బడి బస్సు భద్రమేనా?

ABN , First Publish Date - 2022-05-24T06:00:39+05:30 IST

వేసవి సెలవుల అనంతరం జూన్‌ నెలలో పాఠశాలలో పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలలు, స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌పై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు.

బడి బస్సు భద్రమేనా?

- జిల్లాలో 169 బస్సులు... ఫిట్‌ నెస్‌ పొందినవి 8 బస్సులు 

- 15 ఏళ్లు దాటినవి 25 బస్సులు

- జూన్‌లో ప్రారంభం కానున్న విద్యాసంస్థలు 

- ఫిట్‌నెస్‌ లేకుండా రోడ్డుమీదికి వస్తే సీజ్‌  

- నిశితంగా పరిశీలిస్తున్న రవాణాశాఖ అధికారులు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

వేసవి సెలవుల అనంతరం జూన్‌ నెలలో పాఠశాలలో పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలలు, స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌పై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు. పాఠశాలల ప్రారంభంతోనే స్పెషల్‌ డ్రైవ్‌ కూడా నిర్వహించనున్నారు. ఫిట్‌నెస్‌లేని వాహనాలు రోడ్డుమీదికి వస్తే సీజ్‌ చేయనున్నారు.  జిల్లాలో ఇప్పటి వరకు ఫిట్‌నెస్‌ ప్రక్రియ వేగం పుంజుకోలేదు. జిల్లాలో 169 బస్సులు ఉండగా ఎనిమిది బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్‌ చేయించారు. 136 బస్సులకు ఫిట్‌నెస్‌ చేయించాల్సి ఉంది. 

 కాలం చెల్లినవి 25 బస్సులు..

పాఠశాలలు, కళాశాలలకు వినియోగించే బస్సులు వాహన రిజిస్ట్రేషన్‌ అయిన నుంచి 15 ఏళ్లు మాత్రమే రోడ్డుమీద తిరిగే అవకాశం ఉంటుంది. అలాంటి బస్సులు జిల్లాలో 25 ఉన్నట్లుగా గుర్తించారు. రవాణాశాఖ ఫిట్‌నెస్‌ విషయంలోనూ 15 ఏళ్లు దాటిన బస్సులపై పూర్తిగా కఠినంగా వ్యవహరించడంతో పాటు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 35 ప్రకారం ఫిట్‌నెస్‌లేని వాహనాల్లో స్కూల్‌ పిల్లలను తీసుకవెళ్లి ప్రమాదాల బారిన పడకుండా అవగాహన కల్పిస్తున్నారు. 

 ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌.. 

ఆన్‌లైన్‌లో విద్యా సంస్థపూర్తి వివరాలు, వాహన యజమాని వివరాలతో వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. చిన్నవాహనానికి 835 రూపాయలు, పెద్ద వాహనానికి  1,035 రూపాయల రుసుము చెల్లించాలి. ఫిట్‌నెస్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకున్న తేదీ సమయం కేటాయించిన రోజు సంబంధిత ఆర్టీఏ కార్యాలయానికి బస్సును ఫిట్‌నెస్‌ పరీక్ష చేయించుకోవాలి. తరువాత సర్టిఫికేట్‌ జారీ చేస్తారు. 

 ఫిట్‌నెస్‌ నిబంధనలు ఇవీ.. 

స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌కు సంబంధించిన పత్రాలు పొందడానికి నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ఇందుకు కఠినంగానే నిబంధనలు పరిశీలిస్తున్నారు.

- విద్యార్థులను పరిమితికి మించి తీసుకవెళ్లరాదు 

- బస్సు చక్రాలు కొత్తవిగా ఉండాలి. 10 శాతం కన్నా ఎక్కువగా 

 అరుగుదల ఉండవద్దు 

- బస్సుకు అద్దాలు ఉండాలి.. ఎమర్జెన్సీ డోర్‌ తప్పనిసరిగా ఉండాలి

- సరిపడా మందులతో ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ ఉండాలి

- బస్సు క్లచ్‌, బ్రేక్‌ ఎప్పుడూ సరిచూసుకోవాలి

- చిన్నపిల్లల బస్సులో 325 సెంటిమీటర్ల పైనా మెట్లు ఉండాలి

- బస్సుకు సైడీ రెయిలింగ్‌ అవసరం...బస్సులో నిలువు రాడ్లు ఉండాలి 

- కార్మిక్స్‌ మిర్రర్‌ ఉండాలి. ఈ అద్దం గుండా బస్సులోని పిల్లలను 

ఎప్పటికప్పుడు డ్రైవర్‌ పరీక్షించాలి

- బస్సుకు అప్పర్‌లైట్లు ఉండాలి, బస్సును నిలిపినపుడు ఈ లైట్లు 

వెలుగుతూ ఉండాలి

- ప్రతీ బస్సులో సహాయకుడు ఉండాలి. బస్సులో ప్రయాణించే అయా 

పిల్లల వివరాలు, చిరునామా, మొబైల్‌ నంబర్‌ బస్సు చార్ట్‌లో పొందు

పరచాలి

- విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్‌తో కలిసి నెలకొకసారి వాహ

నాన్ని పరిశీలించాలి.

- బస్సు డ్రైవర్‌ పేరు, చిరునామా, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వివరాలు అన్‌లై

న్‌లో నమోదు చేయాలి

- డ్రైవర్‌కు ప్రతీ మూడు నెలలకు ఒకసారి బీపీ, షుగర్‌, కంటి చూపు 

పరీక్షలను ఆయా విద్యా సంస్థలు చేయించాలి. 

- 60 ఏళ్లు పైబడినవారిని డ్రైవర్‌గా నియమించవద్దు, వాహన డ్రైవ

ర్‌కు ఐదేళ్ల అనుభవం ఉండాలి. 

- కంటి చూపు, వినికిడి సమస్య ఉన్నవారితో డ్రైవింగ్‌ చేయించవద్దు. 

- మద్యం వ్యసనం ఉంటే తొలగించాలి


- ఫిట్‌ నెస్‌ లేకుంటే బస్సులు సీజ్‌

- కొండల్‌రావు, జిల్లా రవాణా శాఖ అధికారి

ఫిట్‌నెస్‌ లేకుండా స్కూల్‌ బస్సులు రోడ్లపైకి వస్తే సీజ్‌ చేస్తాం. ఫిట్‌నెస్‌కు వచ్చే ముందు నిబంధనల ప్రకారం బస్సు ఉండేలాగా చూసుకోవాలి. డ్రైవర్లు రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన పెంచుకోవాలి. జిల్లాలో ఇంకా 136 బస్సులు ఫిట్‌నెస్‌ పొందాల్సి ఉంది. పాఠశాలలు జూన్‌లో ప్రారంభం అవుతున్న దృష్యా ఫిట్‌నెస్‌ చేయించుకోవాలి.  ఫిట్‌నెస్‌ లేని బస్సులపై రవాణా శాఖ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఫిట్‌నెస్‌తో పాటు పొల్యూషన్‌ సర్టిఫికేట్‌, ఇతర ధ్రువీకరణ పత్రాలను పొందాలి. డ్రైవర్లకు ఇప్పటికే అవగాహన కూడా కల్పించాం. ఫిట్‌నెస్‌పై విస్తృత స్థాయిలో తనిఖీలు కూడా చేపడతాం. 15 సంవత్సరాలు దాటిన బస్సులను ఇతర అవసరాలకు ఉపయోగించుకున్న వాటిని రిజిస్ర్టేషన్‌లో మార్పులు చేసుకోవాలి. 


Updated Date - 2022-05-24T06:00:39+05:30 IST