బాధితుల పరామర్శ తప్పా..?

ABN , First Publish Date - 2022-08-11T05:18:28+05:30 IST

రౌడీ షీటర్ల చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్‌ సురేంద్ర కుటుంబాన్ని పరామర్శించడం తప్పా అని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వైసీీపీ పైన విరుచుకపడ్డారు

బాధితుల పరామర్శ తప్పా..?
బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న అఖిల ప్రియ, ఫరూఖ్‌, భూమా బ్రహ్మానందరెడ్డి

మమ్మల్ని బయటికి పంపిస్తారా?
చనిపోయిన కానిస్టేబుల్‌ కుటుంబాన్ని ఆదుకోవాలి
లేకపోతే ఆందోళనకు దిగుతాం
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ


నంద్యాల, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రౌడీ షీటర్ల చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్‌ సురేంద్ర కుటుంబాన్ని పరామర్శించడం తప్పా అని  మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వైసీీపీ పైన విరుచుకపడ్డారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఫరూఖ్‌తో కలిసి ఆమె బుధవారం ఇటీవల హత్యకు గురైన కానిస్టేబుల్‌ ఇంటికి వెళ్లి   కుటుంబసభ్యులను పరామర్శించారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాల్‌ ద్వారా బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తుండగానే స్థానిక పోలీసులు వచ్చి టీడీపీ నాయకులను బయటకు పంపే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ నాయకులకు, పోలీసులకు చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పోలీసు కుటుంబం చనిపోతే కనీసం పరామర్శించడానికి కూడా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, వైసీపీ నాయకులు తీరుబాటు దొరకలేదని అన్నారు. అలాంటి వారు బాధితులకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. తాము బాధ్యతగా  వచ్చి పరామర్శిస్తూ ఉంటే పోలీసులతో బయటకు పంపించాలని ప్రయత్నిస్తారా? అన్నారు. మూడు నెలల క్రితం ఓ హోం గార్డు ఆకతాయిల దాడిలో చనిపోయాడని, ఇపుడు రౌడీల చేతిలో కానిస్టేబుల్‌ చనిపోయాడని, వైసీపీ పాలనతో  పోలీసులకే రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఇక సామాన్య ప్రజలకు ప్రభుత్వం ఏం రక్షణ కల్పిస్తుందని ఆమె మండిపడ్డారు. గతంలో ఆకతాయిలను ఓ సీఐ మందలిస్తే, వారికి సీఐ చేత క్షమాపణలు చెప్పించిన ఘనత ఎమ్మెల్యేదని గుర్తు చేశారు. దీన్నిబట్టి పోలీసులపై రాజకీయ నాయకుల ఒత్తిడి ఏ స్థాయిలో ఉన్నదో తెలుస్తోందని అన్నారు. ఎమ్మెల్సీ ఫరూఖ్‌ మాట్లాడుతూ బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ తాము బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చామని, రాద్ధాంతం చేయడానికి రాలేదని అన్నారు. కానిస్టేబుల్‌ సురేంద్ర హత్య ఘటనతో రౌడీ మూకలకు ఎవరినైనా చంపేయగలమన్న ధీమా వచ్చిందని అన్నారు.

Updated Date - 2022-08-11T05:18:28+05:30 IST