రింగ్‌రోడ్డు పూర్తయ్యేదెన్నడో?

ABN , First Publish Date - 2021-07-28T04:41:45+05:30 IST

ఆర్భాటంగా ప్రారంభమైన గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ రింగ్‌రోడ్డు పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. ఆరేళ్ల క్రితం సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేసిన రింగ్‌రోడ్డు పనులకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి.

రింగ్‌రోడ్డు పూర్తయ్యేదెన్నడో?
ప్రజ్ఞాపూర్‌ వద్ద నిలిచిపోయిన రింగ్‌రోడ్డు పనులు

 ఆరేళ్లుగా నత్తతో పోటీ పడుతున్న పనులు

 రెండేళ్లుగా పూర్తిగా నిలిచిన పనులు

 తట్టా, బుట్టా సర్దుకుని వెళ్లిపోయిన కాంట్రాక్టర్‌


గజ్వేల్‌, జూలై 27: ఆర్భాటంగా ప్రారంభమైన గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ రింగ్‌రోడ్డు పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. ఆరేళ్ల క్రితం సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేసిన రింగ్‌రోడ్డు పనులకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. రూ.220 కోట్ల వ్యయంతో చేపట్టిన 22కిలోమీటర్ల రింగ్‌రోడ్డు ఆరేళ్లలో కేవలం 18 కిలోమీటర్ల మేర పూర్తయింది. తొమ్మిది రింగ్‌లను నిర్మించాలని భావించగా, ఇప్పటివరకు కేవలం మూడు రింగ్‌లను మాత్రమే పూర్తిచేశారు. ఇంకా నాలుగు కిలోమీటర్ల మేర రింగ్‌రోడ్డుతో పాటు ఆరు రింగ్‌లను నిర్మించాల్సి ఉంది. భూసేకరణ, కోర్టు కేసుల కారణంగా అడ్డంకులు పడుతున్నాయి. 


ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికే


గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ పట్టణం రోజురోజుకు విస్తరిస్తుండడం, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మధ్య రోడ్డుపై ట్రాఫిక్‌ పెరిగిపోవడంతో రింగ్‌రోడ్డును నిర్మించి, భారీ వాహనాలను పట్టణంలోకి రాకుండా రింగ్‌రోడ్డు నుంచి వెళ్లేలా చేసేందుకు అధికారులు ప్లాన్‌ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో రూ.30కోట్లతో 209 ఎకరాల భూసేకరణ, రూ.190 కోట్లతో రింగ్‌రోడ్డు నిర్మాణం మొత్తం రూ.220 కోట్ల వ్యయంతో చేపట్టాలని నిర్ణయించారు. శ్రీగిరిపల్లి, రిమ్మనగూడ, బయ్యారం, జాలిగామ, క్యాసారం, ధర్మారెడ్డిపల్లి, ముట్రాజ్‌పల్లి, సంగాపూర్‌ గ్రామాల మీదుగా 22 కిలోమీటర్ల మేర, నాలుగు వరుసల రోడ్డుగా తొమ్మిది రింగ్‌లు, నాలుగు రేడియల్‌ రోడ్లతో అద్భుతంగా డిజైన్‌ చేశారు. ఈ క్రమంలో 22 కిలోమీటర్లలో 18 కిలోమీటర్ల మేర పనులు పూర్తవగా, తొమ్మిది రింగ్‌లలో రెండు రింగ్‌లు వంద శాతం పూర్తవగా, మరో రింగ్‌ 90శాతం పూర్తయింది. మిగిలిన ఆరు రింగ్‌ల పనిచేపట్టలేదు. ఇక రేడియల్‌ రోడ్లలో ముట్రాజ్‌పల్లి, సంగాపూర్‌, పిడిచెడ్‌ మార్గంలో సగం పనులు మాత్రమే పూర్తయ్యాయి. చేగుంట రోడ్డు పూర్తయింది. 


భూసేకరణ, కోర్టు కేసులతో నిలిచిన పనులు


గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ రింగ్‌రోడ్డు భూసేకరణలో పలువురు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేకపోవడంతోనే రింగ్‌రోడ్డు పనులు పెండింగ్‌ పడటానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ముట్రాజ్‌పల్లి, ప్రజ్ఞాపూర్‌, గజ్వేల్‌లో దాదాపు 10 ఎకరాల భూసేకరణ పెండింగ్‌లో ఉండడం, ఈ భూమి విషయమై భూయజమానులు కోర్టులకు ఎక్కారు. అధికారులు పెండింగ్‌లో ఉన్న పలువురి భూయజమానులకు సంబంధించిన డబ్బులను కోర్టులో డిపాజిట్‌ చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా రింగ్‌రోడ్డు జంక్షన్ల వద్ద భూమి పెద్ద ఎత్తున సేకరించాల్సి రావడంతోనే ఈ సమస్య ఏర్పడినట్లు తెలుస్తుంది. ప్రజ్ఞాపూర్‌ నుంచి శ్రీగిరిపల్లి, రిమ్మనగూడ శివార్లలో రాజీవ్‌రహదారిలో అంతర్భాగంగా ఏడు కిలోమీటర్ల మేర 150 అడుగు వెడల్పుతో ఆరు లైన్ల రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే ఐదున్నర కిలోమీటర్ల మేర పూర్తయింది. మిగిలిన విస్తీర్ణంలో భూసేకరణ జరుగక పెండింగ్‌లో పడింది. 


తాజా ధరలతో మరోసారి టెండర్లు 


గతంలో వచ్చిన కాంట్రాక్టర్‌ భూసమస్యల కారణంగా పెండింగ్‌లో పెట్టి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయాడు. దీంతో పనులు రెండేళ్లుగా నిలిచిపోయాయి. 2015లో ఉన్న ఆయా మెటీరియల్‌ ధరలకు, తాజా ధరలకు తీవ్ర వ్యత్యాసం ఉండడంతో ధరలు గిట్టుబాటు కాదని సదరు కాంట్రాక్టర్‌ వెళ్లిపోయినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌ ప్రజలకు మొదటగా ఇచ్చిన హామీ నెరవేరకపోతే ప్రభుత్వం విమర్శల పాలవుతుందని భావించిన అధికారులు ఇటీవల మరోసారి తాజా ధరలతో టెండర్లను పిలిచినట్లు తెలుస్తున్నది. 


Updated Date - 2021-07-28T04:41:45+05:30 IST