రష్యా ఆయుధం ఇక్కడికెలా?

ABN , First Publish Date - 2022-06-02T08:36:27+05:30 IST

ఏకే-47 తూటా సెకనుకు 715 మీటర్ల వేగంతో దూసుకెళ్తే.. ఏఎన్‌-94 నుంచి వచ్చే బుల్లెట్‌ సెకనుకు 900 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

రష్యా ఆయుధం ఇక్కడికెలా?

సింగర్‌ సిద్దూ హత్యకు వాడింది ఏఎన్‌-94

ఏకే-47 కంటే ప్రమాదకరమైన తుపాకీ

న్యూఢిల్లీ: ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్యలో కొత్త కోణం వెలుగుచూసింది. ఈ హత్యకు ఏకే-47 రైఫిల్‌ను వాడినట్టు తొలుత పోలీసులు భావించారు. కానీ.. ఆ ప్రదేశంలో లభించిన 30 బుల్లెట్‌ షెల్స్‌ను పరిశీలించిన తర్వాత ఏఎన్‌-94 రైఫిల్‌ను వాడారనే నిర్ధారణకు వచ్చారు. రష్యాకు చెందిన ఈ ఆయుధాన్ని అక్కడి సాయుధ బలగాలే వినియోగిస్తాయి. మరి ఆ రైఫిల్‌ ఇక్కడికెలా వచ్చింది? అనే అనుమానం మొదలైంది. ఇక్కడి గ్యాంగ్‌లు వాడడం సంచలనంగా మారింది. ఏకే-47 కంటే ప్రాణాంతకమైనదిగా భావించే ఏఎన్‌-94 రైఫిల్‌పైనే ఇప్పుడు సర్వత్రా చర్చ!


నిమిషానికి 1800 రౌండ్లు..

ఈ రైఫిల్‌ ఆటోమాటిక్‌ మోడ్‌లో నిమిషానికి 1800 తూటాలు పేల్చగలదు. టూ-రౌండ్‌ బరస్ట్‌ మోడ్‌లో నిమిషానికి 600 రౌండ్లను పేల్చగలదు.


ఏమిటీ ప్రత్యేకత?

పంజాబ్‌ పోలీసుల నివేదిక ప్రకారం.. సిద్దూ మూసేవాలాను ఏఎన్‌-94 రైఫిల్‌తో హతమార్చారు. ఇది రష్యాలో తయారయ్యే రైఫిల్‌. ఏఎన్‌ అంటే అవ్‌టోమాట్‌ నికొనోవా అని అర్థం. ఈ రైఫిల్‌ను డిజైన్‌ చేసిన గెన్నాడి నికొనోవ్‌ పేరునే దీనికి పెట్టారు. నినొనోవ్‌ మిషన్‌గన్‌ను డిజైన్‌ చేసింది కూడా ఈయనే. ఏఎన్‌-94 డిజైన్‌పై 1980 నుంచి పనిచేయడం మొదలుపెట్టిన ఆయన 1994లో పూర్తిచేశారు.


టార్గెట్‌ రేంజ్‌ 700 మీటర్లు..

ఏకే-47 తూటా సెకనుకు 715 మీటర్ల వేగంతో దూసుకెళ్తే.. ఏఎన్‌-94 నుంచి వచ్చే బుల్లెట్‌ సెకనుకు 900 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 700 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఇది ఏకే-47 రేంజ్‌ కంటే దాదాపు రెట్టింపు. 3.85 కిలోల బరువుండే ఈ రైఫిల్‌ 30-45 క్యాట్రిడ్జిల మ్యాగజైన్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ రైఫిల్‌ను జీపీ-30 గ్రనేడ్‌ లాంఛర్‌పైనా అమర్చవచ్చు.


ఏకే-74కు పోటీగా..

రష్యాలో అత్యంత ఆదరణ పొందిన కలాష్నికోవ్‌

సిరీ్‌సలో ఏకే-74 ఒకటి. దీని స్థానాన్ని భర్తీ చేసేందుకు ఏఎన్‌-94ను అభివృద్ధి చేశారు. అయితే దీని ఖరీదు చాలా ఎక్కువ. 1997లో రష్యా సాయుధ బలగాల్లో చేరినప్పటికీ.. లోపభూయిష్టమైన డిజైన్‌, సంక్లిష్టత కారణంగా ఏకే-74 స్థానాన్ని ఇది భర్తీ చేయలేకపోయింది. అయినప్పటికీ రష్యా సైన్యం కొన్ని అవసరాలకు ఇప్పటికీ దీన్ని వాడుతోంది.

Updated Date - 2022-06-02T08:36:27+05:30 IST