సందిగ్ధం వీడేనా?

ABN , First Publish Date - 2021-03-01T05:37:38+05:30 IST

ఈ ఏడాది కాళేశ్వరం నీళ్లతో రంగనాయకసాగర్‌, కొండపోచమ్మసాగర్‌, అంతగిరి రిజర్వాయర్లలో నీళ్లు ఉండడంతో పాటూ జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. భూగర్భజలాలు పెరగడంతో జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం కూడా విపరీతంగా పెరిగింది.

సందిగ్ధం వీడేనా?
కొనుగోళ్లు చేపడుతున్న దృశ్యం (ఫైల్‌)

 2.56 లక్షల ఎకరాల్లో వరి సాగు

ఆరు లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి అంచనా

కొనుగోలు కేంద్రాలపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం

కేంద్రాలు లేకుంటే మద్దతు ధర ప్రశ్నార్థకమే!? 

సమీపిస్తున్న వరికోతలు.. ఆందోళనలో అన్నదాతలు



సిద్దిపేటఅగ్రికల్చర్‌, ఫిబ్రవరి 28 : ఈ ఏడాది కాళేశ్వరం నీళ్లతో రంగనాయకసాగర్‌, కొండపోచమ్మసాగర్‌, అంతగిరి రిజర్వాయర్లలో నీళ్లు ఉండడంతో పాటూ జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. భూగర్భజలాలు పెరగడంతో జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం కూడా విపరీతంగా పెరిగింది. 

సిద్దిపేట జిల్లాలో ఈ సారి గణనీయంగా వరిసాగు చేశారు. ఈ యాసంగి 2.56 లక్షల ఎకరాల్లో వరి పంట వేశారు. గతేడాది యాసంగిలో 1.62 ఎకాల్లో సాగుచేయగా, ఈ ఏడాది అదనంగా 94వేల ఎకరాల్లో వరిసాగు చేశారు.  ఏప్రిల్‌ రెండో వారంలో  పొలాలు కోతకు వచ్చే అవకాశం ఉంది. దాదాపు నెలరోజుల్లో  మార్కెట్‌కు వరి ధాన్యం రానుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల్లో కలవరం మొదలైంది. కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయచట్టాలను తీసుకొచ్చిన నేపథ్యంలో, సీఎం కేసీఆర్‌ పంటల కొనుగోళ్లతో రూ.7,500 కోట్ల నష్టం వాటిల్లిందని, ఇది ప్రభుత్వ బాధ్యత కాదని ప్రకటించడంతో ఈసారి కొనుగోలు కేంద్రాలు ఉంటాయా లేదా రైస్‌మిల్లర్ల పైనే ఆధారపడాల్సి వస్తుందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. 


గణనీయంగా పెరిగిన వరి సాగు

జిల్లాలో ఈ యాసంగిలో 2.83 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగుచేశారు. రికార్డు స్థాయిలో 2.56 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యింది.  సాధారణంగా యాసంగిలో ఎకరాకు 30 క్వింటాళ్ల వరి ధాన్యం దిగుబడి వస్తుంది. అక్కడక్కడా తక్కువ దిగుబడి వచ్చానా సగటున 24 నుంచి 25 క్వింటాళ్ల మేరకు దిగుబడికి ఢోకా ఉండదని అంచనా. ఎకరాకు 24 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా జిల్లాలో 6.14 మెట్రిక్‌ టన్నుల దిగుబడి రానున్నది. జిల్లాలో సాగుచేసిన వరి విస్తీర్ణంలో దాదాపు 20వేల ఎకరాల్లో విత్తన పంట ఉంది.  విత్తన దిగుబడి 30 నుంచి 35 వేల మెట్రిక్‌ టన్నులు ఉంటుందని భావిస్తున్నారు. ఈ విత్తన పంటను ఆయా కంపెనీలే కొనుగోలు చేయనున్నాయి.  ఈ లెక్కన సుమారు 5.4లక్షల నుంచి 5.6 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం మార్కెట్‌కు రానున్నది.

గతంలో దాదాపు అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 395 ధాన్యం కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో 223,  ప్రాథమిక వ్యవసాయ సహకారసంఘ ఆధ్వర్యంలో 166,  మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో 6  కొనుగోలు  కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.543.74 కోట్ల విలువ చేసే 2.88 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశారు.  ఈ సారి అదనంగా మరో 2.5 లక్షల వరి ధాన్యం మార్కెట్‌కు రానున్నదని భావిస్తున్నారు. ఈ తరుణంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఉంటుందో లేదో అన్న విషయంలో  స్పష్టత లేకుండా పోయింది.


కొనుగోలు కేంద్రాలు లేకుంటే మద్దతు ధర ప్రశ్నార్థకమే

రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోతే రైతులు ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గతంలో 395 సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయగా ప్రస్తుతం అంతకుమించి ధాన్యం మార్కెట్‌కు వస్తే జిల్లాలోని 14 మార్కెట్‌ యార్డుల ద్వారా కొనుగోలు చేయడం ఎలా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గ్రామాల వారీగా రైతులకు తేదీలు నిర్ణయించి ధాన్యం కొనుగోలు చేసినా మార్కెట్‌కు  తరలించడం, అక్కడి నుంచి రైస్‌మిల్లులకు తరలించడం ఇబ్బందిగా  పరిణమిస్తుంది. నెలలు తరబడి ధాన్యం అమ్మకాలపై వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రైవేటు వ్యాపారులు, రైస్‌ మిల్లర్లపై ఆధారపడి తక్కువ ధరకే ధాన్యం విక్రయించుకోవాల్సిన అఘాత్యం ఏర్పడుతుందని, మద్దతు ధర లభించే అవకాశం లేకుండా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.


నాలుగైదు రోజుల్లో స్పష్టత

ప్రభుత్వం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు నాలుగైదు రోజుల్లో ఓ నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించి జిల్లాలకు కొనుగోలు కోసం కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూత్రప్రాయంగా సూచించిందని,  దీనికనుగుణంగా జిల్లా పౌరసరఫరాలశాఖ సిద్ధమైందని సమాచారం. వీలైనంత వరకు ధాన్యం కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నా స్వయంగా ముఖ్యమంత్రి, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రులే  మార్కెట్‌ యార్డులోనే కొనుగోళ్లు చేపడతారని ప్రకటించిన నేపథ్యంలో రైతులకు అనుమానాలు తొలగిపోవడం లేదు.

Updated Date - 2021-03-01T05:37:38+05:30 IST