రౌడీలకు ఓట్లేస్తే రక్షణ సాధ్యమా?

ABN , First Publish Date - 2022-01-19T05:41:24+05:30 IST

రాజకీయం–నేరం కలగలసి కాపురం చేస్తున్న కాలంలో ఉన్నాం. సామ దాన బేధ దండోపాయాలు ఉపయోగించి పదవులను చేజిక్కించుకుంటున్న కొందరు పదవి రాగానే ఒక కంటితో అక్రమ సంపాదనను...

రౌడీలకు ఓట్లేస్తే రక్షణ సాధ్యమా?

రాజకీయం–నేరం కలగలసి కాపురం చేస్తున్న కాలంలో ఉన్నాం. సామ దాన బేధ దండోపాయాలు ఉపయోగించి పదవులను చేజిక్కించుకుంటున్న కొందరు పదవి రాగానే ఒక కంటితో అక్రమ సంపాదనను మరోకంటితో కామాన్ని కోరుకుంటున్నారు. ఒక్కోసందర్భంలో ప్రజాప్రతినిధులే నేరుగా అరాచకాలకు పాల్పడుతుంటే మరికొన్ని చోట్ల కుటుంబ సభ్యులు లేదా ప్రధాన అనుచరులు అడ్డదారిలో పెత్తనాలను సాగిస్తున్నారు. కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచలో జరిగిన ఘటన శృతిమించిన అధికార జోక్యానికి ఒక ఉదాహరణ. కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగితే పెత్తనం నడవదని భావించి గెలిచిన రెండు నెలలకే పార్టీ మార్చిన శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు రాఘవ ఈ మూడేళ్ళలో చెలరేగిపోయారు. రాఘవపై 12 కేసులకు సంబంధించి కేవలం రెండు కేసుల్లోనే పోలీసులు ఛార్జీషీట్‌ వేసి మిగతా కేసుల గురించి పట్టించుకోలేదంటే  రాజకీయ ఒత్తిడులు ఏ స్థాయిలో ఉన్నాయో ఆర్థమవుతుంది. 


రాజకీయం అంటే ప్రజా సేవ అన్న విషయాన్ని ఇప్పటి తరం మరచిపోతున్నది. గతంలో ప్రజా ప్రతినిధులుగా పనిచేసినవారంతా సేవా భావం తోనే రాజకీయాలు నడిపారు. తమ ఆస్తులను హరతి కర్పూరంలా కరిగించుకున్నారు తప్ప పరుల ఆస్తిపైన ఏనాడు కన్నెయ్యలేదు.  


ఒకపక్క ప్రజల తరఫున ప్రశ్నించే కళాకారులు, అభ్యుదయవాదులు, ప్రజాతంత్ర వాదులు, విప్లవ పార్టీల నాయకులు ఉపా లాంటి చట్టాల వల్ల దేశద్రోహం కేసులు మోపబడి ఏళ్ళ తరబడి బెయిల్‌ లేకుండా జైళ్లలో మగ్గు తున్నారు. మరోవైపు మహిళలను రేప్‌ చేసి చంపి, కుటుంబాలను బలితీసుకుని, ఇంకా ఎన్నో ఘోరాలకు పాల్పడిన రాజకీయ నాయకులు అసలు కేసులే లేకుండా, ఒకవేళ ఉన్నా కొద్ది రోజల్లోనే బయటకు వచ్చి ఆ కేసులను అదనపు గౌరవంగా భావిస్తూ కాలర్‌ ఎగరేసుకొని అనుచరులతో తిరుగుతున్నారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికలలో గెలిచిన 539మంది పార్లమెంటు సభ్యులలో దాదాపు 233మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2009 ఎన్నికల కంటే ఇది 44శాతం అధికం. అదేవిధంగా 22 రాష్ట్రాలలో 2556 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్నారు. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కలుపుకుంటే ఈ సంఖ్య 4442కు పెరుగుతుంది. అలాగే మహిళలపై రేప్ కేసుల అభియోగాన్ని ఎదుర్కొంటున్న వారిలో దాదాపు 334 మందికి వివిధ పార్టీలు పార్లమెంట్‌ స్థానాలకు తమ పార్టీ టిక్కెట్‌ ఇచ్చాయి. మహిళలపై దాడులు, మానభంగ నేరారోపణలు, మానభంగ ప్రయత్నాలు, వ్యభిచార వృత్తిలో దింపడానికై మైనర్‌ బాలికల కొనుగోళ్ళు తదితర తీవ్ర ఆరోపణలు కలిగిన వారు 51మంది ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.  


చట్టాలను పకడ్బంధీగా రూపొందించడం ద్వారా నేరమయ రాజకీయాలను నియంత్రించవచ్చు. ఆర్థిక, లైంగిక అరాచకాలకు పాల్పడినప్పుడు శాశ్వతంగా రాజకీయాల నుంచి వెలివేసే చట్టం తీసుకురావాలి. రాజకీయ నాయకుల నేరాలపై సత్వర న్యాయం జరిగే విధంగా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలి. ప్రజల ఆలోచనా విధానంలోనూ మార్పురావాలి. గతంలో నిస్వార్థంగా ప్రజా సేవ చేసిన వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని అటువంటి వ్యక్తులను ఎన్నుకోవాలి. అప్పుడే ఈ రౌడీల పాలనలో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుర్గతి తప్పుతుంది.

కూనంనేని సాంబశివరావు, సిపిఐ నాయకులు

Updated Date - 2022-01-19T05:41:24+05:30 IST