తల తొందరగా తెల్లబడిందా?

ABN , First Publish Date - 2022-07-05T08:39:19+05:30 IST

తల తొందరగా తెల్లబడిందా?

తల తొందరగా తెల్లబడిందా?

తల తెల్లబడితే, వయసు పైబడుతోందని అనుకునేవాళ్లం. కానీ ఇది ఒకప్పటి పరిస్థితి. ఇప్పుడు బాల నెరుపు చిన్న వయసు లోనే మొదలవుతోంది. అలాగని ఇప్పుడిదంతా మామూలే అని సరిపెట్టుకోవలసిన అవసరం లేదు. ఈ సమస్యకు మూల కారణాన్ని  కనిపెట్టి, దాన్ని  సరిదిద్దుకుంటే, బాల నెరుపు దూరమై, నల్ల జుట్టు సొంతమవుతుంది. 


25 ఏళ్ల లోపు ఏ వయసులో వెంట్రుకలు నెరిసినా దాన్ని బాల నెరుపుగానే భావించాలి. కొందరికి తల మొత్తంగా అక్కడక్కడా వెంట్రుకలు నెరిస్తే, ఇంకొందరికి చెంపల దగ్గర, తలలో ఏదో ఒక చోట వెంట్రుకలు నెరుస్తాయి. అయితే అది ఎలాంటి నెరుపైనా పాతికేళ్ల లోపు కనిపిస్తే కచ్చితంగా బాల నెరుపే! ఈ నెరుపుకు చిన్నాపెద్దా, ఆడామగా తేడా ఉండదు. ఎవరికైనా రావొచ్చు.


కాలానుగుణ మార్పుల ప్రభావం

వాతావరణం, ఆహార కాలుష్యం, ఒత్తిడి... బాల నెరుపు తీవ్రత కాలక్రమేణా పెరగడానికి ప్రధాన కారణాలు! పూర్వంతో పోల్చుకుంటే ఆహారంలో కృత్రిమత్వం పెరిగింది. వాతావరణంలో కాలుష్యమూ పెరిగింది. మానసిక ఒత్తిడికీ కొదవ లేదు. ఇవన్నీ కాలక్రమేణా బాల నెరుపు తీవ్రమవడానికి దోహదపడ్డాయి.


ఇవీ కారణాలు

వంశపారంపర్యం: జన్యుపరంగా ఈ లక్షణం సంక్రమించి ఉంటే, తల్లితండ్రులకు ఏ వయసులో తెల్ల వెంట్రుకలు కనిపించాయో, అదే వయసుకు పిల్లల్లో కూడా మొదలవుతాయి.

కంజెనిటల్‌ డిసీజెస్‌: కొందరు పిల్లలు పుడుతూనే జన్యుపరమైన సమస్యలను వెంట తెచ్చుకుంటారు. ఉదాహరణకు....‘అప్లాస్టిక్‌ అనీమియా’, ‘థైరాయిడ్‌’ సమస్యలు పుట్టుకతోనే సంక్రమించి ఉంటే, పెరిగే క్రమంలో పిల్లల్లో ప్రి మెచ్యూర్‌  గ్రేయింగ్‌ మొదలవుతుంది. 

గ్లూటేన్‌ ఎలర్జీ: కొందరికి గ్లూటేన్‌ ఎలర్జీ ఉంటుంది. దీన్నే ‘సీలియాక్‌ డిసీజ్‌’ అంటారు. ఇలాంటివాళ్లు గ్లూటేన్‌ ఉన్న పదార్థాలు తింటే, బాల నెరుపు తలెత్తవచ్చు. 


పోషకాల లోపం ఉన్నా...

ప్రొటీన్‌ లోపం ఉన్నా, ఐరన్‌ తగ్గి అనీమియాకు (రక్తహీనత) లోనైనా, కాపర్‌ లోపం ఉన్నా వెంట్రుకలు తెల్లగా మారతాయి. ఈ లోపాల తీవ్రత ఏ వయసులో పెరిగితే ఆ వయసులో తెల్ల వెంట్రుకలు కనిపించడం మొదలవుతాయి. పిల్లల్లో ఈ సమస్య సర్వసాధారణం. తినడానికి ఇష్టపడని పిల్లలు, ఇంటి భోజనానికి బదులుగా బయటి చిరుతిళ్లు తినే పిల్లల్లో పోషకాహార లోపం చివరకు తెల్ల వెంట్రుకల రూపంలో బయల్పడుతుంది. 


పేను కొరుకుడు ఉంటే?

పేను కొరుకుడు చికిత్స మొదలు పెట్టిన తర్వాత మొలకెత్తే వెంట్రుకలు తెల్లగా ఉండి, క్రమేపీ నల్లబడతాయి. 25 ఏళ్ల లోపు వ్యక్తులు ఈ సమస్యకు చికిత్స తీసుకుంటున్నప్పుడు, ఊడిపోయిన వెంట్రుకల స్థానంలో తెల్ల వెంట్రుకలు మొలకెత్తితే కంగారు పడవలసిన అవసరం లేదు. ఆ వెంట్రుకలు క్రమేపీ నల్లబడతాయి.


బొల్లి ఉంటే?

బొల్లి ఉన్న ప్రదేశంలో మెలనిన్‌ లోపించి, అక్కడి వెంట్రుకలు కూడా తెల్లబడతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే! 


ఒత్తిడి ప్రధాన కారణం

శరీరంలో మెలనిన్‌ తయారీకి అడ్డుపడే ప్రధాన అంశం ఒత్తిడి. మానసిక ఒత్తిడి... అది వ్యక్తిగతమైనదైనా, వృత్తిగతమైనదైనా... ఏ కారణంగా చోటు చేసుకున్నా ఆ ప్రభావం మెలనిన్‌ మీద పడి, దాని తయారీ తగ్గి, ఫలితంగా వెంట్రుకలు తెల్లబడడం మొదలవుతాయి. 


చదువు ఒత్తిడీ కారణమే!

ఇటీవలి కాలంలో పిల్లల్లో ప్రి మెచ్యూర్‌ గ్రేయింగ్‌ పెరగడానికి ప్రధాన కారణం చదువు ఒత్తిడి. మార్కుల కోసం, అదే పనిగా చదవమని ఒత్తిడి చేసినా, మెలనిన్‌ పరిమాణం తగ్గి వెంట్రుకలు తెల్లబడతాయి.


మల్టిపుల్‌ రీజన్స్‌

కొందరిలో ప్రి మెచ్యూర్‌ గ్రేయింగ్‌కు ఇదీ కారణం అని నిర్దిష్టంగా చెప్పలేం! ఎక్కువ శాతం మందిలో ఒకటికి  మించి కారణాలు కలిసి ఉండవచ్చు. పోషకాల లోపం, ఒత్తిడి, కాలుష్యం, జన్యుపరం... ఇలా అన్ని అంశాలూ కలగలిసి, ప్రి మెచ్యూర్‌ గ్రేయింగ్‌ తీవ్రంగా మారవచ్చు. ఇంకొందరిలో వెంట్రుకలు తెల్లబడే వేగం పెరగవచ్చు. 


చికిత్సలతో ఫలితం అస్పష్టం!

చికిత్సతో సరిదిద్దగలిగే కారణాలైతే వాటిని సరిదిద్ది తెల్ల వెంట్రుకలను క్రమంగా నల్లగా మార్చవచ్చు. పోషకాహార లోపాన్ని ఆహారం, సప్లిమెంట్లతో సరి చేయవచ్చు. ఇందుకు నోటి మాత్రలు, లోషన్లు సరిపోతాయి. అయితే పుట్టుకతో సంక్రమించిన జన్యుపరమైన సమస్యలు, వంశపారంపర్య లక్షణాలను చికిత్సతో నయం చేసే వీలు లేదు. అలాగే పర్యావరణ మార్పుల వల్ల వచ్చిన ప్రి మెచ్యూర్‌ గ్రేయింగ్‌నూ సరి చేయడం కష్టం. బాల నెరుపుకు ఒత్తిడి కారణమైతే దాన్ని తగ్గించుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ బాల నెరుపు సమస్యకు ఇదీ కారణం అని కచ్చితంగా గుర్తించడం కొంత క్లిష్టమే! 


హెన్నా ఓకే!

కృత్రిమ రంగులతో పోల్చుకుంటే హెన్నా మంచిదే! అయితే దీని వల్ల తెల్ల వెంట్రుకలు ఎర్రగా మారుతున్నాయని, హెన్నాలో కలరింగ్‌ ఏజెంట్లు కలపకూడదు. ఇలా చేస్తే హెయిర్‌ డైకి, హెన్నాకు తేడా లేకుండా పోతుంది.


హెయిర్‌ డై వాడవచ్చు!

ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న హెయిర్‌ డైలలో అమ్మోనియా వాడడం లేదు. కాబట్టి వెంట్రుకలకు జరిగే హాని తక్కువే! అయుతే వీటి వల్ల చర్మపు ఎలర్జీలు వచ్చే వీలుంటుంది. కాబట్టి ముందుగా చర్మం మీద అప్లై చేసి 42 గంటల తర్వాత కూడా ఎలర్జీ తలెత్తకపోతేనే వెంట్రుకలకు అప్లై చేసుకోవాలి. 


కనుబొమ్మల్లో...

కొందరికి కనుబొమ్మల్లో కొన్ని వెంట్రుకలు కుచ్చులా తెల్లబడతాయి. దీన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి ఆ వెంట్రుకలను తొలగించి, తల నుంచి సేకరించిన నల్ల వెంట్రుకలతో భర్తీ చేయవచ్చు. 


కారణం కనిపెట్టడం ప్రధానం

బాల నెరుపుకు అసలు కారణాన్ని కనిపెట్టగలిగితే సమస్య పరిష్కారం శులభమవుతుంది. ఇందుకోసం ఏ పోషకలోపం ఉందో పరీక్షలతో తెలుసుకోవాలి. థైరాయిడ్‌, అప్లాస్టిక్‌ ఎనీమియాలను గుర్తించే పరీక్షలూ చేయక తప్పదు. అలాగే వంశపారంపర్యంగా సంక్రమించిందేమో గమనించాలి. జన్యు సమస్యలనూ అంచనా వేయాలి. పరీక్షల్లో ఇవేవీ కారణాలు కావని తేలితే ఒత్తిడిని కారణంగా భావించాలి. 


హెయిర్‌ ట్రీట్మెంట్లతో జర భద్రం! 

హెయిర్‌ స్ట్రయిటెనింగ్‌, పర్మింగ్‌, స్ర్పేలు, హెయిర్‌ బ్లోయింగ్‌... ఇలాంటి చికిత్సల వల్ల వెంట్రుకలు డ్యామేజీ అవుతాయి. 

ఈ చికిత్సలు తరచుగా చేయించుకోవడం వల్ల ఆ చికిత్సల ప్రభావంతో వెంట్రుకలు తెల్లబడే అవకాశం లేకపోలేదు. కాబట్టి సాధ్యమైనంతవరకూ ఈ చికిత్సలకు దూరంగా ఉండడమే మేలు!

Updated Date - 2022-07-05T08:39:19+05:30 IST