నదీన్యాయం ఎండమావేనా?

ABN , First Publish Date - 2020-10-13T05:47:30+05:30 IST

నదీజలాల వివాదాలు దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోకుండా ప్రభుత్వాల బాధ్యతారాహిత్యానికి ప్రబల సాక్ష్యంగా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ఆర్థిక శక్తికి...

నదీన్యాయం ఎండమావేనా?

రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వివేచన వదిలి, న్యాయభావన వదిలి కేవలం వివాదాలతో రాజకీయ రచ్చకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నందువల్ల కేంద్రం తన పరిధి దాటి రాష్ట్రాల అధికారాలలో ప్రవేశించే అవకాశం పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రాల అధికారాలు నామమాత్రమైపోతున్నఈ పరిస్థితిలో, అంతర్గతంగా నదుల అనుసంధాన ఎజెండాతో కేంద్రం రాష్ట్రాల మీద పట్టు బిగిస్తున్న దృశ్యం అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కనిపించింది. స్వీయగౌరవ స్ఫూర్తి, ఉద్యమ చైతన్యం కలిగిన తెలుగు ప్రజల ముఖ్యమంత్రులు ఫెడరల్‌ స్వభావాన్ని వదులుకుంటున్నారా? నదీజల వివాదాలు ఇక శాశ్వతమేనా?


నదీజలాల వివాదాలు దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోకుండా ప్రభుత్వాల బాధ్యతారాహిత్యానికి ప్రబల సాక్ష్యంగా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ఆర్థిక శక్తికి కృష్ణాగోదావరి నదులు కీలక వనరులు. 1956లో ఆంధ్ర, హైదరాబాదు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడటానికైనా, ఉద్వేగాలకి, వాస్తవాలకి అంతరం చెదిరిపోయి తిరిగి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడటానికైనా నదీజలాలు ఒక కీలక అంశమే. ఇవాళ అటు ఆంధ్రప్రదేశ్‌లో, ఇటు తెలంగాణలో అంతర్గత వివాదాలతో ప్రభుత్వాలకి, పాలక పార్టీలకి కీలక సవాలు నదీజలాల వివాదమే. 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు అంతర్గతంగా నదీజల వివాదాల పరిష్కారానికి కృషి చేయటంలో ఘోరంగా విఫలమైనాయి. హేమాహేమీలైనవారు ముఖ్యమంత్రులుగా పని చేసినా, వారి పనిని కరువు వ్యతిరేక పోరాటాలు, జలసాధన ఉద్యమాలు అడుగడుగునా నిలవరించినా ఎగువ ప్రాంతాలకు బాధిత రైతాంగానికి కనీస న్యాయం దక్కలేదు. అటు రాయలసీమ, ఇటు తెలంగాణ నీటి న్యాయం కోసం అనేక త్యాగాలతో పోరాటాలు సాగించాయి. తిరిగి రెండు రాష్ట్రాలు ఏర్పడక తప్పలేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం జల వివాదాల అంశాన్ని గుర్తించింది. అపెక్స్‌ కౌన్సిల్‌, కృష్ణా, గోదావరి నదీజలాల నిర్వహణ కోసం బోర్డుల ఏర్పాటును చట్టంలో చేర్చింది. బోర్డులు ఏర్పడ్డాయి. కానీ ఏమీ చేయలేకపోయాయి. ఎందుకూ అంటే పరిధి నోటిఫై కాలేదు అంటారు. కానీ, చాలా చేసివుండవచ్చు. కనీసం నీరందని ప్రాంతాలను గుర్తించి ఉండవచ్చు. ఆ పనీ చేయలేదు. అందువల్ల రెండు రాష్ట్రాల మధ్య మాత్రమే కాక రెండు రాష్ట్రాల లోపల కూడా అంతర్గత వివాదాలను గుర్తించలేకపోవడంతో బాధిత ప్రజలు చాలా నష్టపోయారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు ఒక పంటకైనా నీరివ్వటానికి ప్రజామోదమైన ఒక విధానం రూపొందించలేకపోయాయి. 


రెండు రాష్ట్రాలు ఏర్పడి ఆరున్నరేండ్ల కాలం గడిచిన తరువాత ఈనెల ఆరోతేదీన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశం కృష్ణా, గోదావరీ జల వినియోగ వివాదాలను, నిర్మించిన, నిర్మిస్తున్న ప్రాజెక్టులను, కొత్త ప్రాజెక్టులను, కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు అవసరాన్ని కృష్ణా గోదావరి బోర్డుల పరిధిని నోటిఫై చేయవలసిన అవసరాన్ని చర్చించింది. దీనిని పరిశీలించిన వారికి పైకి కనిపించిన విషయాల కన్నా కనిపించని విషయాలు ఆందోళన కలిగించాయి. అవేమిటో అంశాల వారీగా చూద్దాం..


మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల గుండా గోదావరి, కృష్ణానదులు స్థానిక నదుల్ని కలుపుకుంటూ ప్రవహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ అధిక నీటి వాడకానికి ఏర్పాట్లు చేసుకుంటున్నదని ఎగువ రాష్ట్రాలు ఫిర్యాదు చేయటంతో జస్టిస్‌ బచావత్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటైంది. నదుల ప్రవాహదినాలను, పారే నీటి పరిమాణాన్ని లోతుగా అధ్యయనం చేసి నిర్మించిన, నిర్మిస్తున్న ప్రాజెక్టుల స్థాయిని బట్టి నీటి కేటాయింపు జరిపి మిగులు నీటిని ఏ.పి వాడుకోవచ్చునని, అయితే ఇదేమీ హక్కు కాదని చెప్పి, పంపకం జరగకుండా ఉన్న నికరజలాలను కూడా మూడు రాష్ట్రాలకు పంచింది. ఈ ట్రిబ్యునల్‌ తీర్పు మే 2000 సంవత్సరంతో ముగిసింది. తరువాత నియామకమైన జస్టిస్‌ బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ 75 శాతం డిపెండబిలిటీని 65 శాతానికి తగ్గించి, మిగులు జలాలను కూడా నికర జలాలుగా లెక్కించి కేటాయింపులు చేసింది. ఏపీకి చేసిన కేటాయింపులను ప్రాంతాలవారీగా చూసినపుడు దక్షిణ తెలంగాణలోని వర్షాభావ, దుర్భిక్ష, క్షామపీడిత ప్రాంతాలకు తీవ్ర అన్యాయం జరిగింది. అటు రాయలసీమ ఎగువ ప్రాంతాలకు కూడా. ఉమ్మడి ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేటాయించిన నీటికన్నా మాకు ఒక్క చుక్క కూడా అవసరం లేదు అంటారు. అసలు పంపిణీలో రెండు ట్రిబ్యునళ్ళు కూడా తెలంగాణకు నీటి పంపిణీలో జరిగిన అన్యాయమే విననప్పుడు, అన్యాయం జరిగిందని రుజువై, కృష్ణానదీ జలాల పునఃపంపిణీ జరగాలని పోరాడి తెలంగాణ సాధించుకున్న తరువాత నీరు అవసరమే లేదు అంటే ఎట్లా? ఈ వివాదం రెండు స్థాయిలలో పరిష్కారం కావాలి. ఒకటి – రాష్ట్రాల మధ్య, రెండు –రాష్ట్రాలలోని ప్రాంతాల మధ్య. ఈ సమస్యను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు గుర్తించటం లేదు. అపెక్స్‌ కౌన్సిల్‌ గుర్తించలేదు. జలవివాదం ఆగేదెట్లా? 


జల వివాదాల పరిష్కారానికి ఏర్పడిన ట్రిబ్యునళ్ళకు గోదావరి వివాదాల పరిష్కారం సమస్యే కాలేదు. గోదావరిలో మిగులు నీరున్నది. వాడుకోలేకపోయారు. పర్యావరణాన్ని విధ్వంసం చేసే విధంగా, ప్రజల్ని నిర్వాసితుల్ని చేసి వారి జీవన ప్రమాణాలను జీవనాన్ని ధ్వంసం చేసే విధంగా ప్రాజెక్టులు నిర్మిస్తే ఎట్లా అనేదే గోదావరి మీద ప్రధాన వివాదం. కృష్ణానదీ జలవివాదంలో ప్రధాన సమస్య–ఉపయోగించుకునే వాడి హక్కును కాపాడటం అనే ఒక పనికి మాలిన ప్రగతి నిరోధక సూత్రం ప్రాతిపదికగా–ప్రాజెక్టుల వారీగా నీటి పంపిణీ జరపటంలోనే మొదలైంది. నదిలో నీటి లభ్యత దిగువకు వచ్చేకొద్దీ పెరుగుతుంది కనుక ఏపీకి సహజంగా ఎక్కువ నీరు దక్కింది. దీనికి ఇక్కడ రెండు భారీ ప్రాజెక్టులుండటం కలిసి వచ్చింది. ట్రిబ్యునళ్లు ఆ ప్రాంతాల అప్పీలు కూడా వినే అవకాశం ఉంటే తీర్పులు కొంత వేరుగా ఉండేవేమో. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ గడువు పెంచినా ఆ ట్రిబ్యునల్‌ తెలంగాణ వాదనలు వినాలని కేంద్రం సూచించలేదు. వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. అపెక్స్‌ కౌన్సిల్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి సుప్రీం కోర్టులో వేసిన కేసు విరమిస్తామన్నారు. కొత్తగా ట్రిబ్యునల్‌ అడిగారు. గోదావరికి సంబంధించినంతవరకు నీటి భాగాల వివాదమే లేదు గనుక కొత్త ట్రిబ్యునల్‌ అవసరం లేదు. కృష్ణా వివాదాలకు సంబంధించి పరిమిత కాల వ్యవధిలో బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ద్వారా తెలంగాణ జల సమస్యకు పరిష్కారం సాధిస్తామని కేంద్రమే సుప్రీంకోర్టుకు నివేదించవచ్చు. ఈ పని ఆరున్నరేండ్లలో ముగిసివుండవలసింది. కేంద్రమూ, రెండు రాష్ట్రాలు యథాతథవాదులే గనుక బాధితులకు అన్యాయమే జరుగుతోంది. కౌన్సిల్‌ సమావేశంలో కూడా ఏపీ ముఖ్యమంత్రి వాటాకు మించి నీరు వద్దన్నారు. కొత్త ప్రాజెక్టులన్నీ వాటా పరిధిలోవే అన్నారు. ఇది నిజమేనా? ఈ వాదనలోని డొల్లతనాన్ని అపెక్స్‌ కౌన్సిల్‌ తేల్చలేకపోయింది. ఈ అంశం దగ్గరే తెలంగాణ తెల్లారి మరో తీరు మాట్లాడింది. ఇదంతా రాష్ట్రాలకి ఒక జలవిధానం లేనందువల్ల కొనసాగుతున్న సమస్య. 


నీటి కేటాయింపులు, అనుమతులు వుంటేనే కొత్త ప్రాజెక్టుల నిర్మాణం అంటే దరిద్రులకు దరిద్రమే అని చెప్పినట్టే. కనీస న్యాయంగానైనా రెండు రాష్ట్రాల మధ్య జలపంపిణీ సాధించుకుని, రెండు రాష్ట్రాలలోని ఎగువ ప్రాంత రైతాంగానికి న్యాయం కోసం పని చేస్తామని, అవసరం మేరకు రాష్ట్రం లోపల – అంతర్గతంగా నీటిని శాస్త్రీయ ప్రమాణాలతో పునఃపంపిణీ జరిపి ఉపయోగించుకుంటామని ముఖ్యమంత్రులు ఇద్దరూ చెప్పలేదు. అలాంటి సూచనలు కేంద్రమంత్రి చేయనూ లేదు. మా ప్రాజెక్టు న్యాయమైంది అంటే మాదే న్యాయమైంది అని ప్రజలు వీరంగమెత్తే పరిస్థితి దాపురించింది. ప్రాజెక్టులు పూర్తికావు. తెలంగాణలో పాలమూరు–రంగారెడ్డి మూలన పడింది. మరో తీవ్ర విషయం ఏమంటే రెండు రాష్ట్రాలలోను స్టెబిలైజేషన్‌ కోసమే ప్రాజెక్టులు కడతారు కానీ కొత్త ప్రాంతాలకోసం కాదు. పార్టీలు కూడా స్టెబిలైజ్‌ కావాలి కదా! అందుకే పరస్పర బెదిరింపుల ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నారు. 


కృష్ణా గోదావరి బోర్డుల పరిధి నోటిఫై చేయటం మరో సమస్య. ఇది చాలా తీవ్రమైన సమస్య. ఏ నది నీటితో, ఏ ప్రాజెక్టుతో ఏయే ప్రాంతాలకు, ఏయే భూములకు నీరిస్తారో తేల్చి, ప్రజల మధ్య సరైన చర్చ జరిగాక బోర్డుల పరిధి నోటిఫై చేయవలసి వుంటుంది. తుంగభద్ర బోర్డు ఉండింది కానీ ఆర్డీఎస్‌ భూములకు నీరివ్వలేదు. ఎంత స్వతంత్రంగా బోర్డులు పనిచేసినా అవి కొత్త ప్రాంతాలకు ఎంత అవసరం ఉన్నా నీరివ్వగలవా? ఇది రాజకీయంగా చేతులు దులుపుకోవటం అవుతుందా? తెలంగాణ రాష్ట్రం ఎగువ ప్రాంతాలకు నీరివ్వలేని విధంగా రీడిజైన్‌లు చేసింది. ఏపీ కూడ స్టెబిలైజేషన్‌ కోసమే పనిచేస్తోంది. ఏవైనా అక్రమాలు జరగకుండా ఈ బోర్డులు పనిచేయగలవా? 


రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వివేచన వదిలి, న్యాయభావన వదిలి కేవలం వివాదాలతో రాజకీయ రచ్చకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నందువల్ల కేంద్రం తన పరిధి దాటి రాష్ట్రాల అధికారాలలో ప్రవేశించే అవకాశం పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రాల అధికారాలు నామమాత్రమైపోతున్న ఈ పరిస్థితిలో, అంతర్గతంగా నదుల అనుసంధాన ఎజెండాతో కేంద్రం రాష్ట్రాల మీద పట్టుబిగిస్తున్న దృశ్యం అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కనిపించింది. స్వీయగౌరవ స్ఫూర్తి, ఉద్యమ చైతన్యం కలిగిన తెలుగు ప్రజల ముఖ్యమంత్రులు ఫెడరల్‌ స్వభావాన్ని వదులుకుంటున్నారా? నదీజల వివాదాలు ఇక శాశ్వతమేనా?

ఎం. రాఘవాచారి

పాలమూరు అధ్యయన వేదిక

Updated Date - 2020-10-13T05:47:30+05:30 IST