Advertisement

షర్మిల పార్టీతో రాష్ట్రానికి మేలు జరిగేనా?

Feb 23 2021 @ 00:52AM

ఇద్దరూ వైయస్ రాజశేఖర‌ రెడ్డి బిడ్డలు. ఇద్దరూ రాజన్న రాజ్యమే లక్ష్యమంటున్నారు. జగన్ ఆంధ్రా ముఖ్యమంత్రిగా రాజన్నరాజ్యాన్ని ప్రజలకు రుచి చూపిస్తున్నారు. షర్మిలమ్మ తెలంగాణలో తానూ రాజన్నరాజ్యం తెస్తానని సిద్ధమవుతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మూలాలు గల ఈ ఇద్దరు నేతలు రెండు తెలుగు రాష్ట్రాల్లో విభజన గాయాలు ఇంకా మానని నేపథ్యంలో వేర్వేరుగా సఖ్యతగా రాజకీయాలు నిర్వహించడం సాధ్యమేనా? 


రేపు తెలంగాణలో షర్మిలమ్మ పార్టీ పెడితే ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ఎంతవరకైనా తెగించవలసి ఉంటుంది. లేకుంటే ఆమెకే కాదు- ఏ పార్టీకైనా ఉనికి ఉండదు. ఇక్కడే అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయ స్పర్థలు మొదలు కానున్నాయి. ఒక వేళ ఇద్దరూ సంయమనం పాటించినా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర పార్టీలు వారిని రెక్కబట్టి ముగ్గులోకి లాగక తప్పవు. షర్మిలమ్మ పార్టీ పెట్టేందుకు సన్నాహాలు మొదలుపెట్టగానే ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ జగనన్న వదిలిన బాణం కాదని, కేసీఆర్ వదిలిన బాణమని వ్యాఖ్యానాలు చేశారు. షర్మిలమ్మ పార్టీ పెడితే తమకు చెందిన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయని అంతిమంగా కేసీఆర్ లాభపడతారనే భయాలతో బీజేపీ, కాంగ్రెస్ నేతలు షర్మిలమ్మపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కేసీఆర్‌కు లాభం చేకూర్చేందుకు జగన్ ప్రోద్బలంతోనే షర్మిలమ్మ పార్టీ పెడుతున్నారని వాదించేవారు కూడా లేకపోలేదు. మరి ముఖ్యమంత్రి జగన్ ఎందుకు బెంబేలెత్తుతున్నారో వీరి నుంచి సమాధానం లేదు. ఏదేమైనా షర్మిలమ్మ పార్టీపై సాగుతున్న చర్చలను గమనిస్తుంటే ఏనుగు, ఏడుగురు గుడ్డివాళ్ల కథ గుర్తుకొస్తోంది. 


రేపు షర్మిలమ్మ పార్టీ పెడితే తెలంగాణలో ఎన్నికల సందర్భంగా ఎవరెవరికి ఏమేరకు నష్టం జరుగుతుందో ఏమోగానీ, ఈలోపే జగన్, షర్మిలమ్మ ఇరువురూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజన్నరాజ్యం ఏర్పాటు చేయబోయి అంతిమంగా వైఎస్ ప్రాభవాన్ని మసకబారేట్టు చేస్తారేమో! ఉమ్మడి రాష్ట్రంలోనూ, నవ్యాంధ్రప్రదేశ్‍లోనూ వైఎస్ కీర్తి ప్రతిష్టలు ఏమేరకు ఉన్నాయో పక్కన బెడితే, రాయలసీమ జిల్లాల్లో వైఎస్ ప్రాభవం ఇప్పటికీ బలీయంగా ఉంది. ఆయన సజీవంగా ఉండివుంటే రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ పట్టేదని ఎక్కువమంది భావిస్తున్నారు. ఫలితంగానే మొన్నటి ఎన్నికల్లో వైకాపాకు ఏకపక్షంగా విజయం చేకూర్చారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన నాటి సమస్యలు పరిష్కారం కాలేదు. ప్రధానంగా సాగునీటి రంగంలో తెలంగాణతో ఏర్పడిన వివాదంలో రాష్ట్రంలో ఇతర ప్రాంతాల కన్నా రాయలసీమ ఎక్కువ నష్టపోతోంది. తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలతో సీమ ప్రజల చిరకాల వాంఛితమైన సిద్దేశ్వరం అలుగు, గుండ్రేవుల రిజర్వాయర్, పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులు ముందుకు సాగడం లేదు. అదే సమయంలో తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు–రంగారెడ్డి - దిండి, మరికొన్ని పథకాల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది.


ఈ పరిస్థితుల్లో షర్మిలమ్మ ఈ అంశంలో ఏపీ వ్యతిరేక వైఖరి తీసుకోకుండా రాజకీయం చేయగలుగుతుందా? ఒకవేళ షర్మిలమ్మ తెలంగాణ ప్రజల ప్రయోజనాల పక్షాన గళం విప్పితే వైఎస్ రాజశేఖర రెడ్డి పరపతి ఏంకాను? రాయలసీమవాసులకు జగన్ ఏమని సమాధానం చెబుతారు? పోలవరం 150 అడుగుల ఎత్తున నిర్మాణం జరిగితే భద్రాచలం మునిగిపోతుందని టీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్, బీజేపీ, అన్ని పార్టీల నేతలు గోల చేస్తున్నారు. ఈ ఒత్తిడిని షర్మిలమ్మ ఏమేరకు తట్టుకోగలదు? వారితో గొంతు కలిపితే ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు ఏమని సమాధానం చెబుతారు? ఇవన్నీ శేషప్రశ్నలే. ఒకవేళ వివాదాంశాల్లో షర్మిలమ్మ మౌనం పాటిస్తే- అప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలే గాక, అసలుకే మోసం వస్తే సెంటిమెంటు రాజకీయాలతో నెట్టుకువస్తున్న కేసీఆర్ షర్మిలమ్మను ఏపీకి వ్యతిరేకంగా ముగ్గులోకి లాగకుండా ఉంటారా? ఇదే జరిగితే ఏపీలోనూ ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి జగన్‌కు పొగబెట్టకుండా ఉంటాయా? ఈ పరిణామాలను వైఎస్ అభిమానులు ఏమేరకు జీర్ణించుకోగలరు? ఇవన్నీ షర్మిలమ్మ బృందం ఆలోచించి ఉండదని భావించలేము. అందుకేనేమో! జగన్ నాకు తోడబుట్టిన అన్న. ఆయన ఆశీస్సులు ‘ఉన్నాయనే నమ్ముతున్నాను’ అని షర్మిల చెప్పారు. లేకపోతే ‘ఉన్నాయని’ చెప్పేవారేమో! 

వి. శంకరయ్య

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.