ఆస్తులపై చర్చకు జగదీశ్‌రెడ్డి సిద్ధమా?

ABN , First Publish Date - 2022-08-18T09:00:23+05:30 IST

మంత్రి జగదీశ్‌రెడ్డి 2014 తర్వాత సంపాదించిన ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

ఆస్తులపై చర్చకు జగదీశ్‌రెడ్డి సిద్ధమా?

ప్రజాసేవ కోసం నా ఆస్తులను అమ్ముకున్నాను

జిల్లాకు నిధులు తేలేని దద్దమ్మ: రాజగోపాల్‌రెడ్డి

సంస్థాన్‌ నారాయణపురం, ఆగస్టు 17: మంత్రి జగదీశ్‌రెడ్డి 2014 తర్వాత సంపాదించిన ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సవాల్‌ విసిరారు. 2009 తర్వాత ప్రజాసేవ కోసం తాను సొంత ఆస్తులను అమ్ముకున్నానని తెలిపారు. జగదీశ్‌రెడ్డి మాత్రం రూ.వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌ నియోజకవర్గాలకు నిధులు తీసుకెళ్తుంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎలాంటి అభివృద్ధి పనులకు నిధులు తీసుకురాలేని దద్దమ్మ మంత్రి జగదీ్‌షరెడ్డి అని ధ్వజమెత్తారు. ఆయనకు విద్యుత్తు శాఖకు బదులు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ శాఖను కేటాయిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. బుధవారం మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్‌ నారాయణపురం మండల కేంద్రంలో తన అనుచరులతో ఆత్మీయ సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం రిస్క్‌ అని తెలిసినా.. ప్రజా సంక్షేమం కోసం చేశానని చెప్పారు. మూడున్నరేళ్లుగా నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించినా ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదని, తాను రాజీనామా చేయగానే శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక గురించే చర్చించుకుంటున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్‌ కుటుంబానికి కమీషన్‌ రూపంలో రూ.వేల కోట్లు అందాయని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదనే ఉద్దేశంతో 18 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మందిని టీఆర్‌ఎ్‌సలో చేర్చుకున్నారని అన్నారు. కేసీఆర్‌ కుటుంబ పాలనపై పోరాడేందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నానని, ఈ నెల 21న మునుగోడులో నిర్వహించే బహిరంగ సభలో తనతోపాటు భారీ సంఖ్యలో వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు చేరుతారని తెలిపారు. 

Updated Date - 2022-08-18T09:00:23+05:30 IST