Advertisement

జాతీయ భద్రత ఇలాగేనా?

Jan 23 2021 @ 00:51AM

పుల్వామా దాడికి భారత సైన్యం తప్పక బదులు తీర్చుకుంటుందని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే ఉద్దేశిత ప్రతీకార దాడిని అభివర్ణించేందుకు ‘ఉపయోగించిన కచ్చితమైన మాటల’ను ఎవరూ ఊహించలేరు. అత్యంత సున్నితమైన, రక్షిత సమాచారాన్ని ఎవరో ఒక వ్యక్తి ఇతరులతో పంచుకున్నారనేది స్పష్టం. ఎవరా వ్యక్తి?


టీవీచానెల్ పేరు అవసరం లేదు. జర్నలిస్టు పేరూ అప్రస్తుతం. మరికొన్ని ఇతర విషయాలలో సదరు చానెల్‌పై ఉన్న ఆరోపణల కథా కమామిషు కూడా ప్రస్తుత కాలమ్‌కు ఉపయుక్తమైనది కాదు. విధాన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ, జాతీయ భద్రతకు సంబంధించి ప్రభుత్వ అత్యున్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు మాత్రమే ప్రస్తుతం ప్రాసంగికత ఉన్న విషయాలు. 


ఏ ఒక్కరిపైన నింద మోపడం ఈ కాలమ్ లక్ష్యం కాదు. ఎవరి పైన నేను ఆరోపణలు చేయదలుచుకోలేదు. అయితే ఎటువంటి తడబాటు లేకుండా, సూటిగా, స్పష్టంగా ఒక ప్రశ్న అడగడమే నా లక్ష్యం. ఇదిగో ఆ ప్రశ్న: సున్నితమైన, రక్షిత నిర్ణయాలను విధాన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో భాగం కాని వారితో పంచుకోవడం జరిగిందా? ఒక అనుబంధ ప్రశ్న: ఆ నిర్ణయాలలో కొన్ని ‘అధికారిక రహస్యాలు’ కిందకు వస్తాయా? 


అసలు ఆ విషయాలు బయటకు పొక్కిన తీరు విస్మయకరంగా ఉంది. వాటిని వాట్సాప్ ‘చాట్స్’గా పేర్కొంటున్నారు. మరి వాట్సాప్లో సంభాషణలు అన్నీ సంపూర్ణంగా సంకేత భాషలో నిక్షిప్తమయి ఉంటాయని, ఎవరికీ అవి అందుబాటులో ఉండవని ఆ యాప్‌ యజమానులు చెబుతున్నారు. ప్రస్తావిత సంభాషణల రికార్డు తమ వద్ద లేదని, అసలు ఏ సంభాషణల రికార్డును తాము ఏ ఒక్కరితోనూ పంచుకోమని కూడా వాట్సాప్ యజమానులు స్పష్టం చేస్తున్నారు. వారి వాదనలు ఏ మేరకు వాస్తవమో నాకు తెలియదు. కానీ, వాటి విషయమై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అవి క్రమంగా పెరుగుతున్నాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణలను హ్యాక్ చేయడం జరిగిందా? ఈ ప్రశ్నకూ నాకు సమాధానం తెలియదు. అటువంటి సంభాషణలను దొంగచాటుగా వినవచ్చని, వాటి రికార్డును హ్యాక్ చేయవచ్చని అంటున్నారు. ప్రస్తావిత సంభాషణల విషయంలో కూడా అదే జరిగిందనే గట్టి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏమైనా ఈ వ్యవహారం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ యజమాని, ప్రపంచ సంపన్నుడుగా సువిఖ్యాతుడయిన మార్క్ జుకర్‌బెర్గ్‌కు ప్రతిష్ఠాకరమైనది కాదు. ఆయన వ్యాపార ప్రయోజనాలకు మేలు చేసేదీ కాదు. 


సరే, అదలా ఉంచండి. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణలు బహిర్గతమయ్యాయి. నాకు తెలిసినంతవరకు ప్రింట్ మీడియా, సామాజిక మాధ్యమాలలోనూ బహిర్గతమైన ఆ సమాచారాన్ని సంబంధిత ఇరువురు వ్యక్తులు ఖండించలేదు. తమ మధ్య అటువంటి సంభాషణలు జరిగిన విషయాన్ని వారు నిరాకరించలేదు. నిరాకరించి ఉన్నట్టయితే ఈ కాలమ్‌కు సంబంధించినంతవరకు ఆ వ్యవహారం ఒక ముగిసిన విషయమే. ఖండించలేదు కనుక సహజంగానే కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 


2019 ఫిబ్రవరి 14న పుల్వామా వద్ద భారత సైనికదళాల వాహనశ్రేణిపై దాడి జరిగింది. ఫిబ్రవరి 23న ‘జర్నలిస్టు’, ‘మరొక వ్యక్తి’ మధ్య ఇలా సంభాషణ జరిగింది: సమయం -రాత్రి 10.30 గంటలు: జర్నలిస్ట్: ఒక బృహత్తర సంఘటన సంభవించబోతున్నది. 10.33 గంటలు: మరో వ్యక్తి’: మీరు అంటున్నదేదో జరిగితీరుతుందని నేను విశ్వసిస్తున్నాను. మీరు సఫలమవ్వాలని కోరుకుంటున్నాను.. 10.34 గంటలకు అదే వ్యక్తి ఇలా అన్నాడు: మీ విజయానికి.... 10.36 గంటలు: కాదండి. పాకిస్థాన్. ఈ సారి ఒక మహా పెద్ద పరిణామం చోటు చేసుకోనున్నది. 10.37 గంటలు: మరో వ్యక్తి: ఈ తరుణంలో దానితో ఆ పెద్దాయనకు చాలా మేలు జరుగుతుంది. దాడి మాత్రమేనా? లేక ఇంకా పెద్ద వ్యవహారమా?... 10.40 జర్నలిస్ట్: సాధారణ దాడి కంటే చాలా పెద్దది. అదే సమయంలో కశ్మీర్‌లో కూడా ఒక పెద్ద ఘటన వాటిల్లనున్నది. పాకిస్థాన్‌పై జరిగే దాడి ప్రజలకు అమిత సంతృప్తి కలిగించగలదని ప్రభుత్వం పరిపూర్ణ నమ్మకంతో ఉన్నది. 


పుల్వామా వద్ద సైనిక వాహనశ్రేణిపై జరిగిన దాడి ఒక భీకర ఉగ్రవాద ఘటన. నలభై మంది సైనికులు చనిపోయారు. అది భారత సైనికదళాలను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేసింది. పాకిస్థాన్ ప్రేరిత వ్యక్తి పుల్వామా ఉగ్రవాద దాడికి బాధ్యుడని మన సైనికవర్గాలు భావించాయి. ఆ ఉగ్రవాదికి పాకిస్థాన్‌లో శిక్షణ ఇచ్చారనేది కూడా స్పష్టం. పుల్వామా ఘాతుకానికి ప్రతీకార చర్య జరిగి తీరుతుందని కూడా మనదేశంలో చాలా మంది ఊహించారు. సామాన్య ప్రజలు కూడా అటువంటి ఘటన కోసం ఎదురుచూశారని కూడా మరి చెప్పనవసరం లేదు. పైన ఉటంకించిన సంభాషణ 2019 ఫిబ్రవరి 23వ తేదీన జరిగింది. మూడు రోజుల అనంతరం ఫిబ్రవరి 26న భారత వాయుసేన పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో గల ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించి సురక్షితంగా తిరిగివచ్చింది.


పైన ఉటంకించిన సంభాషణలోని ‘మాటల’ను ఎవరు విన్నారనే విషయం గురించి నేను పట్టించుకోవడం లేదు. ఆ వ్యక్తి అదృష్టవంతుడని నేను భావిస్తున్నాను. సరైన సమయంలో సరైన ప్రదేశంలో అతడు ఉన్నాడు! ఆ సంభాషణలోని అత్యంత ముఖ్య సమాచారాన్ని వెల్లడించింది ఎవరు అనే విషయమే నాకు కావాలి. ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థలో భాగం కాని ఒక వ్యక్తి సమక్షంలో అతడు ఆ మాటలు మాట్లాడాడు కదా. రహస్య, రక్షిత సమాచారాన్ని ప్రభుత్వేతర వ్యక్తులతో పంచుకోవడానికే అతడు ఆ మాటలు మాట్లాడాడా? ఫుల్వామా దాడికి భారతసైన్యం తప్పక బదులు తీర్చుకుంటుందని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే ఉద్దేశిత ప్రతీకార దాడిని అభివర్ణించేందుకు ‘ఉపయోగించిన కచ్చితమైన మాటల’ను ఎవరూ ఊహించలేరు. అత్యంత సున్నితమైన, రక్షిత సమాచారాన్ని ఎవరో ఒక వ్యక్తి ఇతరులతో పంచుకున్నారనేది స్పష్టం. ఎవరా వ్యక్తి?


కొన్ని నిర్ణయాలు గోప్యంగా ఉంచవలసినవి. మరి కొన్ని నిర్ణయాలు రహస్యంగా ఉంచవలసినవి. ఇంకొన్ని నిర్ణయాలు అత్యంత రహస్యమైనవి. ఇంకా మరి కొన్ని నిర్ణయాలు ‘ఫర్ యువర్ ఐస్ ఓన్లీ’. పాకిస్థాన్ భూభాగాలలోని ఉగ్రవాద శిబిరాలపై నిర్వహించిన ప్రతీకార దాడి విషయమై అత్యున్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయం ‘ఫర్ యువర్ ఐస్ ఓన్లీ’ కోవకే చెందుతుందని మరి చెప్పనవసరం లేదు. ఆ నిర్ణయం తీసుకునే ప్రక్రియతో పాటు నిర్ణయంతోనూ సంబంధమున్న వ్యక్తులు ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు, సైనిక దళాల ప్రధానాధికారి, వాయుసేన ప్రధానాధికారి, వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ప్రధానాధికారి మాత్రమే. ఆ వైమానిక దాడిలో పాల్గొన్న పైలట్‌లకు సైతం సదరు దాడి గురించి కొన్ని గంటల ముందు మాత్రమే వెల్లడిస్తారు. దరిమిలా దాడికి బయలుదేరేంతవరకు వారిని ఒంటరిగా ఉంచుతారు. ఈ వాస్తవాల ఆధారంగా ఆ ‘కచ్చితమైన మాటల’ను ఎవరు ఉపయోగించారో, ఆ అత్యంత గోప్య, రక్షిత సమాచారాన్ని ఎవరు ఇతరులతో పంచుకున్నారో మీరు మీ సొంత అభిప్రాయానికి రావచ్చు. 


ఆ సమాచారాన్ని మరో ఇతర (నిర్ణయంతో సంబంధంలేని) వ్యక్తితో పంచుకోవడం జరిగిందన్నది స్పష్టం. మరి ఆ ఇతర వ్యక్తి పాకిస్థాన్ గూఢచారి లేదా ఇన్ఫార్మర్ (సమాచార సూచకుడు) అయి ఉంటాడా? ఇదే నన్ను తీవ్రంగఆ కలచివేస్తోంది. ఆ ఇతర వ్యక్తి పాకిస్థాన్ గూఢచారి అన్న విషయం ఆ సమాచారాన్ని వెల్లడించిన వ్యక్తికి తెలిసి ఉండకపోవచ్చుగానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. ఆ సంభాషణలో పాల్గొన్న ‘మరొక వ్యక్తి’ ఎవరు అనేది కూడా నన్ను అమితంగా కలవరపరుస్తోంది. ఆ ‘మరొక వ్యక్తి’కి అధికారికంగా కల్పించే భద్రతా ఏర్పాట్లు ఏ కేటగిరీ కిందకు వస్తాయి? అతడు ఆ సమాచారాన్ని మరే ఇతర వ్యక్తితోనైనా పంచుకున్నాడా?


ప్రస్తావిత సంభాషణ మన జాతీయ భద్రతకు ఎటువంటి నష్టం చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ సంభాషణలు మరో పెద్ద మనిషి పేరుప్రతిష్ఠలకూ భంగం కలిగిస్తున్నాయి. ఆ వ్యక్తి దివంగత ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ (ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక). 2019 ఏప్రిల్ 10 అర్ధరాత్రి 12.45 గంటలకు జర్నలిస్టు, మరో వ్యక్తి మధ్య ఇలా సంభాషణ జరిగింది. మరొక వ్యక్తి: జైట్లీ వారి అతి పెద్ద వైఫల్యం. జర్నలిస్ట్: నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. (దిగ్భ్రాంతికరమైన విషయమేమిటంటే తీవ్ర అనార్యోగంతో బాధ పడుతున్న వ్యక్తి అంతిమక్రియల గురించిన ప్రస్తావనలివి) 2019 ఆగస్టు 19 ఉదయం 10.08 గంటలకు అదే వ్యక్తుల మధ్య ఇలా సంభాషణ జరిగింది. జర్నలిస్ట్: జైట్లీ సాగదీస్తున్నాడు. ఏమి చేయాలో ప్రధానమంత్రి కార్యాలయానికి పాలుపోవడం లేదు. ప్రధానమంత్రి ఫ్రాన్స్ పర్యటనకు బుధవారం బయలుదేరి వెళుతున్నారు. 10.09 గంటలు: మరొక వ్యక్తి: అతడు ఇంకా చనిపోలేదా? 10.55 గంటలు: జర్నలిస్ట్: అలానే ఉన్నాడు. సాయంత్రానికి అంతా అయిపోవచ్చని భావిస్తున్నాను. 


మన ప్రియమైన మాతృదేశం కోసం, మన సాయుధ బలగాల కోసం, వాటి రహస్యాల భద్రత కోసం, అంతే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి (అంతకు ముందు భారతీయ జనసంఘ్‌కు) అత్యంత విధేయుడుగా ఉన్న అరుణ్ జైట్లీ కుటుంబం కోసం నేను దుఃఖిస్తున్నాను. అవును, శోకిస్తున్నాను. శోకించకుండా ఎలా ఉండగలను? 

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.