‘వన్‌ నేషన్‌-వన్‌ మార్కెట్‌’ సాధ్యమేనా?

ABN , First Publish Date - 2020-07-07T07:14:46+05:30 IST

వన్‌ నేషన్‌- వన్‌ మార్కెట్‌ నినాదంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఆర్డినెన్స్‌ నెం.10/2020 అమలుపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. రైతుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం తీసుకువచ్చిన ఈ ఆర్డినెన్స్‌ను అమలు చేస్తే మార్కెటింగ్‌ శాఖకు వచ్చే

‘వన్‌ నేషన్‌-వన్‌ మార్కెట్‌’  సాధ్యమేనా?

మహబూబ్‌నగర్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వన్‌ నేషన్‌- వన్‌ మార్కెట్‌ నినాదంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఆర్డినెన్స్‌ నెం.10/2020 అమలుపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. రైతుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం తీసుకువచ్చిన ఈ ఆర్డినెన్స్‌ను అమలు చేస్తే  మార్కెటింగ్‌ శాఖకు వచ్చే ఆదాయం 60 శాతం మేర పడిపోయే పరిస్థితి ఏర్పడనుంది. దీంతో ఎలా అమలు చేయాలనేదానిపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాల్లోని మార్కెటింగ్‌ అధికారుల నుంచి మార్కెట్ల వారీగా, పంటల ఉత్పత్తుల వారీగా వస్తున్న ఆదాయాలు, పన్నులు, సెస్సుల వివరాలను సేకరించింది. ఇతర జిల్లాల నుంచి వచ్చే ఉత్పత్తుల ద్వారా లభించే ఆదాయమెంత, మార్కెట్లలో క్రయవిక్రయాల ద్వారా వచ్చే ఆదాయమెంత తదితర అంశాలను విశ్లేషిస్తోంది.  


తగ్గనున్న 60 శాతం ఆదాయం

ఈ ఆర్డినెన్స్‌ను యథాతథంగా అమలు చేస్తే వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఆదాయం కనీసం 60 శాతం తగ్గిపోతుందని అధికారులు చెబుతున్నారు. మార్కెట్‌ కమిటీలకు ప్రస్తుతం అంతర్‌ జిల్లా చెక్‌పోస్టులు, అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులతో పాటు, మార్కెట్లలో లైసెన్స్‌లు పొంది మార్కెట్‌ ఆవల లావాదేవీలు నిర్వహించే ట్రేడర్లు చెల్లించే పన్నులు, నిత్యం మార్కెట్లలో జరిగే లావాదేవీలు, వివిధ రకాల మిల్లుల ద్వారా ఆదాయం సమకూరుతోంది. తాజా ఆర్డినెన్స్‌తో ఈ కేటగిరీలన్నీ రద్దయిపోతాయి. కేవలం మార్కెట్‌లో జరిగే క్రయవిక్రయాలకు మాత్రమే మార్కెట్‌ రుసుం వసూలు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు  పాలమూరులోని ఒక జిల్లాలో ఏడాదికి రూ. 5.90 కోట్లు లభిస్తే, ఆర్డినెన్స్‌ను అమలు చేస్తే ఆ  ఆదాయం రూ. 2.35 కోట్లకు మించదని అధికారులు విశ్లేషిస్తున్నారు.  అదేవిధంగా రెండు ఇతర రాష్ట్రాల సరిహద్దులు కలిగిన మరో జిల్లాలో ఏడాదికి రూ.4 కోట్లు వస్తే, ఆర్డినెన్స్‌ అమలుతో ఆదాయం రూ. 2 కోట్లకు మించదని తేల్చారు. కాగా, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, రైతుల పేరుతో దళారులు, వ్యాపారులు లబ్ధిపొందే చర్యలను కట్టడిచేయాలనే సూచనలు వస్తున్నాయి.

Updated Date - 2020-07-07T07:14:46+05:30 IST