ప్రైవేటీకరణే ప్రగతి మంత్రమా?

ABN , First Publish Date - 2021-02-03T06:26:08+05:30 IST

కొత్తబడ్జెట్ వచ్చింది. కుబేరులు సంతోషించారు. 2021–-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో...

ప్రైవేటీకరణే ప్రగతి మంత్రమా?

కొత్తబడ్జెట్ వచ్చింది. కుబేరులు సంతోషించారు. 2021–-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలో అనేకమంది పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలకు సంతృప్తికరంగా ఉంది. బడ్జెట్‌పై వారి వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. బ్యాంకులను, బీమా సంస్థలను ప్రైవేటీకరించడం, ప్రభుత్వ ఆస్తులను అమ్మడం, బీమారంగంలో విదేశీ పెట్టుబడులను 74 శాతానికి పెంచడం, మొండి బాకీలకోసం ఒక ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేయడం వంటి నిర్ణయాలు స్టాక్ మార్కెట్ ఉత్థానానికి దారితీశాయి.


ప్రభుత్వం క్రమంగా వివిధ రంగాల నుంచి తప్పుకుని ప్రైవేట్ రంగానికి మరింత పాత్ర కల్పించాలన్న విషయంలో మోదీ సర్కార్ తన ఉద్దేశాలను ఎప్పుడూ దాచుకోలేదు. నీతి ఆయోగ్ పలు నివేదికల్లో ఈ విషయం స్పష్టంగా కనపడుతుంది. 15వ ఆర్థిక సంఘం నివేదిక సైతం గ్రామాల్లోకి మార్కెట్ చొచ్చుకువెళ్ళాలన్న ఉద్దేశాన్ని ప్రకటించింది. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సాగు చట్టాలు వ్యవసాయరంగం రూపురేఖలు మారుస్తాయని, గ్రామాల్లో ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టడమే సమస్యలకు తగిన పరిష్కారమని పేర్కొంది. 


1991లో దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రారంభమైన సంస్కరణలు ఇవాళ ఒక మౌలిక మలుపు తీసుకుంటున్నాయి. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రూ. 9,961 కోట్ల మేరకు ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. కేవలం మైనారిటీ వాటాలనే ఉపసంహరించడాన్ని పీవీ అనుమతించారు. వాజపేయి హయాంలో పెట్టుబడుల ఉపసంహరణ ఒక వెల్లువలా సాగింది. పెట్టుబడుల ఉపసంహరణకు అరుణ్ శౌరీ నేతృత్వంలో ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసి, విదేశీ సంచార్ నిగమ్, మారుతి సుజుకి, ఓఎన్‌జీసీ, బాల్కో, హిందుస్తాన్ జింక్ మొదలైన కంపెనీలలో భారీ ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణకు ఆయన ఆమోద ముద్ర వేశారు. ప్రభుత్వ రంగంలోని హోటళ్లను పూర్తిగా అమ్మి వేశారు. ప్రభుత్వ బ్యాంకులన్నిటిలోనూ 33 శాతం వాటాలను అమ్మాలని అప్పుడే ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ప్రతిపాదించారు కాని అది అమలు కాలేదు. వాజపేయి హయాంలో రూ.33,655 కోట్ల మేరకు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. వామపక్షాలు అడ్డుకోవడం వల్ల యూపీఏ మొదటి ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం వేగవంతం కాలేదు. ఆ తొలి అయిదేళ్లలో కేవలం రూ. 8,515 కోట్ల మేరకే పెట్టుబడులను ఉపసంహరించగలిగారు. అయితే యూపీఏ రెండవ సారి మళ్లీ అధికారంలోకి రాగానే ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణను ప్రధాని మన్మోహన్ సింగ్ వేగవంతం చేశారు. ఎన్‌హెచ్‌పిసితో ప్రారంభమైన పెట్టుబడుల ఉపసంహరణ వివిధ రంగాల్లోకి విస్తరించి దాదాపు రూ.99,000 కోట్ల మేరకు సాగింది. 


మన్మోహన్ సింగ్ రెండవ సారి ప్రధాని అయినప్పుడు వాల్ స్ట్రీట్ జర్నల్ ఆయనను ఇంటర్వూ చేసి ప్రైవేటీకరణ గురించి ప్రశ్నించింది. ప్రభుత్వరంగ సంస్థలు మార్కెట్‌లో ఇతర ప్రైవేట్ సంస్థలతో సమానంగా పోటీపడాలని, మంచి లాభాలను ఆర్జించాలన్నదే తమ ఉద్దేశమని, అవి పెట్టుబడులకోసం మార్కెట్‌లో ప్రవేశిస్తే తమకు అభ్యంతరం లేదని మన్మోహన్ అన్నారు. అసలు ప్రైవేటీకరణ తమ సిద్ధాంతం కాదని అవసరాలకు అనుగుణంగా దాన్ని ఉపయోగించుకుంటామనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.


నరేంద్ర మోదీ సైద్ధాంతిక విశ్వాసాలలో ప్రైవేటీకరణ చాలా ముఖ్యమైనది. ఆయన రెండవ సారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ విషయం మరింత స్పష్టమవుతోంది. వాజపేయి కన్నా మోదీ రెండాకులు ఎక్కువ చదివారు. మోదీ తొలి ప్రభుత్వ కాలంలోనే రూ. 2లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాజా బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం జాతీయ హైవే అథారిటీ, రైల్వే, చమురు, సహజవాయు సంస్థల ఆస్తులను అమ్మి రు. 1.74 లక్షల కోట్లను సేకరిస్తామని ప్రకటించింది. మొత్తం ప్రభుత్వరంగ సంస్థలన్నిటినీ ప్రైవేటీకరణ చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అణు ఇంధనం, అంతరిక్షం, రక్షణ, రవాణా, టెలికమ్యూనికేషన్లు, విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఖనిజవనరులు, బ్యాంకింగ్, మైనింగ్, ఆర్థిక సర్వీసుల్లో ప్రభుత్వం నామమాత్రంగా కొనసాగుతుందని ఆమె చెప్పారు. ఆస్తుల అమ్మకం ద్వారా సేకరించిన ఈ మొత్తాన్నంతా మౌలిక సదుపాయాల అభివృద్ధికి మళ్లించడం వల్ల పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరుగుతుందని నిర్మల నొక్కి చెప్పారు. 


నిజంగా మోదీ ప్రభుత్వం సేకరించిన నిధులన్నీ మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగపడుతున్నాయా అన్న విషయం చర్చనీయాంశమే. మౌలిక సదుపాయాల కల్పన కోసం మోదీ ప్రభుత్వం 2018లో రూ.2.18 లక్షల కోట్ల మేరకు 42 రకాల సెస్‌ను విధించింది, స్వచ్ఛభారత్ సెస్, రోడ్ సెస్, క్లీన్ ఎనర్జీ సెస్ అంటూ రకరకాలుగా వసూలు చేసిన ఈ మొత్తాన్ని ఆయా రంగాలకు బదిలీ చేయకపోవడమే కాక సరిగా వినియోగించలేదని కూడా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) విమర్శించింది. 2019లో ఈ సెస్ మొత్తం రూ. 3.60 లక్షల కోట్లకు చేరుకుంది. జీఎస్టీ నష్టపరిహార సెస్ క్రింద వసూలు చేసిన రూ.47,277 కోట్లను కూడా చాలాకాలం నష్టపరిహార నిధికి కాకుండా కన్సాలిడేటెడ్ ఫండ్‌కు మళ్లించింది. క్రూడ్ ఆయిల్ సెస్ క్రింద సేకరించిన రూ. 1.24 లక్షల కోట్లను కూడా సంబంధిత రిజర్వు నిధికి మళ్లించలేదు. తన రెవిన్యూను పెంచుకోవడానికి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై సెస్‌ను విధించడం పరిపాటి అయింది. ఇప్పుడు బడ్జెట్‌లో వ్యవసాయ, మౌలిక సదుపాయాల కోసం రూ.30 వేల కోట్ల మేరకు సెస్‌ను విధించాలని నిర్ణయించారు. విచిత్రమేమంటే 15వ ఆర్థిక సంఘం దీని గురించి ఎలాంటి ప్రతిపాదన చేయలేదు. అతిగా సెస్ లు, సర్‌ఛార్జిలు కేంద్రం వసూలు చేసి తానే ఉపయోగించుకుంటోందని, ఆ మొత్తంలో కూడా తమకు సగం వాటా ఇవ్వాలని రాష్ట్రాలు కోరినట్లు ఆర్థిక సంఘం చెప్పింది. అయితే మోదీ ప్రభుత్వానికి ఆ ముక్క సిఫారసు చేసే సాహసం చేయలేదు. కేంద్రం తన రెవిన్యూను పెంచుకునేందుకే సెస్ వసూలు చేస్తుంది కాని, రాష్ట్రాలతో పంచుకునే అవకాశం లేదని 14వ ఆర్థిక సంఘం సభ్యుడు గోవిందరావు అన్నారు.


ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న పేరుతో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్నీ, బ్యాంకుల్ని, బీమా కంపెనీలను అమ్మడం సరైనది కాదని సంఘ్ పరివార్‌కు చెందిన స్వదేశీ జాగరణ్ మంచ్ కూడా విమర్శించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఆందోళనకరమని ఆ సంస్థ ప్రతినిధి అశ్వినీ మహాజన్ ప్రకటన విడుదల చేశారు. ఈ సంస్థల్లో ముందుగా వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టి, పనితీరు మెరుగుపరిచేందుకు ప్రయత్నించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు చెల్లించిన పన్నులతో నిర్మించిన ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం సరైంది కాదని బీమారంగంలో విదేశీ పెట్టుబడులను 74 శాతానికి పెంచడం వల్ల మన ఆర్థిక వనరులపై విదేశీ ఆధిపత్యాన్ని పెంచినట్లవుతుందని మహాజన్ విమర్శించారు.


పార్లమెంట్‌లో సోమవారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టేంతవరకూ ఊరుకున్న ప్రతిపక్షాలు అనుకున్న విధంగానే సాగుచట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ మంగళవారం ఉభయ సభల్లో గందరగోళం సృష్టించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో గత 70 రోజులుగా జరుగుతున్న రైతుల నిరసనలు ఆగకపోగా, ఢిల్లీ నగరాన్ని భద్రతా వలయం మధ్య పూర్తిగా దిగ్బంధనం చేయాల్సి వచ్చింది. ప్రతికూల వాతావరణం ఎంతగా ఎదురైనప్పటికీ ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణలో మోదీ సర్కార్ మరింత సాహసంగా ముందుకు వెళ్లడం వల్ల కలిగే పర్యవసానాల గురించి ఇప్పుడే చెప్పడం కష్టం. సంఘ్ పరివార్ చెప్పినా ఆయన వినే పరిస్థితుల్లో లేరు. మరి ప్రభుత్వం అన్ని రంగాలనుంచీ క్రమంగా తప్పుకుంటున్నప్పుడు కేంద్ర మంత్రివర్గంలో 54 మంది అమాత్యులు, ఒక్క ప్రధానమంత్రి కార్యాలయంలోనే 44 మంది అధికారులు అవసరమా అన్న విషయం కూడా ఆలోచించాలి.


ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

Updated Date - 2021-02-03T06:26:08+05:30 IST