్రతిభని సానబెడతాడు. ఆ తరవాత... ఆ హీరో ఒకొక్క దశను దాటి.. ఇంటర్నేషనల్‌ స్టార్‌ అయిపోతాడు. అంతే కథ. ఏ స్పోర్ట్స్‌ డ్రామా తీసుకొన్నా అచ్చం ఇలానో, దీనికి కాస్త అటూ ఇటుగానో ఉంటుంది. ఆటలు మారినా ఎమోషన్‌ మాత్రం ఇదే. ఈమధ్య వచ్చిన ‘లైగర్‌’లోనూ ఇదే స్టోరీ. ఒకప్పుడు ఇవే కథలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఇప్పుడు తీస్తే జనాలు తిరస్కరిస్తున్నారు. చూసిన కథ చూడ్డానికి ఎవ్వరూ ఒప్పుకోరు. వాళ్లకేదో కొత్త తరహా ఎమోషన్‌ కావాలి. అది పట్టుకొంటే తప్ప సక్సెస్‌ కొట్టలేం.

షారుఖ్‌ఖాన్‌ ‘చెక్‌ దే ఇండియా’లో కొత్తరకమైన ఎమోషన్‌ పట్టాడు దర్శకుడు. అందులో హీరో కోచ్‌. అమ్మాయిలతో హాకీ ఆడిస్తాడు. అండర్‌ డాగ్‌ లాంటి టీమ్‌ని... ప్రపంచ కప్‌ విజేతగా మారుస్తాడు. ఈ కథలో కావల్సినంత హీరోయిజం ఉంది. ఎమోషన్‌ ఉంది. షారుఖ్‌ని కొత్తగా చూసే అవకాశం దక్కింది. అన్నింటికంటే ముఖ్యంగా హాకీ టీమ్‌లో ప్రతీ అమ్మాయికీ ఈకథలో ప్రాధాన్యం ఉంది. అందుకే ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. ‘దంగల్‌’ సక్సెస్‌ సీక్రెట్‌ కూడా అదే. అందులో అమీర్‌ ఖాన్‌ ఓ సాధారమైన తండ్రిగా కనిపిస్తాడు. కుమార్తెలను విజేతలుగా చూడ్డానికి ఓ తండ్రి పడే కష్టం తెరపై కనిపిస్తుంది. అందుకే మనకేమాత్రం టచ్‌లో లేని కుస్తీ ఆటతో సినిమా తీసి, ఇండియా మొత్తం గర్వంచే  ఓ సూపర్‌ హిట్‌ కొట్టాడు అమీర్‌ఖాన్‌.


ఈ దేశంలో క్రికెట్‌ అంటే ఇష్టపడనివాళ్లు ఎవరుంటారు? క్రికెట్‌ నేపథ్యంలో కథ అల్లుకొంటే హిట్టే అని నమ్మేవారంతా. కానీ ‘83’ ఏమైంది..? భారత క్రికెట్‌ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టాన్ని ‘83’ పేరుతో సినిమాగా తీస్తే.. డిజాస్టర్‌గా మారిపోయింది. అందులో స్టార్లు లేరా అంటే.. బోలెడంతమంది ఉన్నారు. భారీగా ఖర్చు పెట్టారు. కనీ వినీ ఎరుగని ప్రమోషన్‌ చేశారు. కానీ ఏం లాభం..? ఎమోషన్లని సరిగా పట్టుకోకపోవడంతో.. సినిమా బోల్తా కొట్టింది. ‘శభాష్‌ మిథాలీ’, ‘కౌశల్య కృష్ణమూర్తి’ సినిమా విషయాల్లోనూ ఇదే జరిగింది. 


ఆ తరవాత అందరి దృష్టీ బాక్సింగ్‌పై సాగింది. బాక్సింగ్‌ నేపథ్యంలో వచ్చినన్ని కథలు మరో ఆటలో రాలేదేమో..? అందులోనూ విజయాల శాతం చాలా తక్కువ. ఒకట్రెండు హిట్లు తప్ప.. బాక్సింగ్‌ రింగ్‌లో మనం సాధించిందేం లేదు. తెలుగులో వచ్చిన ‘గని’, ‘లైగర్‌’ కూడా బాక్సింగ్‌ కథలే. అవి పేలవమైన స్ర్కిప్టులుగా మిగిలిపోయాయి. ఓరకంగా ‘తమ్ముడు’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ కూడా ఈ తరహా కథలే. అయితే వాటిలో ఆటనీ, ఎమోషన్‌నీ సరిగ్గా మిక్స్‌ చేశారు. ‘తమ్ముడు’ సినిమా  చూడండి. ఆట కేవలం ఎప్పుడు అవసరమైతే అప్పుడే వచ్చింది. మిగిలిన సినిమా అంతా.. పవన్‌ శైలిలోనే సరదాగా సాగిపోతుంది. ‘అమ్మా..నాన్న..’ కూడా అంతే. అందులో తల్లీ కొడుకుల ఎమోషన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. హీరో గెలవాలి అనుకొన్నప్పుడే.. బాక్సింగ్‌ రింగ్‌లోకి దింపారు. అందుకే ఈ రెండు సినిమాలూ హిట్లు కొట్టాయి.‘ఒక్కడు’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘జెర్సీ’ ఇవన్నీ ఆటనీ, ఎమోషన్‌నీ పర్‌ఫెక్ట్‌గా మిక్స్‌ చేసిన సినిమాలే. అప్పుడెప్పుడో వచ్చిన ‘విజేత’ కూడా స్పోర్ట్స్‌ డ్రామాగానే చెప్పుకోవాలేమో..? హీరో (చిరంజీవి)కి ఫుట్‌ బాల్‌ అంటే ఇష్టం. ఆ ఆటలో ఛాంపియన్‌ కావాలనుకుంటాడు. కానీ... కుటుంబం కోసం తన ఆటని త్యాగం చేస్తాడు. కాకపోతే.. సెంటిమెంట్‌ డోసు ఎక్కువ అవ్వడంతో.. ఆట పక్కకు వెళ్లిపోయింది. 


స్పోర్ట్స్‌ డ్రామాలంటే హీరోలంతా ఆసక్తి చూపించడానికి ఓ బలమైన కారణం ఉంది. అది.. మేకొవర్‌. ఆ పాత్రకు తగ్గట్టుగా బాడీని మార్చుకొంటారు. సిక్స్‌ ప్యాకో, ఎయిట్‌ ప్యాకో చూపిస్తారు. తెరమీద తమ కండల్ని చూపించడానికి ఓ ఛాన్స్‌ దొరుకుతుంది. కొత్త తరహా స్టైలింగ్‌ కి ఆస్కారం కుదురుతుంది. ‘లక్ష్య’లో నాగశౌర్య మేకొవర్‌ అదిరిపోతుంది. తన బాడీ చూసి అంతా షాక్‌ తిన్నారు. కానీ ఏం లాభం..? ఆ సినిమా సరిగా ఆడలేదు. ఈ తరహా కథలకు మరో ప్రధానమైన అడ్డంకి.. బడ్జెట్‌. టెక్నికల్‌గా బాగా ఖర్చు పెట్టొచ్చు అనుకున్నప్పుడే క్రీడా నేపథ్యాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే...  లైటింగ్‌, కెమెరా వర్క్‌ విషయాల్లో కచ్చితంగా క్వాలిటీ చూపించాలి. లేదంటే ఆ సన్నివేశాలు తేలిపోతాయి.   కంటెంట్‌ బాగున్నా, సరైన క్వాలిటీ లేకపోవడంతో దెబ్బకొట్టిన సినిమాలున్నాయి. పైగా ఓటీటీలు అందుబాటులో రావడంతో ప్రపంచ స్థాయి స్పోర్ట్స్‌ డ్రామా సినిమాల్ని చూసేశారు జనాలు. మన కథలు, మన సాంకేతికత వాళ్ల కళ్లకు ఆనడం లేదు. ప్రేక్షకులకు పరిచయం లేని ఆటల్ని ఎంచుకొని.. కథలుగా మలచడం కూడా రిస్కే. జనబాహుళ్యంలో ఉన్న ఆటలకు ఉన్న క్రేజ్‌.. మిగిలినవాటికి ఉండదన్న విషయం రూపకర్తలు గుర్తుంచుకోవాలి. కథలో వైవిధ్యం, బలమైన ఎమోషన్‌ లేకపోతే.. ఎంత పెద్ద స్పోర్ట్స్‌డ్రామా సినిమా అయినా ప్రేక్షకులు తిరస్కరిస్తారు. అందుకు ‘లైగర్‌’ ఓ తాజా ఉదాహరణ.

Updated Date - 2022-09-11T09:36:38+05:30 IST