తమిళనాడు ఎన్నికల కోసమేనా?

ABN , First Publish Date - 2021-03-01T09:49:19+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం భిన్నాభిప్రాయంతో ఉన్న ట్టు తెలుస్తోంది.

తమిళనాడు ఎన్నికల కోసమేనా?

  • గోదావరి-కావేరి ప్రాజెక్టుపై అనుమానాలు.. 
  • నదుల అనుసంధానంపై కేంద్రం వరుస భేటీలు
  • తెలంగాణకు భిన్నంగా నిర్ణయాలు
  • ఇచ్చంపల్లిలో బ్యారేజీ ప్రతిపాదనలు
  • 76వేల కోట్లకు పెరగనున్న  వ్యయం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధాన  ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం భిన్నాభిప్రాయంతో ఉన్న ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టుపై కేంద్రం హడావు డి చేస్తుందన్న అనుమానం వ్యక్తమవుతోంది. ప్రాజె క్టు సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా కేవలం ప్రకటించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందే యత్నాలు జరుగుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ను చేపట్టాలంటే తెలంగాణ మద్దతు చాలా కీలకం. కానీ, రాష్ట్ర అభిప్రాయాలకు భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఈ ప్రాజెక్టు ఆచరణలోకి రావడం క్లిష్టతరం కానుంది. ఈ ప్రాజెక్టును చేపట్టాలని కేంద్రం నిర్ణయించి ఇప్పటికే డీపీఆర్‌ను కూడా సిద్ధం చేశారు. నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో సమావేశమైన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ కూడా ఈ ప్రాజెక్టుపై చర్చించింది. ఈ నెల 4న కేంద్ర హోం మంత్రి ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్‌ సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. తిరుపతిలో జరగనున్న సమావేశంలో తెలంగాణ అధికారులు పాల్గొనే అవకాశం ఉంది. ఇందులో చర్చించాల్సిన పలు అంశాలను తెలంగాణ ప్రతిపాదించింది.


ముఖ్యం గా కాళేశ్వరానికి జాతీయ హోదాను కల్పించడంతో పాటు, రాష్ట్ర నీటి వాటాకు ఇబ్బందులు కలగకుండా నదుల అనుసంధానం ఉండాలని కోరుతోంది. ఒక వేళ గోదావరి నీటిని కావేరి బేసిన్‌కు తరలించాలని నిర్ణయిస్తే... ముందుగా మహానది నీటి ని గోదావరిలోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. అయితే, తెలంగాణ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే కేంద్రం ముందుకు వెళుతోందని ప్రస్తుత నిర్ణయాలను బట్టి తెలుస్తోం ది. మహానది-గోదావరి ప్రాజెక్టుపై సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించిన కేంద్రం, తర్వాత దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ముఖ్యంగా పూర్తి స్థాయి సర్వేను చేపట్టలేదు. డీపీఆర్‌ను కూడా తయారు చేయలేదు. మరోవైపు గోదావరి- కావేరి ప్రాజెక్టుపై ముందుకు వెళతామని ప్రకటిస్తోంది. 


 బ్యారేజీ ఇచ్చంపల్లిలోనేనా?

గోదావరి నదిపై నిర్మించే బ్యారేజీ విషయంలోనూ రాష్ట్ర అభిప్రాయాన్ని కేంద్రం లెక్కలోకి తీసుకోవడం లేదు. తొలుత ఖమ్మం జిల్లా అనికెపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించగా.. ఇప్పుడు దాన్ని ఇచ్చంపల్లికి మార్చాలని కేంద్రం ప్రతిపాదించింది. మొదట గోదావరి-కావేరి ప్రాజెక్టుకు రూ.46 వేల కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. తర్వాత తర్వాత కొన్ని మార్పులు చేసి మరో ప్రతిపాదన రూపొందించగా.. రూ.76 వేల కోట్లు అవుతుందని భావిస్తున్నారు.  

Updated Date - 2021-03-01T09:49:19+05:30 IST