శిక్షణకు హాజరు ఇలాగేనా?

ABN , First Publish Date - 2021-07-24T05:02:44+05:30 IST

జిల్లాలో నిర్వహిస్తున్న సర్పంచుల శిక్షణ తరగతులకు కొందరు హాజరవుతున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.

శిక్షణకు హాజరు ఇలాగేనా?
బొండపల్లి మండలం నుంచి హాజరైన సర్పంచుల్లో సాయంత్రానికి 14మందే మిగిలిన పరిస్థితి..

  కొందరు  సర్పంచ్‌ల తీరుపై విమర్శల వెల్లువ  

 మధ్యాహ్నం తర్వాత  ఇళ్లకు వెళ్తున్న వైనం

విజయనగరం ఆంధ్రజ్యోతి: జిల్లాలో నిర్వహిస్తున్న సర్పంచుల శిక్షణ తరగతులకు  కొందరు హాజరవుతున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. నిష్ణాతులైన వారితో శిక్షణ ఇప్పిస్తున్నా... వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నా.. అనేకమంది సద్వినియోగం చేసుకోవడం లేదు.  వసతులు పక్కన పెట్టేసి అత్యధికులు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా 954  పంచాయతీల్లోని సర్పంచులకు దశల వారీగా రెండు పూటలా శిక్షణకు షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు భోజన వసతి సదుపాయాలను ఆయా ప్రాంగణాల్లోనే ఏర్పాట్లు చేశారు.  మహిళలకు, పురుషులకు వేర్వేరుగా రూములు కేటాయించారు.  అయితే కొంత మంది ఇతర జిల్లాలకు శిక్షణకు వెళ్లిన వారు మినహా మిగిలిన వారు మాత్రం ఉదయం సెక్షన్‌కు పూర్తిస్థాయి లోనే హాజరువుతున్నారు. కాగా వారిలో అనేక మంది మధ్యాహ్నం నుంచి శిక్షణకు ఉండడం లేదు. మధ్యాహ్న భోజనం తరువాత విజయనగరం మార్కెట్‌కు కొంతమంది, ఇంకొంత మంది ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో మధ్యాహ్నం తరువాత శిక్షణకు సర్పంచుల హాజరు పలుచబడుతోంది. మొదటి సెషన్‌ ప్రారంభంలో మూడు మండలాల సర్పం చులను ఒకే చోట కూర్చో పెడుతున్నారు. తరువాత ఒక్కో మండలానికి ఒక్కో రూము కేటాయించి శిక్షణ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కరోనా కార ణంగా దూరంగా కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.  జేఎన్‌టీయూ శిక్షణ తరగతులకు గజపతినగరం, గంట్యాడ, బొండపల్లికి చెందిన సర్పంచులు హాజరయ్యారు. పార్వతీపురం డివిజన్‌కు సంబంధించి పార్వతీపురం, సీతానగరం, కొమరాడ  సర్పంచులకు శిక్షణను రెండో రోజున అందించారు. 

  గంట్యాడ మండలంలో 35 గ్రామ పంచాయతీలున్నాయి. వీరికి శుక్రవారం శిక్షణ తరగతులను విజయనగరం జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఉదయం సెక్షన్‌కు ముగ్గురు నలుగురు మినహా అంతా హాజరయ్యారు. మధ్యాహ్నం 3గంటల ప్రాంతానికి 27 మంది మాత్రమే మిగిలారు.   గజపతినగరం మండలంలో 30 గ్రామ పంచాయ తీలున్నాయి. ఇందులో కొంత మంది ఇతర జిల్లాలకు శిక్షణకు వెళ్లారు. ఇద్దరు మగ్గురు మినహా మిగిలిన వారు ఉదయం జరిగే శిక్షణ తరగతులకు హాజరయ్యారు. సాయంత్రానికి మాత్రం 18మంది మాత్రమే ఉన్నారు.  ఫ బొండపల్లి మండలంలో 28  పంచాయతీలున్నాయి. విజయనగరానికి సమీ పంలో ఉన్న కారణంగా ఉదయం హాజరు ఇంచుమించు పూర్తి స్థాయిలోనే వచ్చినట్లు అధికారులు నమోదు చేశారు. కానీ మధ్యాహ్నం 3గంటల ప్రాం తానికి 14 మంది మాత్రమే మిగిలారు. ఇలా ఉదయం హాజరుకు సాయం త్రానికి భారీగా హాజరు పడిపోతోంది.   గంట్యాడ, బొండపల్లి మండలాలు పట్టణాన్ని ఆనుకుని ఉన్న కారణంగా అనేక మంది ఇళ్లకు వెళ్లి వస్తున్నారు.   

 ప్రజా సేవతోనే సంతృప్తి

గరుగుబిల్లి: ప్రజలకు మెరుగైన సేవలందించడంలోనేసంతృప్తి ఉంటుందని జేసీలు మహేష్‌కుమార్‌, మయూర్‌ అశోక్‌ తెలిపారు.  శుక్ర వారం ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలలో సర్పంచ్‌లకు నిర్వహిస్తున్న రెండో రోజు శిక్షణ  కార్యక్రమానికి వీరు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ... ప్రజలు అందించిన అవకాశాన్ని సర్పంచ్‌లు వినియోగించుకోవాలన్నారు. పంచాయతీల పరిధిలో పరిపాలన కొనసాగించేందుకు శిక్షణ సామర్థ్యాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అర్హులకుప్రభుత్వ పథకాలు అందించాలని సూచించారు. పంచాయతీల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పారిశుధ్యం మెరుగు, ఇంటి పన్నుల వసూళ్లపై శ్రద్ధ చూపాలని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలతో గ్రామాభివృద్ధికి కృషి చేయాలని జడ్పీ సీఈవో టి.వెంకటేశ్వరరావు సూచించారు. మొదటి విడతలో శిక్షణ పొందిన పార్వతీ పురం, సీతానగరం, కొమరాడకు చెందిన సర్పంచ్‌లకు శనివారం ధ్రువప త్రాలను అందిస్తామన్నారు. పార్వతీపురం డివిజనల్‌ అభివృద్ధి అధికారి కె.రాజ్‌ కుమార్‌, ఎంపీడీవోలు గోపాలకృష్ణ, కృష్ణారావు, రామకృష్ణ, ఈవోపీఆర్‌డీ  గోపాలరావు, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో రవికుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

ప్రకృతి సాగుపై అవగాహన  

ప్రకృతి సాగుపై గ్రామస్థాయిలో సర్పంచ్‌లు అవగాహన పెంపొందిం చాలని తోటపల్లి జట్టు ట్రస్టు వ్యవస్థాపకులు డాక్టర్‌ డి.పారినాయుడు సూచిం చారు.  శిక్షణలో భాగంగా తోటపల్లి ఆదిదేవో భవన ప్రాంగణంలో పలు రకాల పంటలతో పాటు అనుబంధ రంగాలపై అవగాహన కల్పించారు.  యంత్ర పరికరాల వినియోగంతో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందొచ్చని తెలిపారు.  రైతులను చైతన్యపర్చి ఆరోగ్యకరమైన పంటలు సాగు చేసేలా దృష్టి సారించాలని సూచించారు. ఈ పరిశీలనలో ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ ఎం.నూకంనాయుడు తదితరులు పాల్గొన్నారు.


 

 

Updated Date - 2021-07-24T05:02:44+05:30 IST