కేసీఆర్‌ను దేశదిమ్మరి అనాలా?

ABN , First Publish Date - 2022-05-09T09:41:30+05:30 IST

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటనపై విమర్శలు చేసిన మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

కేసీఆర్‌ను దేశదిమ్మరి అనాలా?

  • ఇతర రాష్ట్రాలకు ఏ హోదాలో వెళ్లివచ్చారు?
  • రాహుల్‌ను పొలిటికల్‌ టూరిస్ట్‌ అంటారా? 
  • కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్‌
  • గాంధీ కుటుంబం ప్రధాని పదవినీ వదులుకుంది
  • దళితుణ్ని సీఎం చేస్తానని కేసీఆర్‌ మాట తప్పారు
  • ప్రధాన ప్రతిపక్ష నేతగా దళితుణ్ని ఉండనివ్వలేదు
  • టీఆర్‌ఎస్‌, బీజేపీ, మజ్లిస్‌ది ఒకే భాష 
  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజం
  • కేటీఆర్‌ తన తండ్రి చరిత్ర తెలుసుకోవాలి: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌

హైదరాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటనపై విమర్శలు చేసిన మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్‌ను పొలిటికల్‌ టూరిస్టు అనడం, ఏ హోదాతో తెలంగాణకు వచ్చారనడంపై ఆగ్రహం వక్తం చేశారు. ముందుగా కేటీఆర్‌ ఏ హోదాతో రాహుల్‌ను విమర్శిస్తున్నారో చెప్పాలన్నారు. గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కూడా కేటీఆర్‌కు లేదన్నారు. సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల పేరుతో మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిసా, పశ్చిమబెంగాల్‌లకు వెళ్లి.. శరద్‌పవార్‌ను, స్టాలిన్‌ను, మమతా బెనర్జీని కలిశారని గుర్తు చేశారు. అలాంటప్పుడు కేసీఆర్‌ను ఏమనాలో చెప్పాలని, దేశదిమ్మరి అనాలా? అని ప్రశ్నించారు. ‘‘మీరు ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి నేతలను కలిస్తే చతురత, రాజకీయ చాణక్యం అవుతుంది.. ఇతరులు ఇక్కడికి వస్తే టూరిస్ట్‌ అంటారా? కేటీఆర్‌కు ఇంత అహంభావమా?’’ అని రేవంత్‌ నిలదీశారు. ఆదివారం గాంధీభవన్‌లో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాహుల్‌ను విమర్శించే ముందు కేటీఆర్‌ తన తండ్రి కేసీఆర్‌ చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. ‘‘మీ తండ్రికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్‌. సింగిల్‌ విండో డైరెక్టర్‌గా ఓడిపోయినా.. చైర్మన్‌ను చేసింది. ఆ తరువాత సిద్దిపేట ఎమ్మెల్యేగానూ పోటీచేసి ఓడిపోయారు. రాహుల్‌గాంధీ అమేథి నుంచి పారిపోయారని కేటీఆర్‌ అంటున్నారు. కానీ, పారిపోవడంలో కేసీఆర్‌కు డాక్టరేట్‌ ఇవ్వవచ్చు. సిద్దిపేట శాసనసభ స్థానం నుంచి కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి పారిపోయారు. అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌ పార్లమెంటు స్థానానికి, అటునుంచి మెదక్‌ పార్లమెంటు స్థానానికి, తిరిగి అక్కడి నుంచి గజ్వేల్‌కు పారిపోయిన చరిత్ర కేసీఆర్‌ది’’ అని రేవంత్‌ విరుచుకుపడ్డారు.


ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా..

గాంధీ కుటుంబానికి ప్రధాని అయ్యే అవకాశాలు వచ్చినా.. స్వీకరించకుండా ఇతరులను ప్రధాన మంత్రిని  చేశారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. దళితులను సీఎంలను చేసిన చరిత్ర కాంగ్రె్‌సదని పేర్కొన్నారు. కానీ, తెలంగాణలో దళితుణ్ని సీఎం చేస్తానన్న కేసీఆర్‌.. వారిని మోసం చేశారని దుయ్యబట్టారు. పైగా దళితుడైన భట్టి విక్రమార్కను కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్ష నేతగా చేస్తే ఓర్వలేక.. తమ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ కొనుగోలు చేసిందని ఆరోపించారు. వరంగల్‌ సభలో తాము ప్రకటించిన డిక్లరేషన్‌లోని తొమ్మిది ప్రధాన తీర్మానాలపై ప్రజలు ఉత్సవాలు చేసుకుంటున్నారని రేవంత్‌ తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన హామీలు ఇవ్వడం కుదరని, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఆర్థిక వనరులను బట్టి కాంగ్రెస్‌ హామీలు ఇస్తుందని అన్నారు. ఇదే క్రమంలో తెలంగాణలో ఉన్న ఆర్థిక వనరులను బట్టి హామీలిచ్చామని, వరంగల్‌ డిక్లరేషన్‌కు లక్షలాది మంది రైతులు సంపూర్ణ విశ్వాసం ప్రకటించారని పేర్కొన్నారు. దీంతో కలుగులో దాక్కున్న ఎలుకలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయని, టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం మూకుమ్మడిగా దాడిచేశాయని విమర్శించారు. ఈ మూడు పార్టీలూ ఒకే భాష మాట్లాడాయని, వాటి చీకటి ఒప్పందం బయటపడిందని అన్నారు. టీఆర్‌ఎస్‌ అనే రిమోట్‌ను కాపాడే యత్నంలో బీజేపీ, బీజేపీకి పరోక్షంగా సహకరిస్తున్న ఎంఐఎం బయటకు వచ్చాయని ఆరోపించారు. 


అమరుల స్తూపం నిర్మాణంలో అవినీతి..

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అద్భుతమైన అమరుల స్తూపాన్ని నిర్మిస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రూ.62 కోట్లతో ప్రారంభించిన అమరుల స్తూపం వ్యయాన్ని రూ.200 కోట్లకు పెంచారని, ఇందులో రూ.150 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. యాదాద్రి ఆలయం పేరుతో రూ.2 వేల కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే యాదగిరిగుట్ట, అమరుల స్తూపం నిర్మాణాల్లో అవినీతిపై విచారణ జరిపిస్తామని, దోషులను శిక్షిస్తామని ప్రకటించారు. సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ స్థాయి ఏంటో మొన్నటి ‘మా’ ఎన్నికల్లోనే తేలిపోయిందని రేవంత్‌ ఎద్దేవా చేశారు.   కేసీఆర్‌కు చేతకాక ప్రకాశ్‌రాజ్‌ను తెచ్చుకున్నారని విమర్శించారు. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్‌ డిక్లరేషన్‌ రాష్ట్ర రైతులకు భరోసా ఇచ్చిందన్నారు. అసదుద్దీన్‌ను రాహుల్‌ పల్లెత్తు మాట అనకపోయినా ఆయనెందుకు స్పందించారని పీఏసీ చైర్మన్‌ షబ్బీర్‌ అలీ ప్రశ్నించారు. ఆయన బీజేపీ ఏజెంటుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. 

Read more