సన్నాల సాగుదారులకు సున్నాయేనా?

ABN , First Publish Date - 2020-10-30T06:20:49+05:30 IST

పంటచేతికి వచ్చే దశలో అకాలవర్షాలతో రైతన్నలు నష్టపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల దుస్థితి చూస్తే, చేసిన కష్టం, పెట్టిన పెట్టుబడి మొత్తం...

సన్నాల సాగుదారులకు సున్నాయేనా?

ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు రెండు మార్గాలున్నాయి. మొదటిది,- కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించి, సన్నరకం వరిధాన్యం మద్దతు ధర పెంచేలా చర్యలు తీసుకోవటం; రెండవది- సన్నరకం సాగుచేయాలని ఆయన స్వయంగా సూచించారు కాబట్టి, మద్దతు ధర పెంచే బాధ్యతను తానే తీసుకుని రైతులకు క్వింటాలుకు రూ.500 చొప్పున ప్రోత్సాహం అందజేయడం.


పంటచేతికి వచ్చే దశలో అకాలవర్షాలతో రైతన్నలు నష్టపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల దుస్థితి చూస్తే, చేసిన కష్టం, పెట్టిన పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరు చందమయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే ముగిసిన వానాకాలంలో ‘నూతన నిర్బంధ వ్యవసాయం’ అనే వింత పద్ధతి నొకదాన్ని ప్రవేశపెట్టారు. ఈ కొత్త విధానం ప్రకారం ప్రతి రైతు తన పంటపొలంలో ప్రభుత్వం సూచించిన పంటలు మాత్రమే సాగు చేయాలి. అలా చేస్తేనే ఆయా పంటలకు మంచి ధరలు పొందుతారని రైతులను బ్లాక్‌మెయిల్ చేశారు. ఒకదశలో ఈ విధానం పాటించిన రైతులకు మాత్రమే రైతుబంధు వర్తిస్తుందనే స్థాయిలో ప్రచారం జరిగింది. కేసీఆర్ తను చెప్పినట్లుగా తూచా తప్పకుండా నడుచుకుంటే, రైతులను రాజులను చేస్తానన్నారు. కానీ, నేడు తెలంగాణలో ఆయన విధానాలు అన్నదాతలను అందలమెక్కించడం అటుంచి అధఃపాతాళానికి నెట్టివేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఆకాలవర్షాలకు పంటనష్టం జరిగిన సందర్భాలలో క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీచేసేవారు. వాళ్లు రైతుల నుంచి అన్ని వివరాలు సేకరించి పంటనష్టం అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందచేసేవారు. దానిననుసరించి రైతులకు నష్టపరిహారం అందజేసేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. సన్నరకం వరి, పత్తి, కంది, మొక్కజొన్న లాంటి పంటలు సాగు చేసి, నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు రావడం లేదు.


ఈ సన్నరకం వరిసాగు పూర్వాపరాలను లోతుగా అధ్యయనం చేసేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్ర వేత్తలు, నూతన వంగడాల పరిశోధకులతో చర్చించినప్పుడు ఆ వరి ‘టెస్ట్‌ట్యూబ్ బేబీ’ లాంటిదని వర్ణించారు. అంటే అది చాలా సున్నితమైన పంట. తెలంగాణ వాతావరణ పరిస్థితులకు తట్టుకొని నిలబడలేదు. పైగా దీన్ని సాగుచేయటానికి పెట్టుబడి వ్యయం ఎక్కువ, పంట దిగుబడి తక్కువ, చీడపీడల బెడదలూ ఎక్కువే. తెలంగాణలో బిపిటి, హెచ్‌ఎంటి సోనా, తెలంగాణ సోనా, జైశ్రీరామ్, చిట్టిముత్యాలు మొదలైన సన్నరకాలు సాగు చేస్తున్నారు. ఆగస్టు నుంచి మొన్నటి దాకా కురిసిన భారీవర్షాలకు ఎండాకుతెగులు, దోమ తెగులు, కాటుక తెగులు విజృంభించి రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి.


మన రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులు దొడ్డు రకం వరి ధాన్యానికి సాగుయోగ్యంగా ఉంటాయి. పంట దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఆ రకం ధాన్యం నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. కానీ, దానిని పూర్తిస్థాయిలో నిల్వ చేసేందుకు తగిన గిడ్డంగులు లేవు. పాలకులకు ముందు చూపు కొరవడడంతో గన్ని సంచులకు కూడా కొరత ఏర్పడింది. వరి ధాన్యం సంవత్సరం పైబడి నిల్వ చేస్తే ఎరుపు రంగుకు మారుతుంది. అలా మారితే ఇతర రాష్ట్రాలు ఆ ధాన్యం కొనుగోలు చేయకపోవచ్చు. రైతు కల్లాలు, రైతు వేదికలతో పాటు ప్రతి మండలానికి రైతు గోడౌన్ల సముదాయాలను నిర్మించాలి. దానివల్ల రైతు ఆశించిన గిట్టుబాటు ధర పొందేవరకు నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ధాన్యాన్ని మార్క్‌ఫెడ్ గోడౌన్‌లలో నిల్వచేసి, దానిపై రుణం పొందే అవకాశం ఉంది. రైతు తాను ఆశించిన మార్కెట్ ధర పొందేవరకు వేచిచూసి అమ్ముకోవచ్చు. సంబంధిత వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.


వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించడమనేది కేంద్రప్రభుత్వం పరిధిలోని అంశం. కానీ, కేంద్ర విధానాలలో సన్నరకం, దొడ్డురకం అనే వర్గీకరణ లేదు. కేవలం ఏ, బి అనే రెండు గ్రేడులుగా మాత్రమే పరిగణిస్తారు. అలా గ్రేడ్-ఏ రకానికి రూ.1885, గ్రేడ్-బి రకానికి రూ. 1865 మద్దతు ధర చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు రెండు మార్గాలున్నాయి. మొదటిది,- కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించి, సన్నరకం వరిధాన్యం మద్దతు ధర పెంచేలా చర్యలు తీసుకోవటం; రెండవది- సన్నరకం సాగుచేయాలని ఆయన స్వయంగా సూచించారు కాబట్టి, మద్దతు ధర పెంచే బాధ్యతను తానే తీసుకుని రైతులకు క్వింటాలుకు రూ.500 చొప్పున ప్రోత్సాహం అందజేయడం. ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులు పంటలసాగు విస్తీర్ణం వివరాలు నమోదు చేశారు. ఆ లెక్కల ప్రకారం సన్నరకం వరి సాగు చేసిన రైతులకు మద్దతు ధరకు అదనంగా చెల్లింపు పారదర్శకంగా చేయవచ్చు.


ఈ ఏడాది వానాకాలం 1.34 కోట్ల ఎకరాలలో పంట సాగు జరిగింది. అకాల వర్షాలకు కేవలం 15 లక్షల ఎకరాలలో పంటనష్టం జరిగిందంటూ అధికారులు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించారు. కానీ, దాదాపు 36 లక్షల ఎకరాలలో పంటనష్టం జరిగిందని ఓ అంచనా. మొత్తం మీద 15 వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది అని అంచనాలు ఉన్నాయి. దాదాపు 8 లక్షల మంది రైతులు నష్టపోయారు. తెలంగాణ ఏర్పాటయిన తరువాత రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీనే మొదటి సంవత్సరం మినహా ఇప్పటి వరకు విడుదల చేయలేదు.


హైదరాబాద్ వరద బాధితులకు 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అది మంచి పనే, సందేహం లేదు. అయితే, అన్నం పెట్టే రైతన్నకు ముఖ్యమంత్రి భరోసా ఇవ్వలేదు. హైదరాబాద్‌లో వచ్చే నెలలో జీహెచ్‌ఎంసి ఎన్నికలు ఉన్నాయి. ప్రజలలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న దృష్ట్యా ఓట్ల కోసమే ఆర్థికసాయం చేస్తున్నారు. సమీప భవిష్యత్తులో తెలంగాణ జిల్లాల్లో ఎలాంటి ఎన్నికలు లేవు కాబట్టి, రైతులకు పెనునష్టం వాటిల్లినా ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా పంటనష్టం లెక్కింపు కోసం క్షేత్రస్థాయిలోని అధికారులకు అత్యవసర ఆదేశాలు జారీ చేయాలి. సన్నరకం, దొడ్డురకం వరి ధాన్యం తేమ 17శాతం ఉండాలనే నిబంధనలు సడలించాలి. తేమ కొంత ఎక్కువగా ఉన్నా కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. వరి ధాన్యం త్వరితగతిన ఎండటానికి ఉపయోగించే యంత్రాలను సబ్సిడీపై రైతులకు అందజేయాలి. అకాలవర్షాలకు ఆగమైన తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవటానికి కేంద్రప్రభుత్వం సహృదయంతో ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలి. తెలంగాణ ప్రభుత్వం, సన్నరకం వరి సాగు చేసిన రైతులకు క్వింటాలుకు అదనంగా రూ.500 ప్రోత్సాహంగా అందజేయాలి. 33శాతం పైగా పంటనష్టం జరిగిన రైతులకు ఎకరాకు కనీసం రూ.15 వేల చొప్పున నష్టపరిహారం అందించాలి.

కొనగాల మహేష్ (ఏ.ఐ.సీ.సీ సభ్యులు)

Updated Date - 2020-10-30T06:20:49+05:30 IST