Advertisement

మత్తు మరక చెడ్డదేనా?

Sep 29 2020 @ 01:30AM

మరక...

మత్తు మరక...

తారలకు అంటుతుందా?

ఒకవేళ అంటితే చెరుగుతుందా?

కెరీర్‌లో కిందకు లాగుతుందా??

గతం ఏమంటోంది?

భవిష్యత్‌ ఎలాగుంటుంది?

మత్తు మరక చెడ్డదేనా???

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యా? హత్యా? నిజానిజాలు నిగ్గు తేల్చడానికి మొదలైన దర్యాప్తు మాదకద్రవ్యాల (డ్రగ్స్‌) వినియోగం దగ్గరకు వచ్చింది. ఇందులో తారలకు మత్తు మరక అంటుతుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేం! ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో నుండి హిందీ కథానాయికలు దీపికా పడుకోన్‌, శ్రద్ధా కపూర్‌, సారా అలీ ఖాన్‌, తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితురాలైన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సమన్లు అందుకున్నారు. విచారణకు హాజరై వచ్చారు. ఈ కేసులో రియా చక్రవర్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇటు దక్షిణాదిలో చందనసీమలో ఇద్దరు కథానాయికలు రాగిణీ ద్వివేది, సంజనా గల్రానీని బెంగళూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. కరణ్‌ జోహార్‌ ఇచ్చిన ఓ పార్టీలో తారలు డ్రగ్స్‌ తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.


డ్రగ్స్‌ కేసు విచారణలో తారలు అలా ప్రవర్తించారట? ఇలా చేశారట? అని కొన్ని కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇవన్నీ పక్కనపెడితే... దర్యాప్తు పూర్తయ్యి తారలు దోషులుగా తేలితే సినిమా కెరీర్‌ మీద ఆ ప్రభావం ఉంటుందా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తాయి. అదేమీ ఉండదని చరిత్ర చెబుతోంది. సినిమా కెరీర్‌ మీద ప్రభావం పడనప్పటికీ... యాడ్‌ కెరీర్‌ మీద మాత్రం ప్రభావం చూపే అంశాలు పుష్కలంగా ఉన్నాయట. ఇటీవల ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ బ్రాండ్స్‌ (ఐఐహెచ్‌బి) నిర్వహించిన సర్వేలో మాదకద్రవ్యాల కళంకితులుగా తేలినోళ్లు ప్రచారం చేసే ఉత్పత్తులను కొనుగోలు చేయమని జనం చెప్పారు. దీన్నిబట్టి తారల కొసరు ఆదాయంపై మత్తు మరక ప్రభావం చూపుతుందని అనుకోవచ్చు. సినిమాలు తారలకు అసలు ఆదాయ వనరు అనుకుంటే... సినిమాల వల్ల వచ్చిన పేరుప్రఖ్యాతలు తెచ్చిపెట్టే వాణిజ్య ప్రకటనల ఆదాయం కొసరు అని చెప్పుకోవాలి. ఒక్కోసారి వాణిజ్య ప్రకటనలు తారలకు కోట్లకు కోట్ల రూపాయలు పారితోషికాలు తెచ్చిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ మత్తు మరక అంటితే ఆ ఆదాయం కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.


దీపిక, రకుల్‌, శ్రద్ధా, సారా... కథానాయికలుగా అగ్రశ్రేణిలో ఉన్నారు. రియా తరహాలో అరెస్ట్‌ అయ్యి జైలుకు వెళితే? మత్తు మరక అంటుకుంటే? కెరీర్‌ పరిస్థితి ఏమిటి? అవకాశాలు తగ్గుతాయా? అంటే... ఏమీ తగ్గవనే సమాధానం సినిమా సర్కిళ్లు, ట్రేడ్‌ వర్గాల్లో వినపడుతోంది. హాలీవుడ్‌ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకునే హీరోల్లో ఒకరైన రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ను అందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఐరన్‌ మ్యాన్‌గా హిట్లు అందుకున్న అతను ఒకానొక సమయంలో డ్రగ్స్‌కి బానిస. కొన్ని రోజులు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అయితే, అతని కెరీర్‌ మీద అదేమీ ప్రభావం చూపలేదు. ఇదే విషయం చెబుతున్న బాలీవుడ్‌ నిర్మాత ప్రీతిశ్‌ నందీ ‘‘డ్రగ్స్‌ అనేది వ్యక్తిగత వ్యవహారం. దాంతో ఎవరికీ సంబంధం లేదు. ప్రతి ఒక్కరి సమస్యనూ మన సమస్యగా చూడటంతో మరో సమస్య మొదలవుతోంది’’ అంటున్నారు. 


బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ కూడా ఒకానొక సమయంలో మత్తు పదార్థాలకు బానిసే. అతని బయోపిక్‌ ‘సంజు’లో ఆ సంగతి చెప్పారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న కేసులో సంజయ్‌ దత్‌ జైలుకూ వెళ్లొచ్చారు. అయినా... అతడికి అవకాశాలు వస్తున్నాయి. ప్రేక్షకులూ ఆదరిస్తున్నారు. అక్రమ ఆయుధాల కేసు సమయంలో విడుదలైన ‘ఖల్‌ నాయక్‌’ (1993) విజయం సాధించింది. సల్మాన్‌ ఖాన్‌ మీద కృష్ణజింకల కేసు, రోడ్‌ యాక్సిడెంట్‌ కేసు ఉన్నాయి. అవేవీ అతని సినిమా విజయాలపై ప్రభావం చూపడం లేదు.


రియా చక్రవర్తి మీద కూడా సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ప్రభావం ఉండకపోవచ్చనేది కొందరి మాట. బాలీవుడ్‌ ట్రేడ్‌ అనలిస్ట్‌ కోమల్‌ నాథ్‌ మాట్లాడుతూ ‘‘రేఖ భర్త ముఖేశ్‌ అగర్వాల్‌ ఆత్మహత్య చేసుకున్నప్పుడు దేశమంతా ఆమెను దూషించింది. కొందరు ఆమెను బజారుమనిషి అన్నారు. భర్తను బలి తీసుకుందన్నారు. అది జరిగిన కొన్ని రోజులకు రేఖ నటించిన ‘ఫూల్‌ బనే అంగారే’ విడుదలకు సిద్ధమైంది. దర్శక-నిర్మాత కేసీ బొకాడియా విడుదల వాయిదా వేయడానికి ఇష్టపడలేదు. ఆ సినిమా విజయం సాధించింది’’ అన్నారు. మాదకద్రవ్యాల కేసులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్లతో పని చేయడానికి పలువురు బాలీవుడ్‌ దర్శక, నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. మత్తు మరక తారల కెరీర్‌ మీద ప్రభావం చూపదనేది ఎక్కువమంది చెప్పే మాట.

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.