నోరు మెదపరేం?

Published: Tue, 18 Jan 2022 00:26:49 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నోరు మెదపరేం?

కడప, నెల్లూరుకు నీటి తరలింపు
కేసీ, తెలుగుగంగ పంటలకు ముప్పు
ఏప్రిల్‌ వరకూ నీరిస్తేనే పంట చేతికి..
ఫిబ్రవరి 15 వరకే అంటున్న అధికారులు
పట్టించుకోని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు


ఆ రెండు జిల్లాల అధికారపార్టీ నేతలు ఆదేశించారు.. ఇక్కడి అధికారులు పాటిస్తున్నారు. వెలుగోడు నీరు పంపించేస్తున్నారు. ఈ పరిణామంతో జిల్లా రైతులు దిక్కులు చూస్తున్నారు. పంటలు ఎలా కాపాడుకోవాలని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలూ వైసీపీ వారే. అయినా ఏ ఒక్కరూ నోరు మెదపడం లేదు. వీరి వైఖరి వల్ల కేసీ, తెలుగు గంగ కింద పంటల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లా నాయకులు పట్టించుకోకపోతే తీవ్రంగా నష్టపోతామని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ రైతు పేరు ఎల్లారెడ్డి. కర్నూలు మండలం మునగాలపాడు. ఎకరానికి రూ.10వేల ప్రకారం నాలుగెకరాలను గుత్తకు తీసుకున్నాడు. ఖరీఫ్‌లో పంట భారీ వర్షాలకు చేతికందకుండా పోయింది. రబీలో మినుము సాగు చేశాడు. బాడుగ ఎద్దులతో ఎకరం పొలం దున్నేందుకు రూ.4 వేలు ఖర్చు అవుతుంది. అందుకే కొడుకుతో కలిసి నాగలి పట్టుకుని రెక్కల కష్టంతో దున్నారు. కేసీ కెనాల్‌కు నీరు ఎప్పుడు వదులుతారా? అని రోజూ ఎదురు చూస్తున్నారు. అధికారుల నుంచి స్పందన లేదు. ఇప్పటికే పంటపై రూ.40వేల దాకా ఖర్చు చేశాడు. ఈ పరిస్థితుల్లో నీటిని విడుదల చేయకుంటే నిండా మునుగుతామని రైతు కంటతడి పెడుతున్నాడు.

కర్నూలు(అగ్రికల్చర్‌), జనవరి 17: జిల్లాలో రబీ పంటగా కేసీ కెనాల్‌, తెలుగుగంగ కింద దాదాపు లక్షన్నర ఎకరాల్లో వరి, ఆరుతడి పంటలను రైతులు సాగు చేశారు. నీటి కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అయితే కడప, నెల్లూరు జిల్లాలకు చెందిన కొందరు అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లకు నీటి పారుదల శాఖ అధికారులు తలొగ్గారు. వెలుగోడు జలాశయంలో ఉన్న 10 టీఎంసీల నీటిని రోజుకు 4వేల క్యూసెక్కుల చొప్పున కడపలోని బ్రహ్మసాగరం, నెల్లూరులోని కండలేరు జలాశయాలకు వదులుతున్నారు. జిల్లాలో ఇప్పటికే సాగు చేసిన పంటలకు నీరివ్వకుండా పక్క జిల్లాల జలాశయాలకు వదలడం ఏమిటని కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అధికారులను ప్రశ్నించారు. అయితే తమ చేతుల్లో ఏమీ లేదని, అధినాయకులను ఒప్పించుకోండని ఉన్నతాధికారులు చేతులెత్తేశారు. కానీ అధినాయకుల వద్ద ఈ సమస్యను ప్రస్తావించే ధైర్యం జిల్లా ప్రజాప్రతినిధులు చేయలేకపోతున్నారు. గట్టిగా నిలదీస్తే తమ పదవులకు ముప్పు వస్తుందని వెనుకడుగు వేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు చెబితేనే కేసీ కెనాల్‌, తెలుగుగంగ కాలువల కింద పంటలు సాగు చేశామని, ఇప్పుడు నీరు ఇవ్వలేమని అధికారులు చేతులెత్తేస్తే ఎలా అని రైతులు వాపోతున్నారు. ఎకరా సాగుకు 30 వేల ప్రకారం లక్షన్నర ఎకరాలకు దాదాపు రూ.450 కోట్ల దాకా జిల్లా రైతులు ఖర్చు చేశారు. సాగునీరు ఇవ్వకపోతే ఈ మొత్తం మట్టిలో కలిసిపోతుందని రైతులు కంటతడి పెడుతున్నారు.

వెలుగోడులో 10 టీఎంసీలు

వెలుగోడు రిజర్వాయరులో 10 టీఎంసీల నీరు ఉంది. ఈ నీటిని తెలుగుగంగ కాల్వ కింద ఉన్న లక్ష ఎకరాల ఆయకట్టుకు ఇవ్వొచ్చు. కానీ కడపలోని బ్రహ్మసాగరం జలాశయానికి నీటిని విడుదల చేయాలని అధినేతల నుంచి మౌఖిక ఆదేశాలు ఉండటంతో రోజూ 4వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జిల్లాలో ఉన్న జలాశయం నుంచి తమకు నీరు ఇవ్వకుండా పొరుగు జిల్లాలకు ఎలా తరలిస్తారని రైతులు మండిపడుతున్నారు. శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని మహానంది, బండి ఆత్మకూరు, వెలుగోడు మండలాల రైతులు ప్రతి రోజూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. వెలుగోడు జలాశయం నుంచి ఆయకట్టుకు నీరివ్వకుంటే బ్రహ్మ సాగరం జలాశయానికి నీటిని విడుదల చేయకుండా గేట్లను మూసి వేస్తామని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి రైతులతో కలిసి నీటి పారుదల శాఖ అధికారులను కలిసి హెచ్చరించారు. ఈ పరిస్థితిని అంచనా వేసిన అధికారులు తొందర పడవద్దని, ఏదో విధంగా సమస్యను పరిష్కరిస్తామని రైతులకు నచ్చజెబుతున్నారు.

కేసీ కెనాల్‌ కింద డిసెంబరులో లక్ష ఎకరాలకు పైగానే వరి, ఆరుతడి పంటలు సాగు చేశారు. తుంగభద్ర జలాశయంలో కేసీ వాటాగా 5 టీఎంసీలకు పైగానే నిల్వ ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి కేసీ కెనాల్‌ ఆయకట్టుకు నీటిని విడుదల చేసుకునే అవకాశం ఉంది. అధికారులు మాత్రం రబీలో నీరు ఇవ్వలేమని స్పష్టం చేశారు. తుంగభద్ర జలాశయంలో కేసీ కెనాల్‌ ఆయకట్టుకు నీటి వాటా ఉన్నా, నదీ ద్వారా ఈ నీటిని తీసుకోవాల్సి ఉంటుందని, ఆ నీటిని విడుదల చేసినా కర్ణాటక, తెలంగాణ రైతులు దారి మళ్లిస్తారని అంటున్నారు. అందువల్ల కర్నూలు జిల్లా రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి విడుదల చేసేందుకు శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 854 అడుగులు ఉండాలని, తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి కోసం ఎడాపెడా వాడుకుంటున్నందున అది సాధ్యం కాదని అంటున్నారు.

ఎమ్మెల్యేలు పట్టించుకోరా?

కేసీ, తెలుగుగంగ ఆయకట్టు పంటలకు మార్చి లేదా ఏప్రిల్‌ నెలాఖరు వరకు నీరు ఇవ్వాలి. తెలుగుగంగ ఆయకట్టుకు ఫిబ్రవరి 15 వరకు, కేసీ ఆయకట్టుకు మార్చి వరకు నీరు ఇస్తామని అధికారులు అంటున్నారు. ఇంత తక్కువ వ్యవధిలో పంటలు ఎలా చేతికి వస్తాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన డీఆర్‌సీ సమావేశంలో సాగునీటి ప్రస్తావనే లేకుండా అజెండాను అధికారులు దారి మళ్లించారు. నీటి గురించి ఎమ్మెల్యేలు పట్టుబడుతారన్న ఉద్దేశంతో మంత్రుల సూచనలతో నీటి పారుదల శాఖ అధికారులు అజెండాలో ఈ అంశాన్నే చేర్చలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రుల తీరును ఎండగడుతున్నారు. జిల్లాలోని 14 నియోజకవర్గాలలో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు ఆ పార్టీ వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా ఆయకట్టు రైతుల తరపున గట్టిగా మాట్లాడలేకున్నారు. జిల్లా నీటి వాటాను రాబట్టేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేకున్నారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి డిసెంబరు 3న హామీ ఇచ్చినందుకే తాము పంటలు సాగు చేశామని, ఇప్పుడు చేతులు ఎత్తేస్తే ఎలా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవులు రావన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రిని, మంత్రులను అధికార పార్టీవారు ప్రశ్నించడం లేదని రైతులు మండిపడుతున్నారు.

బ్రహ్మసాగరం నాణ్యత పరిశీలనకే..

కడప జిల్లాలోని బ్రహ్మసాగరం జలాశయానికి రూ.50 కోట్లతో డయా ఫ్రమ్‌ వాల్‌ను నిర్మించారు. ఆ జలాశయాన్ని పూర్తిగా నింపితే నాణ్యతపై స్పష్టత వస్తుంది. అందుకే వెలుగోడు జలాశయం నుంచి బ్రహ్మసాగరానికి నీటిని విడుదల చేస్తున్నాము. ఏ సంవత్సరమైనా ఒక సీజన్‌కు మాత్రమే నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఖరీఫ్‌ పంట జూన్‌లో వేసి ఉంటే రబీలో ముందుగానే పంటలు సాగు చేసుకునే వీలు ఉండేది. నీటి విడుదలకు ఇబ్బంది ఉండేది కాదు. ఖరీఫ్‌ పంటలను ఆగస్టులో కాల్వల కింద సాగు చేశారు. అందుకే రబీలో ఈ పరిస్థితి ఏర్పడింది. కేసీ కెనాల్‌ ఆయకట్టుకు మార్చి 15 వరకు నీటి విడుదలకు చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే సాగైన పంటలకు ఇబ్బంది ఉండదు. ఏప్రిల్‌ నెలాఖరు వరకు నీటిని విడుదల చేయడం సాధ్యం కాదు. తుంగభద్ర జలాశయంలో ఉన్న నీటితో పాటు శ్రీశైలం జలాశయంలో ఉన్న నీటిని కూడా కేసీ కెనాల్‌ ఆయకట్టుకు విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. రైతులు అర్థం చేసుకోవాలి.

- మురళీధర్‌ రెడ్డి, సీఈ

ఎమ్మెల్యే చెప్పినందుకే..

తెలుగుగంగ కాల్వ ద్వారా నీరు ఇస్తామని, పంటలు సాగు చేసుకోండని ఎమ్మెల్యే శిల్పా డిసెంబరు 3న చెప్పారు. అందుకే అప్పులు చేసి పంట సాగు చేశాను. రూ.లక్షన్నర దాకా పెట్టుబడి పెట్టి 12 ఎకరాల్లో వరి పంటను సాగు చేశాను. ఇప్పుడు నీరు ఇవ్వలేమని అధికారులు చెబుతున్నారు. గట్టిగా అడిగితే.. ఫిబ్రవరి 15వరకే ఇస్తామని చెబుతున్నారు. ఏప్రిల్‌ వరకు నీరు ఇస్తేనే మా పంట చేతికి వస్తుంది. ఖరీఫ్‌లో జరిగిన నష్టాన్ని పూడ్చుకోగలుగుతాం.

- వెంకట్రాముడు, రైతు, బండి ఆత్మకూరు

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.